రాష్ట్రంలో ఎలెస్ట్ కంపెనీ భారీ పెట్టుబడి

రాష్ట్రంలో ఎలెస్ట్ కంపెనీ భారీ పెట్టుబడి

దేశ చరిత్రలో తొలిసారి డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడి దక్కింది. డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రూ. 24వేల కోట్ల ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎలెస్ట్ కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరులో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజేష్ ఎక్స్ పోర్ట్స్ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో దేశంలో ఫ్యాబ్ రంగంలో పెట్టుబడి పెట్టిన తొలి కంపెనీగా ఎలెస్ట్ చరిత్ర సృష్టించింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్.. అమోలెడ్ డిస్ ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. డిస్ ప్లే ఫ్యాబ్ రంగంలోని ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకుని ఉత్పత్తులు తయారు చేయనుంది. ఈ ఒప్పందం ద్వారా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, లాప్ టాప్ లకు సంబంధించి సిక్త్స్ జనరేషన్ డిస్ ప్లేలు ఉత్పత్తి చేయనున్నారు.  

డిస్ప్లే ఫ్యాబ్ రంగంలో రానున్న ఈ పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల సరసన నిలుస్తుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ పెట్టుబడి రాష్ట్రానికే కాదు దేశానికి గర్వకారణమని అన్నారు. కేంద్రం ప్రకటించిన సెమీకండక్టర్ మిషన్ అనంతరం రాష్ట్రంలోకి ఫ్యాబ్ రంగంలో పెట్టుబడులు తీసుకువచ్చేందుకు నిరంతరం చేస్తున్న కృషి ఫలితమే ఎలేస్ట్ కంపెనీ పెట్టుబడి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం అనంతరం ఫ్యాబ్ రంగంలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.బెంగళూరులో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి, ఎలెస్ట్ సీఈఓ శ్యామ్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.