కోడ్​ ఉల్లంఘనతోనే రైతుబంధుకు ఈసీ బ్రేక్​ వేసింది : వికాస్​రాజ్​ 

కోడ్​ ఉల్లంఘనతోనే రైతుబంధుకు ఈసీ బ్రేక్​ వేసింది :  వికాస్​రాజ్​ 
  • అలాంటివి జరిగితే చర్యలు తీసుకుంటం
  • ఫిర్యాదుల స్పందనపై పక్షపాత ధోరణి ఉండదు 
  • కోడ్​ ఉల్లంఘనతోనే రైతుబంధుకు ఈసీ బ్రేక్​ వేసింది
  • మునుపెన్నడూ లేనంతగా ఈసారి నగదు సీజ్​చేశాం
  • సీ విజిల్ యాప్​ ఫిర్యాదులు 90 శాతం పరిష్కరించినం
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​ 

హైదరాబాద్, వెలుగు:  రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను మభ్య పెట్టేందుకు డబ్బు, మద్యం పంచడం ఎంత నేరమో.. ఓటర్లు ఓటుకు డబ్బులు ఇవ్వాలని కోరడం అంతే నేరమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్​రాజ్​అన్నారు. డబ్బులు ఇవ్వాలని ఓటర్లే డిమాండ్​ చేసే పరిస్థితులు రావడం మంచి పరిణామం కాదని ఆయన పేర్కొన్నారు. ఓటింగ్​కు రెండు రోజులే మిగిలి ఉందని, ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సీఈవో తెలిపారు. ఎన్నికల కోడ్​అమలులో వస్తున్న ఫిర్యాదులపై పక్షపాత ధోరణి లేకుండా వాస్తవికత, ఫీల్డ్​ఆఫీసర్ల రిపోర్ట్​ఆధారంగానే ఈసీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లందరికీ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని.. పోలింగ్​ రోజు ఓట్లు గల్లంతు అయ్యాయనేది రాకుండా ఓటర్లు తమ పోలింగ్​కేంద్రాలను ఒకసారి చెక్​ చేసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈసారి పోలింగ్​శాతం పెంచుతామని తెలిపారు. ఈ మేరకు సీఈవో వికాస్​రాజ్​ సోమవారం ‘వెలుగు’తో మాట్లాడారు.

అభ్యర్థుల ఖర్చుపై ప్రత్యేక నిఘా..

ఈసారి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో రూ.724 కోట్లు సీజ్​చేశాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నగదు రవాణాతో పాటు ఉచితాల కింద పంపిణీ చేసే బహుమతులను స్వాధీనం చేసుకున్నాం. చిన్న మొత్తాల్లో నగదు దొరికిన సామాన్యులకు, వ్యాపారులకు ఆధారాలు చూపించిన తర్వాత రిలీజ్​చేసుకుంటూ వస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు గత రెండేండ్లుగా ఇంకో రకంగా ఉంటున్నాయి. హుజూరాబాద్, మునుగోడు బై ఎలక్షన్స్​లో రాజకీయ పార్టీలు విపరీతంగా ఖర్చు చేశాయనేది ఈసీ దృష్టిలో ఉన్నది. ఆ బై ఎలక్షన్స్​ అప్పుడు కొన్నిచోట్ల ఓటర్లు తమకు డబ్బు రాలేదని.. ఇవ్వాలని కోరడం వంటివి బయటకు వచ్చాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో ఇలాంటివి మంచిది కాదు. అందుకే ఈసారి అలా ఓటర్లు డబ్బులు కోరడం, డిమాండ్​చేయడం వంటివి ఈసీ దృష్టికి వస్తే తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఈసారి అభ్యర్థుల ఖర్చుపై స్పెషల్​నిఘా పెట్టాం. ఆ విషయంలో క్యాండిడేట్లు జాగ్రత్తగా ఉండాలి. 

ముందే చూసుకోవాలి

ఓటు నమోదు నిరంతరం సాగే ప్రక్రియ. ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా పైనల్ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చే తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఇచ్చాం. కొత్త ఓటర్లు, చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, అడ్రస్ ​ఛేంజ్​వంటి వాటి తర్వాత రాష్ట్రంలో 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వందశాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తున్నాం. కొన్ని నెలలుగా ఓటరు నమోదు  కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అప్లికేషన్లు తీసుకున్నాం. ప్రతిసారి పోలింగ్​డే రోజు తమ ఓటు లేదని ఫిర్యాదులు​ వస్తున్నయి. అదే రోజు ఎందుకు ఓటు ఉందో లేదో చూసుకోవాలి? ముందే చెక్​ చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. కొందరు ఒక నియోజకవర్గంలో ఓటు ఉంటే.. ఇంకో నియోజకవర్గం ఏరియాలోని లిస్ట్​లో వెతుకుతుంటారు. అందుకే ఓటరు స్లిప్పులో పోలింగ్​ కేంద్రంతో సహా అన్ని వివరాలు ఉంటాయి. అవి చూసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలి. కొత్త ఎపిక్​ కార్డులు 54.39 లక్షల కార్డులు పంపిణీ చేశాం. ఈసారి మహిళల కోసం ప్రత్యేక పోలింగ్​ కేంద్రాలు, కొన్ని మోడల్ పోలింగ్​స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్​తక్కువ నమోదవుతున్న ప్రాంతాల్లో ఈసారి స్పెషల్​ఫోకస్​పెట్టాం. పోలింగ్​పర్సంటేజీ గణనీయంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 

ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు రిపోర్టు..

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈసీకి ప్రతిదీ డే టూ డే రిపోర్ట్​చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్​జీవోల నుంచి  రకరకాల ఎన్నికల కోడ్​ఉల్లంఘనలతో పాటు ఇతర కంప్లయింట్స్​ప్రతిరోజూ వస్తున్నాయి. కంప్లయింట్​సీరియస్​నెస్​ ఏ మేరకు ఉన్నదనేదాని ప్రకారం జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్ల నుంచి వాస్తవ రిపోర్ట్​తీసుకుని ఈసీకి నివేదిస్తాం. దాని ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. కొన్నింటిని జిల్లాస్థాయిలోనే పరిష్కరిస్తున్నాం. ప్రభుత్వ పథకాలు వంటివి ఎలక్షన్​ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాం. రైతుబంధు, రుణమాఫీ, డీఏ , సీఎంఆర్ఎఫ్​తో పాటు ఇతరత్రా వంటి వాటిపై నిర్ణయం కోసం ఈసీకి పంపాం. రైతుబంధుకు ఓకే చెప్పారు. అయితే కోడ్​ఉల్లంఘనతో దాని అనుమతిని ఈసీ రద్దు చేసింది. ఒక పార్టీకి అనుకూలంగా ఉండటమో.. ఇంకోకరికి వ్యతిరేకంగా పనిచేయడం వంటివి ఈసీ చేయదు. ఏదైనా ఏం జరిగింది అనేదానిపై ఒక రిపోర్ట్​ను అధికారులతో తెప్పించుకున్నాకే నిర్ణయం ఉంటుంది. సీఎంకు ఈసీ అడ్వయిజరీ పంపింది. కేటీఆర్​కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్నాం. కొందరు అభ్యర్థులు, స్టార్​క్యాంపెయినర్లపైనా ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. ‘సీ’ విజిల్​యాప్​తో వచ్చిన కంప్లయింట్స్​8 వేల దాకా ఉన్నాయి. వాటిలో 90 శాతానికి పైగా అడ్రస్​ చేశాం. 

పోస్టల్ ​బ్యాలెట్​ గందరగోళం క్లియర్​ చేస్తున్నాం

రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఇతర సిబ్బందికి పోస్టల్​బ్యాలెట్​ఓటు అవకాశం కల్పించాం. దాదాపు మూడు లక్షల మందికి పైగా ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. ఇందులో1.68 లక్షల పోస్టల్​బ్యాలెట్​ఓటింగ్​కు అనుమతి ఇచ్చాం. కొన్నిచోట్ల ఓటు వేయకుండా పోస్టల్​బ్యాలెట్​తిరస్కరించినట్లు కంప్లయింట్స్​వచ్చాయి. ఎవరికి సమస్య లేకుండా అది క్లియర్​చేస్తున్నాం. మంగళవారం సాయంత్రం వరకు అవకాశం ఉంది. ఈసారి 2,290 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 35,635 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ నెల 30న పోలింగ్​కు పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్​కు సంబంధించి కూడా 49 కేంద్రాలు ఏర్పాటు చేశాం.