డేంజర్‌ జోన్‌లో ఎకానమీ

డేంజర్‌ జోన్‌లో ఎకానమీ

అసలేం జరుగుతున్నదో మోడీకి తెలియడంలేదు

న్యూఢిల్లీమోడీ సర్కార్​ మతిలేని విధానాలు, తప్పుడు నిర్ణయాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ఆగమైందని కాంగ్రెస్​ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం  ఆరోపించారు. వరుసగా ఆరో క్వార్టర్​లోనూ జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోవడం.. రాబోయే తీవ్ర పరిణామాలకు సూచన అని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలుగా  స్లోడౌన్ కొనసాగుతున్నా, దాన్నింకా తాత్కాలిక పరిణామంగా ప్రభుత్వం భావించడం దారుణమని,  అసలు ఆర్థిక రంగలో ఏం జరుగుతున్నదో ప్రధాని మోడీకి కనీస అవగాహన లేదని, మంత్రులందరూ అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయి 106 రోజుల తర్వాత తిహార్​ జైలు నుంచి విడుదలైన చిదంబరం గురువారం ఏఐసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఉదయం పార్లమెంట్​ సమావేశాలకు హాజరైన ఆయన.. సహచర కాంగ్రెస్​ ఎంపీలతో కలిసి ఉల్లి ధరలపై నిరసనలోపాల్గొన్నారు.

జనం దగ్గర డబ్బుల్లేవు

పెద్ద నోట్ల రద్దు​, లోపాలతో నిండిన జీఎస్టీ, ట్యాక్స్ టెర్రరిజం, మంచి విధానాలకు పాతరేయడం, మితిమీరిన సెంట్రలైజేషన్​, ప్రతి శాఖపై పీఎంవో పెత్తనం.. ఇవన్నీ కలిపి మొత్తంగా ఆర్థిక వ్యవస్థను మెల్లగా కుప్పకూల్చాయని చిదంబరం చెప్పారు. అన్ని వ్యవస్థలపై ప్రభావం చూపించే ఆర్థిక రంరంగానికి సంబంధించి మోడీ సర్కార్​ తీసుకున్నవన్నీ రివర్స్​ నిర్ణయాలేనన్నారు. ‘‘ఎకానమీపై ప్రధాని మోడీ మాట్లాడరు. మంత్రులేమో ‘స్లోడౌన్​ సహజమే’ అని కవరప్​ చేస్తున్నారు. ఒకప్పుడు 8శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు క్రమంగా 7.. 6.6.. 5.8.. 5.0.. ఇప్పుడు 4.5కు పడిపోయింది. దీన్ని ఎలా సెట్​ చెయ్యాలో మోడీ సర్కారుకు కనీస అవగాహన లేదు. ఎందుకంటే అసలేం జరుగుతున్నదో వాళ్లకు తెలియట్లేదు. జనం దగ్గర పెద్దగా డబ్బుల్లేవు. రేప్పొద్దున ఏ విపత్తు వస్తుందోనన్న భయంతో ఉన్న కొద్ది మొత్తాన్నీ బయటికి తీయడంలేదు. రూరల్​ ఏరియాలో కూలీ రేట్లతోపాటు రైతులు ఖర్చు పెట్టడం తగ్గిపోయింది. నేషనల్​ శాంపిల్​ సర్వే(ఎన్​ఎస్​ఎస్​)నే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎకనమిస్టులు ముందే వార్నింగ్​ ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. రాబోయేరోజుల్లో పరిస్థితులు ఇంకా దిగజారుతాయి’’అని చిదంబరం
వివరించారు.

జైల్లో కొంచెం గట్టిపడ్డా

106 రోజుల జైలు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందన్న చిదంబరం తాను గతంలో కన్నా ఫిజికల్​గా, మెంటల్​గా కొంచెం గట్టిపడ్డానన్నారు. జైల్లో నుంచి బయటికొచ్చిన క్షణంలో కాశ్మీరీలు గుర్తొచ్చారని, గత నాలుగు నెలలుగా అక్కడి ప్రజలు నిర్బంధంలో బతుకుతున్నారని గుర్తొచ్చి బాధపడ్డానని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రిగా తానెంత నిజాయితీగా పనిచేసిందీ అధికారులు, జర్నలిస్టులకు బాగా తెలుసన్నారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడుల గురించి రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు చిదంబరం భావోద్వేగానికి గురయ్యారు. కాగా, ప్రెస్​మీట్​లో ఐఎన్​ఎక్స్​ కేసు అంశాన్ని ప్రస్తావించడం ద్వారా చిదంబరం బెయిల్​ రూల్స్​ని ఉల్లంఘించారని బీజేపీ
ఆరోపించింది.

మరిన్ని వార్తల కోసం