చైనా ఉచ్చులో వర్ధమాన దేశాలు

చైనా ఉచ్చులో వర్ధమాన దేశాలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను భూ, సాగర మార్గాలతో కలపడం, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల పేరుతో చైనా 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ)చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఇటీవల పదేండ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బిఆర్ఐ మూడవ శిఖరాగ్ర సమావేశం ఇటీవల బీజింగ్​లో జరిగింది. కానీ, దానికి యూరప్ నుంచి హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ ఒక్కరే హాజరయ్యారు. మిగిలిన యూరోపియన్ దేశాలు గైర్హాజరయ్యాయి.  రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం హాజరయ్యారు. డబ్బుతో మిత్ర దేశాలను కూడగట్టుకోవచ్చుననే చైనా ఎత్తుగడ బెడిసికొడుతున్న సూచనలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. 

చైనా నౌకల సంచారం హిందూ మహా సముద్ర ప్రాంతంలో గత ఐదేండ్లలో బాగా పెరిగింది. నౌకలంటే అవేవో సరుకుల రవాణాకు చెందినవి కావు. ఏదో ఒక వంక పెట్టుకుని వస్తున్న నిఘా నౌకలు. వాటిలో యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ ట్రాకర్లు, సర్వే చేసేవి. పరిశోధన నౌకలు కూడా ఉన్నాయి. హిందూ మహా సముద్రంలో ఇలాంటి నౌకలు 2019లో 29, 2020లో 39, 2021లో 45, 2022లో 43 సంచారం చేసినట్లు రికార్డు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు 28 చైనా నౌకల సంచారం లెక్కకు వచ్చింది. తాజాగా షి యాన్ 6 నౌక హంబన్ తోటకు తూర్పున 1000 కిలోమీటర్ల దూరంలో (చెన్నైకి ఎక్కువ దూరంలో లేదు) తచ్చాడుతున్నట్లు గమనించారు.

శ్రీలంకను అప్పుల ఊబిలోకి లాగింది

 శ్రీలంకకు చెందిన నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్  అండ్ డెవలప్ మెంట్ ఏజన్సీతో కలసి  సంయుక్తంగా మిలటరీ, సైంటిఫిక్ పరిశోధన సాగించేందుకు అది వచ్చిందని శ్రీలంక విదేశాంగ మంత్రి మహమ్మద్ అలీ సబ్రీ చెబుతున్నారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన నౌకాదళం తూర్పు వైపు, ఆఫ్రికా తీరం వైపు, హిందూ మహా సముద్ర తీర దేశాలకు  వెళ్ళేందుకు భారత సముద్ర జలాలతో పని లేకుండా నూతన సముద్ర మార్గాలను కనుగొనే పనిలో ఉంది. సైనిక దళాలతో కూడిన గస్తీ నౌకలను 2025 ప్రారంభం నాటికే  హిందూ మహా సముద్ర ప్రాంతంలో నియోగించాలని చైనా పథకం. షి యాన్ నౌకలో ఇంచుమించుగా 2000 టన్నుల డీజిల్ ఉంటుందని అంటున్నారు. అంటే, అది సముద్రంలో చాలా కాలమే తిష్ట వేయగలదు. శ్రీలంక లాంటి దేశాలను రుణాల సాలెగూడులోకి లాగడం ద్వారా చైనా ఆ రకమైన పనులు చేయగలుగుతోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) పేరుతో చైనా  వివిధ దేశాలను అప్పుల ఊబిలోకి లాగుతోంది.

నేపాల్​లో విమానాశ్రయం, పాక్​లో బీఆర్​ఐ ప్రాజెక్టు

చైనా చేసే పనులు ఎలా ఉంటాయంటే, అది నేపాల్ లోని పోఖరలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించింది. సినోమ్యాక్ అనే చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని కాంగ్లోమిరేట్​కు చెందిన నిర్మాణ విభాగం సిఏఎంసి ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఆ నిర్మాణం సాగింది. నేపాల్ వేసుకున్న నిర్మాణ అంచనాకు రెండింతలుగా 305 మిలియన్ డాలర్లకు సిఏఎంసి ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. నేపాల్ నాయకులు కొందరు ఇదెక్కడి న్యాయమని గగ్గోలు పెట్టడంతో తర్వాత ఆ మొత్తాన్ని 216 మిలియన్ల డాలర్లకు తగ్గించుకుంది. ఆ విమానాశ్రయానికి ఏటా 2 లక్షల 80 వేల మంది యాత్రికులు వస్తారని అది లాభాల బాటపడుతుందని చెప్పి అప్పు ఇచ్చింది. ఈ మధ్య చైనా విమానం ఒక్కటే అక్కడ దిగింది. మిగిలిన అంతర్జాతీయ విమానాలు ఏవీ ఇంకా రాకపోకలు ప్రారంభించలేదు. నేపాల్ మాత్రం ఆ అప్పును 2026 నుంచి తిరిగి చెల్లించడం మొదలుపెట్టాలి.  పాకిస్తాన్ లో బీఆర్ఐ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా సాగుతోంది. ఈ ప్రాజెక్టును భారత్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. అయినా, కొన్ని దేశాలు చైనా సాలెగూడులో చిక్కుకున్నాయి.  

శ్రీలంక పట్ల ఔదార్యం చూపని చైనా

 శ్రీలంకను బిఆర్ఐలోకి తెచ్చి దాని అప్పుల సమస్యకు కొంత కారణమైన చైనా మాత్రం అటువంటి ఔదార్యాన్ని చూపలేకపోయింది. పైగా, షరతులను అడ్డుపెట్టుకుని హంబన్ తోట పోర్టును ఏకంగా 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. శ్రీలంకకు అప్పు ఇచ్చిన వాటిలో ప్యారిస్ క్లబ్ కూడా ఉంది. కొందరు పాశ్చాత్య ప్రైవేటు ఫైనాన్షియర్లు ఆ క్లబ్​లో సభ్యులుగా ఉన్నారు. రుణాలిచ్చిన ఇలాంటి సంస్థలు, దేశాలు తమకు రావాల్సిన మొత్తాలలో కొంత మొత్తాన్ని వదులుకుంటామని హామీ ఇస్తేనే, ఐఎంఎఫ్ కొత్తగా అప్పులివ్వడం లేదా పాత రుణానికి కొత్త రూపం ఇవ్వడం సాధ్యమవుతుంది. గండం నుంచి గట్టెక్కించేందుకు ఐఎంఎఫ్ ఆదుకోవడం బాగానే ఉంది కానీ, దానికీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఇలా అత్యవసరంగా ఇచ్చే మొత్తాలు తిరిగి వసూలయ్యేటట్లు చూసే బాధ్యత దానికి చెందిన ఫైనాన్సింగ్ ఎస్యూరెన్సెస్ కమిటీ చూసుకుంటుంది. రుణాల వసూలు రూపురేఖలను మార్చడానికి సంబంధించి ఆ కమిటీ కొన్ని నియమాలు పెట్టుకుంది. కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆ నిబంధనలు తాను పెట్టినవి కావని, తనకు వాటితో సంబంధం లేదని చైనా కొత్త పల్లవి అందుకుంది. రుణాల్లో రాయితీకి చైనా అంగీకరించకపోతే, కొన్ని దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. వాటికి అత్యవసర ఉపశమనం కలిగించకపోతే దీర్ఖ కాలంలో కూడా అవి అప్పులు తీర్చలేవు. మొదటికే మోసం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బీఆర్​ఐ ప్రాజెక్టుల రుణ వలయంలో అనేక దేశాలు

 ఇలా రుణాల వలయంలో చిక్కుకున్న దేశాల్లో  ఆఫ్రికా దేశాలు ఎక్కువగా ఉన్నాయి. తిరిగి వాటిలో చాలా దేశాలు బిఆర్ఐ ప్రాజెక్టుల కారణంగానే అప్పులపాలయ్యాయి. జాంబియా విషయంలో కూడా చైనా చాలా కాలయాపన చేసి ఒక రకమైన రుణ రాయితీకి అంగీకరించింది. దాని విషయంలో కొంత ప్రభుత్వ రుణాన్ని ప్రైవేటు రుణంగా ముద్ర వేసిన తర్వాత, చైనా ఆ సాయానికి ఒప్పుకుంది. జాంబియా త్వరగా కోలుకుంటే, మొదట తన రుణాన్ని తీర్చాలని మెలికపెట్టింది. అల్పాదాయ దేశాలకు జి-20 ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దానిలో భాగంగా జాంబియాకు ఆ సాయం అందింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మొరాకో వంటి మధ్యాదాయ దేశాల పట్ల ఐఎంఎఫ్ మెతక వైఖరిని అనుసరించే వీలు లేదు. శ్రీలంక మరి కొన్ని దేశాలకు భారత్ కూడా రుణదాతగా ఉంది. కనుక, చైనా ‘హెయిర్ కట్’ కు ఒప్పుకోకపోతే, ఐఎంఎఫ్ ఆదుకునేందుకు తాము అంగీకరించబోమని భారత్ చెప్పాలి. ఈ విషయంలో దానికి మిగిలిన రుణదాతలు కూడా కచ్చితంగా మద్దతు ఇస్తారు. అవసరమైతే, మరికొన్ని రుణగ్రస్థ దేశాలకు కూడా భారత్ చిన్న మొత్తాలనైనా అందించి సంప్రదింపుల కమిటీల్లో చోటు సంపాదించుకోవచ్చు. చైనా అసలు రంగును మిగిలిన దేశాలకు ఎరుకపరచవచ్చు.  బిఆర్ఐ పేరుతో చైనా సాగిస్తున్న సామ్రాజ్యవాదానికి చెక్ పెట్టవచ్చు. 

అప్పుల శ్రీలంక

ఒకప్పుడు భారత్ పైన కూడా అప్పుల భారం ఎక్కువగా ఉండేది. ఇపుడు దాని నుంచి బయటపడి ఇతర దేశాలకు ఎంతో కొంత అప్పు ఇవ్వగలిగిన దేశంగా పరిణామం చెందుతున్నాం. బహుశా అందుకే కాబోలు, సుమారు 70 వర్ధమాన దేశాలు అప్పులతో సతమతమవుతున్నాయి. ఆ దేశాల కోసం మనం ఎక్కడెక్కడో వెతకనవసరం లేదు. పొరుగునున్న శ్రీలంక విదేశీ రుణభారం దాదాపు 4 వేల 6 వందల కోట్ల డాలర్ల మేరకు ఉంటుంది. దానిపై శ్రీలంక గత ఏడాది వడ్డీ కూడా కట్టలేకపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) శ్రీలంకను ఆదుకునేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. సంక్షోభం నుంచి తాత్కాలికంగా గట్టెక్కేందుకు వీలుగా సుమారుగా 2.9 బిలియన్ డాలర్లను విడతలవారీగా విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. వ్యక్తులైనా, సంస్థలైనా రుణాలు ఇచ్చేటపుడు కొన్ని షరతులు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. శ్రీలంకకు మరో విడత మొత్తాన్ని విడుదల చేసే ముందు అది ఆ షరతులకు  ఏమేరకు కట్టుబడి ఉందో  పరిశీలించడానికి ఐఎంఎఫ్ బృందం ఒకటి ఇటీవల శ్రీలంక సందర్శించి పరిస్థితుల పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిధుల విడుదలను తొక్కిపెట్టింది.  పన్నుల వసూళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నాయని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం మరోటి ఉంది. శ్రీలంకకు రుణాలిచ్చిన విదేశాల్లో కొన్ని దేశాలు తమకు రావాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని మాఫీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి. భారత్ కూడా అలాంటి సౌహార్దం చూపిన దేశాల్లో ఉంది.

- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్​