మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

మాండౌస్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

రాష్ట్రమంతా ముసురు
మరో రెండ్రోజులు వానలు 
ఆగిన వడ్ల కొనుగోళ్లు.. రైతుల్లో టెన్షన్​

హైదరాబాద్, వెలుగు:  మాండౌస్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రమంతా రెండ్రోజులుగా ముసురు పట్టింది. ఆదివారం హైదరాబాద్ తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలో మరో రెండు రోజులు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మాండౌస్ ​ప్రభావంతో ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్​లో రోజంతా ముసురుపట్టింది. గద్వాల జిల్లా అలంపూర్, వడ్డేపల్లి, సూర్యాపేట జిల్లా వడ్డెనపల్లిలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలి పెరిగింది. మెదక్​లో అతి తక్కువగా17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  

రైతులకు తప్పని కష్టాలు  

వానల కారణంగా వడ్ల కొనుగోళ్లు ఆగిపోవడంతో సెంటర్లకు ధాన్యం తెచ్చిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు మినహా కోతలు పూర్తయి వడ్లు కొనుగోలు సెంటర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో ముసురు మొదలవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లను  కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. సెంటర్లలో సరిపడా టార్పాలిన్లు లేవు. దీంతో వడ్లు తడవకుండా చూసేందుకు సంచులు, పాలిథీన్‌‌ కవర్లను కప్పుతున్నారు. ధాన్యాన్ని వేగంగా మిల్లులకు చేర్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా కాంటా పెట్టిన వడ్లు బస్తాలకు బస్తాలు సెంటర్లలోనే ఉంటున్నాయి.