ఎంపీ టికెట్ కు కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు.. ఆప్ అభ్యర్థి కొడుకు ఆరోపణలు

ఎంపీ టికెట్ కు  కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నాడు.. ఆప్ అభ్యర్థి కొడుకు ఆరోపణలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆమ్​ఆద్మీ పార్టీకి ఊహించని షాక్​ తగిలింది. ఎంపీ టికెట్ కోసం తన తండ్రి నుంచి ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ 6 కోట్లు తీసుకున్నారని..పశ్చిమ ఢిల్లీ ఆప్ అభ్యర్థిగా బరిలో ఉన్న బల్బీర్‌ సింగ్ జక్కర్‌ కుమారుడు ఉదయ్‌ జక్కర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి మూన్నెళ్ల కిందటే ఆప్​లో చేరారని, అన్నా హజారే ఉద్యమంతో ఏ సంబంధం లేని వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మాజీ కాంగ్రెస్ నేత, 1984 సిక్కుల ఊచకోత కేసు నిందితుడు సజ్జన్ కుమార్​ను బెయిల్ పై విడిపించేందుకు తన తండ్రి బల్బీర్ సింగ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘‘నా చదువుల కోసం డబ్బు అడిగితే అందుకు కాదన్నారు. అది రాజకీయ ప్రయోజనాలకు వాడాల్సి ఉందని చెప్పారు. అందుకే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా” అంటూ శనివారం ట్విట్టర్​లో పోస్టు చేశారు.

గడువు ముగిసినా ఆప్ ప్రచారం: కాంగ్రెస్ ఫిర్యాదు

గడువు ముగిసినప్పటికీ ఫోన్ కాల్స్, మెసేజ్​ల ద్వారా తప్పుడు సర్వే ఫలితాలను ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్ ఢిల్లీ యూనిట్ శనివారం ఫిర్యాదు చేసింది. రికార్డు చేసిన ఫోన్​కాల్స్ ను ఆధారాలుగా ఇచ్చింది. తప్పుడు సర్వే ఫలితాలను వివరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.