
- లేదంటే రేపటి నుంచి సమ్మెకు దిగుతామన్న సంఘాలు
- రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది ఆర్టిజన్ లు
- పీఆర్‌సీలో 7% పెంపుతో న్యాయం జరగలేదని ఆవేదన
హైదరాబాద్, వెలుగు: న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తాము సమ్మెకు దిగుతుంటే ఎస్మా ప్రయోగిస్తామంటూ విద్యుత్ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని ఆర్టిజన్ సంఘాలు మండిపడుతున్నాయి. తక్కువ జీతాలతో ఏళ్ల తరబడి పని చేస్తుంటే తమపై జాలి చూపకుండా అణచివేయాలని ప్రయత్నించడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. ఎస్మాకు భయపడబోమని, మంగళవారం సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నాయి. పీఆర్‌సీలో 7 శాతం పెంపుతో తమ జీతాలు 3 వేలకు మించి పెరగడం లేదని ఆర్టిజన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఇతర అధికారులు, ఇంజనీర్లకు లక్షల్లో జీతాలు ఉన్నాయని, తాజా పెంపుతో మరో 50 వేలకు వరకు జీతాలు పెరుగుతున్నాయని వారు తెలిపారు. ఆఫీసర్లు, ఇంజనీర్లకు ప్రకటించినట్లుగా 7 శాతం ఫిట్ మెంట్ ఇస్తామంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదని, తమకు 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనని ఆర్టిజన్ లు డిమాండ్ చేస్తున్నారు.
ఆర్టిజన్ల సమస్యలు పట్టవా?
నిత్యం క్షేత్రస్థాయిలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్న తమను విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కనీసం మనుషులుగా కూడా చూడడం లేదని ఆర్టిజన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రమాదాలు జరిగితే ప్రాణాలు కోల్పోయేది మేం. కరెంట్ పోతే వచ్చే వరకు పని చేసేది మేం. ఇంత కష్టపడి పని చేసే మా సమస్యలు పట్టవా?” అని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేసి రిటైర్ అయిన అధికారులు సైతం 9 ఏండ్లుగా ఇంకా లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని, కానీ తమను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని వారు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23 వేల మంది ఆర్టిజన్‌లు పని చేస్తుండగా.. నెలకు ఒక్కొక్కరికి రూ.25 వేల నుంచి రూ.29 వేలకు మించి జీతాలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెగించి కొట్లాడామని, ఇప్పుడు తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం ఎస్మా ప్రయోగించినా, ఎన్ని కుట్రలు చేసినా తగ్గబోమని ఆర్టిజన్ లు హెచ్చరిస్తున్నారు.
పీఆర్‌సీతో న్యాయం జరగలే
ఆర్టిజన్ లకు తాజాగా ప్రకటించిన 7 శాతం ఫిట్‌మెంట్‌తో న్యాయం జరగలేదని అందుకే సమ్మెకు పిలుపునిచ్చామని ఆర్టిజన్ సంఘాలు అంటున్నాయి. సమ్మెపై యాజమాన్యాలు ఆర్టిజన్ సంఘాలతో చర్చించకుండా డిపార్ట్‌మెంట్ యూనియన్‌లతో కుమ్మక్కు అయ్యాయని, లేబర్ కమిషనర్ వద్ద ఒప్పందాలపై సంతకాలు చేయించుకుని ఎస్మా అంటూ తమపై అరెస్టులకు పాల్పడుతోందని కార్మికులు ఫైర్ అవుతున్నారు. ఆర్టిజన్ ల బేసిక్ పే రూ.12,600 ఉండగా దానిపై 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి హెచ్‌ఆర్‌ఏలో 6 శాతం కోత విధించారని, రూ.500 ఉన్న సెల్ఫ్ ఫండింగ్ ను రూ.1000 చేసి న్యాయం జరిగిందని ప్రగల్భాలు పలుకుతున్నరని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
51శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందే
ఆర్టిజన్లకు 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందే. ఎస్మాకు భయపడం. ఈ నెల 25 నుంచి సమ్మెకు దిగుతున్నాం. యాజమాన్యం అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది. మేనేజ్‌మెంట్ ఇప్పటికైనా ఆర్టిజన్ సమస్యలను, వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలి. సీఎం కేసీఆర్ ఎంక్వైరీ చేసి ఆర్టిజన్ కార్మికుల జీవితాలను మెరుగుపర్చాలని కోరుతున్నాం.
–సాయిలు, జనరల్ సెక్రటరీ,తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్