మృతదేహాలను ఇవ్వకపోవడం క్రూరత్వమే : వేనపల్లి పాండురంగారావు

మృతదేహాలను ఇవ్వకపోవడం క్రూరత్వమే  : వేనపల్లి పాండురంగారావు
  • మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు

నల్గొండ అర్బన్, వెలుగు : ఛతీస్ గఢ్​రాష్ట్రంలో ఈనెల 21 న బూటకపు ఎన్​కౌంటర్​లో మరణించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం క్రూరత్వమేనని ప్రజా సంఘాల సభ్యుడు, మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు అన్నారు. ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నల్గొండలోని అంబేద్కర్ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టుల మృతదేహాలు కూడా పాలకులను భయపెడుతున్నాయంటే.. వారు ఎంత శక్తివంతులో సమాజం గమనించాలన్నారు.

 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నంబాల కేశవరావు, నాగేశ్వరరావు, విజయలక్ష్మి, రాకేశ్, సంగీత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడానికి గల కారణమేంటో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలన్నారు. శత్రువు చనిపోయినప్పటికీ కడసారి చూడాలనే సంప్రదాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గౌరవించకపోవడం శోచనీయమన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో ప్రజాసంఘాల సభ్యులు సుధాకర్ రెడ్డి, సైదులు, రామయ్య, జానకిరామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగార్జున, అనంతరెడ్డి, నరసింహాచారి, శ్రీనివాస్, ఆర్.శ్రీనివాస్, యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.