డేంజర్ జోన్ లో దుర్గం చెరువు.. మురుగు, వ్యర్థాలతో నిండిన లేక్

డేంజర్ జోన్ లో దుర్గం చెరువు.. మురుగు, వ్యర్థాలతో నిండిన లేక్
  •     మురుగు, వ్యర్థాలతో నిండిన లేక్ 
  •     ఆస్పత్రులు, కంపెనీల నుంచి చేరిక
  •     183  సూక్ష్మ విష కారకాల గుర్తింపు
  •     మహీంద్ర వర్సిటీ, ఐఐటీహెచ్​ టీమ్ స్టడీ
  •     నియంత్రణ చర్యలు చేపట్టని  ప్రభుత్వం

మాదాపూర్, వెలుగు : ఐటీ కారిడార్​కు మణిహారం అయిన దుర్గంచెరువు డేంజర్ గా తయారైంది. వ్యర్థాలు, కాలుష్యంతో నిండిపోయి కంపుకొడుతుంది. మురుగుతో పాటు వివిధ కంపెనీల నుంచి వచ్చే వెస్టేజ్ చెరువులో కలుస్తుండగా ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే చెరువు నీటిలో ఆక్సిజన్​లెవల్స్ తగ్గి జలచరాలు చనిపోయినది తెలిసిందే. తాజాగా చెరువు నీటిలో యాంటి డిప్రెసెంట్స్, పెయిన్​కిల్లర్స్, యాంటి ఒబెసిటీ మెడిసిన్స్,  వెయిట్ లాస్ (స్థూలకాయం) తగ్గించే మెడిసిన్ తో పాటు కొకైన్​ వంటి విషపూరిత వ్యర్థాలు ఎక్కువగా ఉన్నట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్​ఐఐటీహెచ్​టీమ్ స్టడీ చేసి గుర్తించింది. చెరువులో పలు ప్రమాదకరమైన కెమికల్స్​ఉన్నట్లు తేల్చింది.  

మంచినీటి సరస్సుగా ఉండి..  

మాదాపూర్ –​ జూబ్లీహిల్స్​ ప్రాంతాల మధ్యన దుర్గం చెరువు 83 ఎకరాల్లో విస్తరించి ఉంది. దశాబ్దాల కిందట చుట్టపక్కల ప్రాంతాలకు మంచినీటి సరస్సుగా ఉండేది. సిటీ అభివృద్ధిలో భాగంగా చెరువు చుట్టూ పెద్దఎత్తున బిల్డింగ్​లు వచ్చాయి. వీటిలో ఇండ్లు, హాస్పిటల్స్, సాఫ్ట్​వేర్​కంపెనీలకు చెందినవి ఉండగా.. వాటి నుంచి వచ్చే మురుగునీరు చెరువులో చేరుతుంది. అంతేకాకుండా హాస్పిటల్స్​వ్యర్థాలు, మెడికల్ వేస్టేజ్ కూడా కలుస్తుండగా కాలుష్యంతో నిండిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుంది. 

చెరువు నీళ్లు టెస్ట్​ చేయగా.. 

ఇటీవల మహీంద్ర యూనివర్సిటీ,  హైదరాబాద్‌‌ ఇండియన్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఐఐటీహెచ్)కి చెందిన పరిశోధకులు ‘ నాన్​టార్గెట్​స్ర్కీనింగ్ ఆఫ్​ఆర్గానిక్​ మైక్రో పొల్యూటెంట్స్’ అంశంపై రీసెర్చ్​చేశారు. ఇందుకు చెరువులోని పలు ప్రాంతాల్లో నీటి శాంపిల్స్​సేకరించి  టెస్ట్ చేయగా 183 రకాల సేంద్రియ సూక్ష్మ కాలుష్య కారకాలు చెరువు నీటిలో ఉన్నట్లు తేలింది. ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర సంహరిణులు, పురుగు మందులు, హార్మోన్లు, స్టెరాయిడ్లు, యూవీ ఫిల్టర్లు, స్టాస్టిసైజర్లు, సైనోటాక్సిన్లు, మెటాబోలైట్లు లాంటివి ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 50శాతం ఫార్మాస్యూటికల్స్​, 9 శాతం మెటాబోలైట్లు, 8 శాతం హెర్బిసైడ్లు ఎక్కువగా ఉండి చెరువు నీటిని విషపూరితంగా మార్చాయి. వీటిద్వారా మానవాళికి, చెరువులోని జలచరాలకు చాలా హానికరమని పరిశోధకులు పేర్కొన్నారు. చెరువు నీటిలో కొకైన్​ కూడా ఉన్నట్లు స్పష్టమైంది.  

గాలిపై ఎఫెక్ట్​

ఆయా విషపూరిత రసాయన వ్యర్థాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూగర్భ జలాలు కలుషితం అవుతాయని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. చెరువు నీరంతా కాలుష్యంతో నిండిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. గాలిపైనా ఎఫెక్ట్ పడుతుందని, అధిక ఉష్ణోగ్రత కారణంగా  చెరువు నీరు ఆవిరి ద్వారా పర్యావరణంలోకి కెమికల్స్ ను ​విడుదల చేసే ప్రమాదం ఉందని తెలిపారు. తద్వారా జనం రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చెరువు చుట్టూ ఉన్న ఆస్పత్రులు, అపార్ట్​మెంట్​కాంప్లెక్స్​లు వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్స్​ను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేశారు. 

వ్యర్థాల నియంత్రణలో ఫెయిల్ 

దుర్గం చెరువు పరిసరాలు కంపు కొడుతుండగా బ్యూటిఫికేషన్ చేశామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఫెయిల్ అయ్యారు. చెరువులోకి చేరే మురుగునీరు, ఇతర వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో అపార్ట్​మెంట్స్​, హాస్పిటల్స్​ నుంచి మురుగునీరు,ఫార్మా వేస్టేజ్​ చెరువులోకి వచ్చి చేరి తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్​లో వాకింగ్​ చేసే వారికి, చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసన భరించలేకపోతున్నారు.