న్యూఢిల్లీ: ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ అందించే ఆన్లైన్ క్లాసులకు అటెండవుతున్న వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్ల క్వాలిటీ, ఫీజు రిఫండ్ వంటి అంశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 69 శాతం మంది అలాంటి ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. దేశంలోని 323 జిల్లాలలో ఏప్రిల్ 1 మే 31 మధ్య కాలంలో 27 వేల మందిపై ఈ సర్వే చేపట్టినట్లు లోకల్ సర్కిల్స్ తెలిపింది. ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వారిలో 96 శాతం మంది ఈ రంగంలోని సంస్థలకు రూల్స్ ఉండాల్సిందేనని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా కాన్సిలేషన్, రిఫండ్ పాలసీలను అందుబాటులో ఉంచేలా రూల్స్ కావాలని చెబుతున్నట్లు పేర్కొంది. ఆయా ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్వెబ్సైట్లు లేదా మొబైల్యాప్స్లో కాన్సిలేషన్, రిఫండ్స్ ప్రొవిజన్ ఉండాలని కోరుకుంటున్నారని వివరించింది. కోర్సులను డిస్కంటిన్యూ చేయాలని భావిస్తున్నారని పేర్కొంది. కొన్ని ఎడ్టెక్ కంపెనీలు కస్టమర్ల అకౌంట్ల నుంచి ఆటో డెబిట్ రూపంలో డబ్బులు తీసేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నట్లు సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలోనే కిందటేడాది కొన్ని కంపెనీలకు ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది కూడా. ఈ కారణంగానే వాటి నియంత్రణకు కొన్ని రూల్స్ తేవాలని కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దేశంలోని ఎడ్టెక్ కంపెనీలు సొంతంగా నియంత్రించుకోవడానికి ఇండియా ఎడ్టెక్ కన్సార్టియమ్ (ఐఈసీ) పేరిట ఒక ఫోరమ్ను ఏర్పాటు చేసుకున్నాయి. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) గొడుగు కింద ఈ ఫోరమ్ పనిచేస్తోంది.
