ఎలక్టోరల్ బాండ్స్: బీజేపీకి రూ.10 కోట్ల విరాళం.. మోసపోయిన గుజరాత్ దళిత రైతు

ఎలక్టోరల్ బాండ్స్: బీజేపీకి రూ.10 కోట్ల విరాళం.. మోసపోయిన గుజరాత్ దళిత రైతు

దేశంలో ఎలక్టోరల్ బాండ్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల డేటా ప్రకారం 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కార్పొరేట్లు, వ్యక్తుల ద్వారా వివిధ రాజకీయ పార్టీలు రూ. 12వేల 769 కోట్లకు పైగా విరాళాలు అందుకున్నాయి.  ఎలక్టోరల్ బాండ్లు అత్యధికంగా పొందిన పార్టీగా బీజేపీ మొదటి స్థానంలో ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా గరిష్టంగా రూ. 6 వేల60 కోట్ల51లక్షల  విరాళాలు అందుకుంది. ఇది మొత్తం బాండ్ల విలువలో దాదాపు సగం.  అయితే ఇపుడు లేటెస్ట్ గా గుజరాత్ కు చెందిన  ఓ దళిత రైతు బీజేపీకి రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  దళిత రైతు బీజేపీకి 10 కోట్లు ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

2023 అక్టోబర్ 11న  గుజరాత్ లోని కచ్ జిల్లాలో అంజార్ సిటీలోని  ఓ దళిత కుటుంబానికి చెందిన ఆరుగురు రైతుల పేరిట రూ.11 కోట్ల 14 వేల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేశారు. ఇటీవల ఎస్ బీఐ డేటా ప్రకారం.. వీటిలో 10 కోట్ల విలువైన బాండ్లను బీజేపీ  16 అక్టోబర్ 2023న  సొమ్ము చేసుకుంది. అలాగే  అక్టోబర్ 18న  శివసేన కోటి14 వేల విలువైన ఎలక్టోరల్ బాండ్లను నగదుగా మార్చుకుంది.  

అయితే   ఈ విషయం ఆ రైతులకు తెలియకపోవడం విశేషం. ఎలక్టోరల్ బాండ్ల స్కీం అంటూ  అదాని గ్రూప్ కు అనుబంధంగా ఉన్న వెల్ స్పన్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు చెందిన  ఓ అధికారి  తమను మోసం చేశారంటూ ఇపుడు ఆ దళిత కుటుంబం ఆరోపిస్తుంది. బాధిత  రైతులలో ఒకరైన  సవకర మన్వర్  కుమారుడు హరేష్  సవకర్ ఎలక్టోరల్ బాండ్స్ పై   మార్చి 18, 2024న  అంజర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

2005లో   అదానీ గ్రూప్ వెల్స్పన్ నేచురల్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అదానీ వెల్స్పన్ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో వెల్స్పన్ కంపెనీ అంజార్ సిటీలోని    తమ  వ్యవసాయ భూమిలో సుమారు 43 వేల చదరపు మీటర్లను ఒక ప్రాజెక్ట్ కోసం స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బు చట్టం ప్రకారం మాకు ఇచ్చిన పరిహారంలో భాగం.  కానీ ఈ డబ్బును డిపాజిట్ చేసే సమయంలో ఐటీ శాఖతో ఇబ్బందులు వస్తాయని  కంపెనీ   సీనియర్ జనరల్ మేనేజర్ మహేంద్రసింగ్ సోధా  మాకు చెప్పారు. ఆ తర్వాత ఆయన మాకు ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ గురించి చెప్పారు.  కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి 1.5 రెట్లతో ఈ  డబ్బు వస్తుందని  నమ్మించారు. నిరక్షరాస్యులమైన మేం అతని మాటలు నమ్మి మోసపోయాం. అసలు ఎలక్టోరల్ బాండ్ల స్కీం అంటే ఏంటో  మాకు తెలియదు . దాని గురించి  ఎలాంటి సమాచారం లేదు అని బాధితుడు  హరేష్ సవకర్ ఫిర్యాదులో  తెలిపారు. 

వెల్స్పన్  డైరెక్టర్లు విశ్వనాథన్ కొల్లెంగోడ్, సంజయ్ గుప్తా, చింతన్ థాకర్, ప్రవీణ్ భన్సాలీలతో పాటు మహేంద్రసింగ్ సోధా (వెల్స్పన్‌లో సీనియర్ జనరల్ మేనేజర్), విమల్ కిషోర్ జోషి (అంజర్ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్) ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.  అలాగే  అంజార్ సిటీ BJP ప్రెసిడెంట్ హేమంత్ అలియాస్ డానీ రజనీకాంత్ షా  ఉన్నారు. ఇంకా ఈ కేసుపై  ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీస్ అధికారి శైలేంద్ర సిసోడియా వెల్లడించారు.