మరోసారి టెస్లా షేర్లు అమ్మిన ఎలాన్ మస్క్

మరోసారి టెస్లా షేర్లు అమ్మిన ఎలాన్ మస్క్

ఎలక్ర్టిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా షేర్లను కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మళ్లీ విక్రయించారు. ఈసారి దాదాపు 4 బిలియన్ డాలర్ల వాల్యూ ఉన్న షేర్లు అమ్మారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆయన 20 బిలియన్ డాలర్ల టెస్లా షేర్ల షేర్లు ఆఫ్ లోడ్ చేశారు. అదే సమయంలో ట్విట్టర్ చేజిక్కించుకునేందుకు ఆయన 44 బిలియన్ డాలర్లు వెచ్చించారు. ట్విట్టర్ కొనుగోలు కోసమే మస్క్ టెస్లా షేర్లు అమ్మారని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా మరో 4 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ 8.4 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లు విక్రయించారు. ఆ తర్వాత ఆగస్టులో మరో 6.9 బిలియన్ డాలర్ల విలువైన వాటాలను అమ్మేశారు. ఈ సందర్భంగా టెస్లా షేర్లను ఇకపై అమ్మే ఆలోచన లేదని మస్క్ ట్వీట్ చేశారు. అయితే ఊహించని విధంగా ఆయన మళ్లీ షేర్లు సేల్ చేయడం విశేషం.

టెస్లా షేర్ల అమ్మకంతో ఎలాన్ మస్క్ నికర ఆస్థుల విలువ 200 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది. టెస్లా అధినేత మస్క్, ట్విట్టర్ పనుల్లో పడి కార్ల కంపెనీని పట్టించుకుంటారో లేదోన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో షేర్లు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టెస్లా షేర్ల సరఫరా పెరిగి డిమాండ్ తగ్గడంతో ఆటోమేటిక్ గా షేర్ వాల్యూ కూడా పడిపోయిందని రాయిటర్స్ అభిప్రాయపడింది. 

2022 అక్టోబర్ 29న, ఎలోన్ మస్క్ అధికారికంగా ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫాంలో ఒకదాని తర్వాత ఒకటిగా మార్పులు వచ్చాయి. ట్విట్టర్ సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ను సాగనంపిన మస్క్.. డైరెక్టర్లను సైతం తొలగించారు. టాప్ లెవల్ నుంచి కిందిస్థాయి వరకు అనేక మంది ఉద్యోగుల్ని తొలగించాడు. ట్విట్టర్ వెరిఫైడ్ యూజర్లకు ఇచ్చే బ్లూ టిక్ కోసం యూజర్లు నెలకు 8డాలర్లు చెల్లించాల్సిందేనని కొత్త రూల్ తెచ్చారు.