గొర్రెల స్కామ్ డబ్బు ఎటుపోయింది..మనీలాండరింగ్ జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా? 

గొర్రెల స్కామ్ డబ్బు ఎటుపోయింది..మనీలాండరింగ్ జరిగిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారా? 
  • వెయ్యి కోట్ల గోల్‌మాల్‌పై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఈడీ
  • ఈ స్కామ్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు అనుమానాలు 
  • కీలకంగా మారిన 200 మ్యూల్‌ అకౌంట్లు, బెట్టింగ్‌ యాప్స్‌ లింకులు
  • ఒక్కో అకౌంట్‌లో 5 కోట్లు జమ.. అవి ఎక్కడికెళ్లాయనే దానిపై దృష్టి 
  • ఇప్పటికే 10 బినామీ అకౌంట్లు గుర్తింపు.. వాళ్ల విచారణకు ఏర్పాట్లు 
  • తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ సహా కాంట్రాక్టర్ల అకౌంట్లలో భారీగా డబ్బు

హైదరాబాద్‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కామ్‌‌లో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో సైబర్ నేరాల తరహాలో మ్యూల్ అకౌంట్ల ద్వారా కొట్టేసిన రూ.వెయ్యి కోట్లు ఎక్కడికెళ్లాయనే కోణంలో విచారణ చేస్తున్నది. ఇందులో భాగంగా సోదాల్లో బయటపడ్డ 200 మ్యూల్‌‌ అకౌంట్లు, బెట్టింగ్‌‌ యాప్స్‌‌తో లింకులు ఉన్న ట్రాన్సాక్షన్లను సేకరిస్తున్నది. ప్రాథమిక ఆధారాల మేరకు ఒక్కో అకౌంట్‌‌లో రూ.5 కోట్లు డిపాజిట్‌‌ అయినట్టు గుర్తించింది.

ఇలా కొట్టేసిన డబ్బు మ్యూల్‌‌ అకౌంట్లు, బెట్టింగ్‌‌ యాప్స్‌‌ ద్వారా విదేశాలకు మనీలాండరింగ్‌‌ జరిగిందా? లేక 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం దారి మళ్లించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. షీప్‌‌ అండ్‌‌ గోట్ డెవలప్‌‌మెంట్‌‌ కోఆపరేటివ్‌‌ ఫెడరేషన్‌‌ హెడ్డాఫీస్‌‌ అకౌంట్‌‌ నుంచి మ్యూల్‌‌ అకౌంట్లలోకి వెళ్లిన నిధులు, అవి చివరిగా డిపాజిట్‌‌ అయిన అకౌంట్లను గుర్తించే పనిలో ఉంది. మ్యూల్‌‌ అకౌంట్లలో డబ్బు ఎక్కువ మొత్తంలో డిపాజిట్‌‌ అయిన వాటిని గుర్తించి ఫ్రీజ్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు కోర్టు అనుమతితో సంబంధిత బ్యాంకులకు ఈడీ లెటర్లు రాయనుంది. 

ఆర్థిక లావాదేవీలపై దృష్టి..  

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌‌ వద్ద ఓఎస్డీగా పని చేసిన కల్యాణ్‌‌ కుమార్‌‌.. ఈ స్కామ్‌‌లో కీలక సూత్రధారి అని ఈడీ గుర్తించింది. సోదాల టైమ్‌‌లో కల్యాణ్ కుమార్ సహా కాంట్రాక్టర్లు‌‌ మొయినుద్దీన్‌‌, ఇక్రముద్దీన్‌‌ కుటుంబ సభ్యుల అకౌంట్లలో భారీగా డిపాజిట్లు గుర్తించింది. వీరి‌‌ ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కల్యాణ్‌‌ కుమార్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న బ్యాంక్ పాస్‌‌బుక్స్, డెబిట్‌‌ కార్డులు, ఆన్‌‌లైన్‌‌ ట్రాన్సాక్షన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది.

షీప్‌‌ అండ్‌‌ గోట్ డెవలప్‌‌మెంట్‌‌ కోఆపరేటివ్‌‌ ఫెడరేషన్‌‌ మాజీ సీఈవో రాంచందర్‌‌‌‌ నాయక్‌‌ సహా కాంట్రాక్టర్లు మొయినుద్దీన్‌‌, ఇక్రముద్దీన్‌‌, వాళ్ల కుటుంబసభ్యుల బ్యాంక్‌‌ అకౌంట్లను ఇప్పటికే సీజ్‌‌ చేసింది. స్వాధీనం చేసుకున్న బ్యాంక్ అకౌంట్లలో అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా సంబంధిత ఖాతాదారులకు నోటీసులు ఇచ్చి విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తున్నది. 

కీలక వ్యక్తుల సహకారంతోనే స్కామ్.. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో బిల్లుల చెల్లింపుల విధానంలో ఉన్న లొసుగులను ఓఎస్డీ కల్యాణ్‌‌ కుమార్‌‌ తన అక్రమాలకు అనుకూలంగా మార్చుకున్నట్టు ఈడీ 
గుర్తించింది. ఈ  పథకానికి గత ప్రభుత్వం కేయించి న బడ్జెట్‌‌, మంజూరు చేసిన నిధులకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ప్రైవేట్‌‌ ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల అనుచరులు కుమ్మక్కయి స్కీమ్‌‌ డబ్బులు గోల్‌‌మాల్‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించింది.

2017 నుంచి గొర్రెల పంపిణీ పథకంలో కొల్లగొట్టిన వెయ్యి కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లింది? ‘నీకింత..నాకింత’ (కిక్‌‌బ్యాక్‌‌) అన్నట్టుగా వాటాలు వేసుకున్న వారిలో ఏ స్థాయి వారు ఉన్నారు? అనే దానిపై ఈడీ దృష్టి సారించింది. ఏసీబీ కేసులో అరెస్టయినోళ్లతో పాటు గతంలో పశుసంవర్థక శాఖలో కీలక, అత్యున్నత స్థాయిలో పని చేసిన అధికారులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నది. నాటి మంత్రి పేషీలో అధికారులతో పాటు ‘కీలక’ వ్యక్తుల పూర్తి సహకారంతోనే ఇంత భారీ స్థాయిలో అవినీతి జరిగి ఉండొచ్చని మొదటి నుంచి అనుమానిస్తున్న ఈడీ.. ఆ దిశగా ఆధారాల సేకరిస్తున్నది. 

స్కామ్‌‌లో లీడర్లు? 

మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్ కుమార్ కీలక సూత్రధారిగా ఉన్న ఈ స్కామ్‌‌లో రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు ఈడీ అనుమానిస్తున్నది. పశుసంవర్థక శాఖ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు ‌‌ధర్మపురి రవి, ముంత ఆదిత్య కేశవసాయి, కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌‌తో కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పలుమార్లు గొర్రె పిల్లలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే కల్యాణ్‌‌కుమార్‌‌‌‌తో కలిసి స్కామ్‌‌కు తెరతీశారు. మ్యూల్ అకౌంట్లలో గొర్రెల స్కీమ్‌‌ నిధులు డిపాజిట్‌‌ చేయించారు. రంగారెడ్డి జిల్లా గ్రౌండ్‌‌ వాటర్ ఆఫీసర్‌‌ ‌‌పసుల రఘుపతిరెడ్డి, నల్గొండ వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌‌ సంగు గణేశ్‌‌ అనేక మ్యూల్‌‌ అకౌంట్లను ఈ స్కామ్‌‌లో వినియోగించారు. వీళ్లందరినీ ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

బాధిత రైతుల విచారణకు ఏర్పాట్లు.. 

గొర్రెలను సప్లయ్ చేసిన ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల స్టేట్‌‌మెంట్లను ఏసీబీ ఇప్పటికే రికార్డ్‌‌ చేసింది. ఈ క్రమంలో వాళ్లను విచారించేందుకు ఈడీ ఏర్పాట్లు చేస్తున్నది. రైతులకు 133 యూనిట్ల గొర్రెలకు గాను చెల్లించాల్సిన రూ.2.10 కోట్లను వాళ్ల అకౌంట్లలో డిపాజిట్ చేయకుండా, 10 బినామీ అకౌంట్లలో అధికారులు డిపాజిట్‌‌ చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఇందులో నవాజ్‌‌, హిమజ మల్ల, కండ్రకోట కోటేశ్వరరావు, కొత్తకోట శ్రీనివాసులు, లింగ కోటేశ్వర రావు, లింగ రవితేజ, శెట్టి, మహ్మద్ అలీ, ఎల్ల పవన్ కల్యాణ్‌‌, పోలయ్యకు చెందిన అకౌంట్లకు నిధులు మళ్లించినట్టు గుర్తించింది.

ఈ రూ. 2 కోట్లతో పాటు వీళ్ల అకౌంట్ల ద్వారా ఇంకెంత సొమ్ము, ఎవరెవరి అకౌంట్లకు ఎంత మొత్తంలో బదిలీ అయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నది. వాళ్లను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. బినామీలు, మ్యూల్‌‌ అకౌంట్లలో జమ అయిన మొత్తం డబ్బు విత్‌‌ డ్రా చేయడంతో పాటు స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. ఈ క్రమంలో ఈడీ  మనీలాండరింగ్ కోణంలో వివరాలు రాబడుతున్నది.