ఇంటర్ ఫలితాలపై దుమారం

ఇంటర్ ఫలితాలపై దుమారం
  • ఇంటర్ బోర్డు నిర్వాకం.. ఫస్టియర్​ ఫలితాలపై దుమారం
  • స్టూడెంట్లు, పేరెంట్ల ఆందోళన 
  • సెకండియర్​లో చేరిన నాలుగు నెలలకు పరీక్షలు
  • టీవీ పాఠాలతో మమ.. ప్రిపరేషన్​కు ఇచ్చింది నెలే
  • 30 పేపర్లే దిద్దాల్సిన లెక్చరర్లతో 50 పేపర్ల దాకా దిద్దించారని ఆరోపణలు
  • ఎన్నడూ లేనిది 49 శాతానికి పడిపోయిన పాస్ పర్సెంటేజీ

ఫిజికల్ క్లాసుల్లెవ్వు. మానిటరింగ్ అస్సల్లేదు. ప్రిపరేషన్​ టైమన్నా ఇయ్యలే. కనీసం పేపర్‌‌‌‌ ఎట్లుంటదో సూద్దామంటే టైంకు మోడల్ పేపర్లూ ఇయ్యలె. ఇన్ని గందరగోళాల మధ్య ఇంటర్ బోర్డు హడావుడిగా ఫస్టియర్ ఎగ్జామ్స్ పెట్టింది. అర్థంలేని నిర్ణయాలతో స్టూడెంట్ల ప్రాణాలతో చెలగాటమాడింది. మూడేండ్ల కిందటి స్టూడెంట్ల ఆత్మహత్యలను మరవకముందే, సర్కారు చేష్టలతో మరోసారి రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు.

హైదరాబాద్, వెలుగు: రెండు రోజుల కింద ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచి ముగ్గురు స్టూడెంట్లు చనిపోయారు. మరో స్టూడెంట్‌‌ తాను చనిపోతున్నానని, తన చావుకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డే కారణమని ట్వీట్ చేశాడు. ఇవన్నీ సర్కారు, ఇంటర్ బోర్డు హత్యలేనని స్టూడెంట్స్ యూనియన్లు విమర్శిస్తున్నాయి. ఇంటర్ సెకండియర్ స్టూడెంట్లకు అక్టోబర్ 25 నుంచి నవంబర్ 3 దాకా ఫస్టియర్ ఎగ్జామ్స్ జరగడం తెలిసిందే. 4,59,242 మంది ఎగ్జామ్స్ రాయగా 2,24,012 మంది పాసయ్యారు. ఏకంగా 2,35,230 మంది ఫెయిలవడం ఇదే తొలిసారని ఆఫీసర్లే చెప్తున్నారు. కిందటేడాదితో పోలిస్తే రిజల్ట్ 11 శాతం తగ్గింది. పాసైనోళ్లలో కూడా చాలామంది బోర్డర్ మార్కులతో గట్టెక్కినోళ్లే. ఎగ్జామ్స్​రాసి ఫెయిలైనోళ్లను మినిమం మార్కులతో పాస్ చేస్తామని మీడియాకు లీకులిచ్చిన బోర్డు అధికారులు ఇప్పుడా మాటే ఎత్తడం లేదు. గతంలో ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పుల వల్లే స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నా బోర్డు, సర్కారు పాఠం నేర్చుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితాల వెల్లడిని చివరిదాకా దాయడం మీదా అనుమానాలున్నాయి. పైగా ఫలితాల్లో మేనేజ్మెంట్లు, ఇయర్స్​వారీ వివరాలివ్వలేదు. ప్రభుత్వ కాలేజీల్లో, గురుకులాల్లో రిజల్ట్ భారీగా పడిపోయినట్టు తెలుస్తోంది.

టీవీ పాఠాలే దిక్కు
కరోనా వల్ల 2020–21 ఇంటర్ ఫస్టియర్​క్లాసులు టీవీలకే పరిమితమయ్యాయి. దూరదర్శన్, టీశాట్ ద్వారా జరిగాయి. స్టూడెంట్లు రోజు వింటున్నారా లేదా అనే వివరాలను బోర్డు సేకరించలేదు. 1,800 మంది గెస్టు లెక్చరర్లను రెన్యువల్ కూడా చేయకపోవడంతో సర్కారు కాలేజీల్లో పాఠాలు వింటున్నదీ లేనిదీ మానిటరింగే లేకుండా పోయింది. ఇక లాస్టియర్ ఫిజికల్ క్లాసులు 23 రోజులే జరిగాయి. వీటికీ సగం మంది కూడా అటెండవలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు తెరుచుకోలేదు. స్టూడెంట్లపై ఈ ఎఫెక్ట్ భారీగానే పడింది. పాఠాలు అర్థంకాక పరీక్షలు సరిగా రాయలేదని తెలుస్తోంది.

సెకండియర్లో ఫస్టియర్ ఎగ్జామ్స్
మేలో జరగాల్సిన ఫస్టియర్ పరీక్షలు కోవిడ్ దెబ్బకు వాయిదా పడ్డాయి. ఫస్టియర్ స్టూడెంట్లను ప్రమోట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ అకడమిక్ ఇయర్ లో క్లాసులు జులైలో మొదలయ్యాయి. సెప్టెంబర్1 నుంచి ఫిజికల్ క్లాసులు నడుస్తున్నాయి. స్టూడెంట్లంతా సెకండియర్​ పాఠాలపై దృష్టి పెడుతున్న సమయంలో సర్కారు సడెన్ గా ఫస్టియర్ పరీక్షలు పెడుతున్నట్టు ప్రకటించింది. అక్టోబర్ 25 నుంచి ఉంటాయంటూ జస్ట్ నెల ముందు షెడ్యూల్ ఇచ్చింది. అప్పుడే స్టూడెంట్లు, పేరెంట్స్ దీన్ని విమర్శించారు. అకడమిక్ మధ్యలో ఎగ్జామ్స్​ఏమిటని ఆందోళన చేశారు. కానీ లాభం లేకపోయింది. సెకండియర్​చదువుతూ ఫస్టియర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. మోడల్ పేపర్లు, బిట్ బ్యాంక్ బోర్డు సైట్​లో పెడతామని ప్రకటించినా ఎగ్జామ్స్ మొదలయ్యాకే పెట్టారు. చివరికి ఆన్సర్ షీట్ల వాల్యువేషన్​పైనా స్టూడెంట్లు, పేరెంట్లలో అనుమానాలున్నాయి. రూల్స్ ప్రకారం ఒక లెక్చరర్ రోజుకు 30 పేపర్లే దిద్దాలి. కానీ చాలా క్యాంపుల్లో వారితో 45 నుంచి 50 పేపర్ల దాకా దిద్దించారు.

రిజల్ట్ టైమ్​లో ప్రాక్టికల్స్
ఎప్పుడైనా పరీక్షలకు ముందే ప్రాక్టికల్స్ జరుగుతాయి. కానీ ఇంటర్ ఒకేషనల్ స్టూడెంట్ల విషయంలో ఇది రివర్సయింది. ఫస్టియర్ ఒకేషనల్ స్టూడెంట్లకు ప్రాక్టికల్స్ ఉంటాయన్న విషయమే బోర్డు మరిచిపోయింది. తీరా ఈ నెల ఫస్ట్ వీక్​లో రిజల్ట్ రిలీజ్ టైమ్​లో ప్రాక్టికల్స్ విషయం గుర్తొచ్చింది. దాంతో తమ తప్పు బయటపడుతుందని భయపడ్డ బోర్డు అధికారులు ప్రాక్టికల్స్ రాయకుండానే వాటిలో ఫుల్ మార్కులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. సర్కారు వద్దనడంతో ఈ నెల 3 నుంచి 7 దాకా హడావుడిగా ప్రాక్టికల్స్ పెట్టారు. చాలామంది స్టూడెంట్లకు దీనిపై సమాచారమే ఇవ్వలేదు. దాంతో సర్కారు కాలేజీల్లోనే పరీక్షలు రాసిన 3 వేల మంది ప్రాక్టికల్స్ కు అటెండ్​కాలేదు. వారంతా ఫెయిలయ్యారు.

బోర్డు ముట్టడి..స్టూడెంట్ లీడర్ల అరెస్టు
ఫస్టియర్ పరీక్షల్లో ఫెయిలైన స్టూడెంట్లకు న్యాయం చేయాలని ఎస్​ఎఫ్ఐ, పీడీఎస్​యూ, ఎన్​ఎస్​యూఐ డిమాండ్ చేశాయి. స్టూడెంట్ యూనియన్లు శుక్రవారం ఇంటర్ బోర్డును ముట్టడించాయి. మార్కులు తక్కువగా రావడంతో స్టూడెంట్లంతా ఉదయం నుంచే బోర్డు కార్యాలయానికి దారి తీశారు. నిరసనలుంటాయని ఊహించి పోలీసు బందోబస్తు పెట్టారు. ఎవరినీ లోపలికి పోనివ్వకుండా బారికేడ్లు పెట్టారు. విద్యార్థులతో కలిసి వచ్చిన ఎస్​ఎఫ్​ఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వాళ్లు గేట్ ముందు బైఠాయించారు. సర్కారుకు, బోర్డు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోపలికి దూసుకుపోయే ప్రయత్నం చేయగా అరెస్టు చేశారు. ఇంతలో పీడీఎస్​యూ, ఎన్ఎస్​యూఐ లీడర్లు స్టూడెంట్లతో కలిసి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వాళ్లందరినీ అరెస్టు చేశారు. ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతని ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్​యూఐ, పీడీఎస్​యూ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, వెంకట్, జూపాక శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఫీజుల ముసుగులో కార్పొరేట్​కాలేజీలు దోచుకునేందుకు వీలు కల్పించడానికే పరీక్షలు పెట్టారని మండిపడ్డారు. ‘‘ఫెయిలైన వారందరినీ పాస్ చేయాలి. ఎక్కువ మార్కుల కోసం మళ్లీ పరీక్షలు పెట్టాలి. దీనిపై సీఎం కేసీఆర్​ వెంటనే స్పందించాలి. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తం” అని అన్నారు.

ఫెయిలైనోళ్లు ఏప్రిల్‌లో రాసుకోవచ్చు: బోర్డు
ఫస్టియర్​లో ఫెయిలైన స్టూడెంట్లు ఏప్రిల్‌లో పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని ఇంటర్ బోర్డు చెప్పింది. మంత్రి ఆదేశాల మేరకు రీ వెరిఫికేషన్​ ఫీజును సగం తగ్గిస్తున్నట్టు బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తెలిపారు. ఫలితాల్లో అవకతవకలేమీ లేవన్నారు. అనుమానాలుంటే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. ఎగ్జామ్స్​కు 70 శాతం సిలబసే ఇచ్చామని, క్వశ్చన్లలో చాయిస్ పెంచామని చెప్పారు. ఒత్తిడి, భయం ఉన్న స్టూడెంట్లు బోర్డు ఏర్పాటు చేసిన సైకాలజిస్టులను సంప్రదించాలని సూచించారు.

అందరినీ పాస్ చేయాలి
ఆన్​లైన్ పాఠాలు స్టూడెంట్లకు అర్థం కాలేదని ఫస్టియర్ రిజల్టును బట్టి అర్థమైతున్నది. సర్కారీ కాలేజీల స్టూడెంట్లు టీవీ పాఠాలతో తీవ్రంగా నష్టపోయారు. మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోకుండా ఫస్టియర్​లో ఫెయిలైన స్టూడెంట్లందరికీ మినిమం మార్కులు వేసి పాస్ చేయాలి. పరీక్షల విధానాన్ని సమూలంగా మార్చాలి.
- మధుసూదన్​రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్

కార్పొరేట్ల కోసమే ఎగ్జామ్స్
కార్పొరేట్ కాలేజీల కోసమే ఇట్ల సెకండియర్ మొదలైనంక ఫస్టియర్ పరీక్షలు పెట్టిన్రు. ప్రైవేటు కాలేజీలున్న చోట్ల రిజల్ట్ పెరిగింది. ఆన్​లైన్ సౌకర్యం లేని సర్కారు కాలేజీల స్టూడెంట్లకు తీవ్ర నష్టం జరిగింది. ఫెయిలైన స్టూడెంట్లకు న్యాయం చేయాలి.
- రామకృష్ణ గౌడ్, ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్