యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సైదాపురం గ్రామ ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సమక్షంలో.. బుధవారం మండలంలోని ఆయా గ్రామాల ఉప సర్పంచులు అందరూ కలిసి సైదాపురం ఉప సర్పంచ్ దుంబాల వెంకట్ రెడ్డిని మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు దుంబాల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఉప సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడిగా గౌరాయపల్లి ఉప సర్పంచ్ బింగి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిగా జిన్నా బాలరాజు, కార్యదర్శిగా సూర శ్రీను, కోశాధికారిగా నర్సింహ్మా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్లాపురం సర్పంచ్ మంగ సత్యనారాయణ, దాతారుపల్లి సర్పంచ్ సరిత భాస్కర్ తదితరులు ఉన్నారు.
