
న్యూఢిల్లీ: 2030 నాటికి దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరర్లకు 1.30 కోట్ల చదరపు అడుగుల స్థలం అవసరమవుతుందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ సీబీఆర్ఈ ఒక రిపోర్టులో వెల్లడించింది. దేశంలో 2030 నాటికి 2.30 కోట్ల టూ వీలర్లు, 40 లక్షల ఫోర్ వీలర్లు (కార్లు) తయారు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా–న్యూ వీల్స్ ఆన్ ది రోడ్స్ పేరిట ఒక రిపోర్టును సీబీఆర్ఈ సౌత్ ఏషియా రిలీజ్ చేసింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలోని ట్రెండ్స్, గ్రోత్, రియల్ ఎస్టేట్ సెక్టార్‌పై ఆ రంగం ఎఫెక్ట్ వంటి అంశాలన్నింటినీ ఈ రిపోర్టులో వివరించింది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ మరింతగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రంగంలో తయారీ ఫెసిలిటీలు పెట్టడానికి 1.30 కోట్ల చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ స్పేస్ కావల్సి వస్తుందని సీబీఆర్ఈ రిపోర్టు తెలిపింది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు అవసరమయ్యే బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీల ఏర్పాటుకు 2,400 ఎకరాల స్థలం అవసరమవుతుందని పేర్కొంది. 2030 నాటికి బ్యాటరీల తయారీలో 200 గిగావాట్ హవర్స్ కెపాసిటీ అందుకోవాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2021–30 మధ్య కాలంలో మన ఈవీ మార్కెట్ ఏటా 49 శాతం పెరుగుతుందని సీబీఆర్ఈ రిపోర్టు అంచనా వేసింది.
2030 నాటికి దేశంలో ఈవీల అమ్మకాలు 1.70 కోట్ల యూనిట్లను దాటుతాయని పేర్కొంది. మొత్తం మీద ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఈవీ మాన్యుఫాక్చరింగ్ చాలా మార్పులు తెస్తుందని, దాంతోపాటు ఆ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్‌పైనా ఉంటుందని వివరించింది. గత మూడేళ్లలో ఈవీ సెక్టార్లో పెట్టుబడులు చూస్తే ఇది స్పష్టమవుతోందని సీబీఆర్ఈ వివరించింది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 6.2 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఈవీ కంపెనీలు ప్రకటించాయి.