
న్యూఢిల్లీ: ది రాక్ (డ్వేన్ జాన్సన్) పేరును వినే ఉంటారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) మాజీ చాంపియన్ అయిన రాక్‌కు లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలతో అశేష జనానీకానికి ఆయన దగ్గరయ్యారు. ఈ విషయాన్ని పక్కనబెడితే తన కండ బలం బిల్డప్ ఇవ్వడానికే కాదని రాక్ మరోమారు నిరూపించాడు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా తాను హీరోనని ప్రూవ్ చేశాడు. ఒట్టి చేతులతో గేట్‌ను బద్దలు గొట్టిన రాక్ టాక్ ఆఫ్ ది న్యూస్‌గా మారిపోయాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. అర్జెంట్‌గా పని ఉండి బయటకు వెళ్లాల్సి వచ్చిందని, ఎంత యత్నించినప్పటికీ తన ఇంటి గేటు తెరుచుకోకపోవడంతో బద్దలు కొట్టాల్సి వచ్చిందని తెలిపాడు. తనలో లోలోపల దాగి ఉన్న బ్లాక్ ఆడమ్ (ఓ చిత్రంలో రాక్ పోషించిన పాత్ర)ను మేల్కొలిపానన్నాడు. విద్యుత్ సమస్య కారణంగా గేటు తెరుచుకోలేదని, హైడ్రాలిక్ సిస్టమ్ ఓపెన్ చేయడానికి యత్నించినా వర్కౌట్ కాలేదన్నాడు. దాదాపు 45 నిమిషాల పాటు ఎదురు చూశానని, గేటును ముందుకు వెనక్కి తోసి విరగ్గొట్టేశానన్నాడు. గేట్‌ను బద్దలు కొట్టిన గంట తర్వాత తన సెక్యూరిటీ సిబ్బంది గేట్ టెక్నీషియన్, వెల్డర్స్‌ను తీసుకొచ్చారన్నాడు. వాళ్లు బద్దలయి పడి ఉన్న గేట్‌ను చూసి భయపడ్డారన్నాడు.