నేషనల్​ హెరాల్డ్​  కేసు.. హెరాల్డ్  బిల్డింగ్‌‌లో రెయిడ్స్

నేషనల్​ హెరాల్డ్​  కేసు.. హెరాల్డ్  బిల్డింగ్‌‌లో రెయిడ్స్

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌‌కు చెందిన నేషనల్ హెరాల్డ్‌‌ న్యూస్ పేపర్ హెడ్ ఆఫీసు సహా దేశవ్యాప్తంగా 12 లొకేషన్లలో ఎన్ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. ‘‘మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌‌ఎల్‌‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అదనపు సాక్ష్యాలను సేకరించేందుకు, నేషనల్ హెరాల్డ్‌‌తో లావాదేవీలు చేసిన సంస్థల గురించి తెలుసుకునేందుకు సెర్చ్‌‌లు జరుగుతున్నాయి” అని ఆఫీసర్లు చెప్పారు. మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించిన తర్వాత లభించిన తాజా సాక్ష్యాధారాల నేపథ్యంలో రెయిడ్స్ చేస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్‌‌లో ఉన్న హెరాల్డ్ బిల్డింగ్‌‌లో సోదాలు జరిపారు. కోల్‌‌కతాలో ఉన్న ఒక షెల్ కంపెనీలోనూ సర్చ్ చేసినట్లు అధికారులు చెప్పారు.

ప్రతిపక్షంపై దాడి: కాంగ్రెస్

ఈడీ రెయిడ్స్‌‌ పేరుతో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్షంపై జరుగుతున్న నిరంతర దాడుల్లో భాగమే ఈ చర్య అని మండిపడింది. ‘‘మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఈ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మమ్మల్ని మౌనంగా ఉంచలేరు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అసలు ఈ కేసులో నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రశ్నించారు. ఈడీ ద్వారా కాంగ్రెస్‌‌ను అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం ఎంత ప్రయత్నించినా చివరికి నిజమే గెలుస్తుందన్నారు.

ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లను వదలం: బీజేపీ

కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పింది. కొందరు రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన నగదు, ఆస్తులు ఇటీవల బయటపెట్టడాన్ని ప్రస్తావించింది. ప్రజల సొమ్మును స్వాహా చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, టీఎంసీ నేత పార్థా చటర్జీ, ఆప్ నేత సత్యేంద్ర జైన్ తదితరులను ఈడీ అరెస్టు చేసిన విషయాన్ని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ప్రస్తావించారు. ‘‘పెద్ద రాజకీయ నాయకులనే కారణంతో వాళ్లను వదిలేయాలా? వాళ్ల మీద మోపిన అభియోగాలు.. నిజాలు, సాక్ష్యాల ఆధారంగానే ఉంటాయి. అవినీతిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దు” అని హితవు పలికారు. రాజ్యాంగ విలువలను బీజేపీ ఎన్నటికీ అతిక్రమించబోదని, దర్యాప్తు సంస్థల పనిలో జోక్యం చేసుకోబోదని చెప్పారు. అవినీతి చేసిన వాళ్లను సహించబోమని స్పష్టం చేశారు.