కశ్మీర్ టు కన్యాకుమారి.. చెన్నూర్​ యువకుడి కళాయాత్ర

కశ్మీర్ టు కన్యాకుమారి.. చెన్నూర్​ యువకుడి కళాయాత్ర

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​కు చెందిన ఏల్పుల పోచం కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర చేపట్టి అరుదైన రికార్డును సాధించాడు. సైకిల్​పై 2,410 రోజుల్లో 30,700 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 13 వేలకు పైగా లైవ్​ డ్రాయింగ్స్​ వేసి తన కళానైపుణ్యాన్ని చాటుకున్నాడు. వివిధ రాష్ట్రాల్లోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలే కాకుండా సామాన్యులు, శ్రమజీవుల బతుకు చిత్రాలను తన ఆర్ట్​ ద్వారా ఆవిష్కరించాడు.

ఈ నెల 7న కన్యాకుమారిలో కళాయాత్ర ముగించుకొని ఆదివారం జిల్లాకు చేరుకున్న అతడికి మంచిర్యాల రైల్వేస్టేషన్​లో ఘన స్వాగతం లభించింది. పోచం గురువు మద్దూరి రాజన్న, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం స్టేట్​ అసోసియేటెడ్ అధ్యక్షుడు కోరల్ల రాంరెడ్డి, మంచిర్యాల మున్సిపల్ కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్, సామాజిక కార్యకర్త సుందిళ్ల రమేశ్​, బీఎంఎస్​ నాయకులు కమలాకర్ ఆయనకు స్వాగతం పలికారు.

వ్యవసాయ కూలీ కుటుంబం.. 

చెన్నూర్​ టౌన్​లోని మారెమ్మవాడకు చెందిన ఏల్పుల పోచంది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు లచ్చక్క, రాజయ్య వ్యవసాయ కూలీలు. పోచం చిన్ననాటి నుంచే కష్టాలను ఎదురీదుతూ చదువుకున్నాడు. పాఠశాల రోజుల్లో​ డ్రాయింగ్ బాగా వేస్తుండడం గమనించిన టీచర్​సత్యనారాయణ, ఆర్టిస్ట్ అయిన కజిన్​ బ్రదర్ మద్దూరి రాజన్న ప్రోత్సాహం లభించింది.

2007 బీకామ్​ సెకండియర్ ​చదువుతూనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బీఎఫ్​ఏ ఎంట్రెన్స్ ​రాసి అందులో జాయిన్​అయ్యాడు. 2011లో బీఎఫ్​ఏ పూర్తికాగానే ఛత్తీగఢ్​లోని కైరాగఢ్ ​యూనివర్సిటీలో 2012 నుంచి రెండేంట్లపాటు ఎంఎఫ్​ఏ చేశాడు. అనంతరం హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​పబ్లిక్​ స్కూల్ లో​ ఆర్ట్ టీచర్​గా పనిచేశాడు.

2017లో కళాయాత్ర ప్రారంభం

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఆయా రాష్ట్రాల్లోని సంస్కృతీ సంప్రదాయాలు, ఆక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, జీవనశైలి వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పోచం.. దీన్ని లైవ్​డ్రాయింగ్స్​ద్వారా ప్రపంచానికి చాటాలన్న సంకల్పంతో ఈ కళాయాత్ర చేపట్టాడు. 2017 డిసెంబర్​లో తన ఇష్టదైవమైన కాశీ విశ్వనాథుడి సన్నిధి నుంచి కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు కళాయాత్ర ప్రారంభించాడు. 2,410 రోజుల్లో 30,700 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించాడు. 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోచం యాత్ర సాగింది.

ఈ నెల 7న కన్యాకుమారిలోని వివేకానంద రాక్​దగ్గర యాత్రను ముగించాడు.  26 వారసత్వ ప్రదేశాలు, స్మారక కట్టడాలు, 8 జ్యోతిర్లింగాలు, 9 అష్టాదశ పీఠాలను సందర్శించాడు. దేశంలోని 24 ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలను సందర్శించి అక్కడి స్టూడెంట్లకు డెమో క్లాస్​లు ఇచ్చాడు. 13 వేలకు పైగా డ్రాయింగ్స్​వేసి ప్రశంసలు అందుకున్నాడు.