కుల గణనకు దేశవ్యాప్త డిమాండ్​ : ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

కుల గణనకు దేశవ్యాప్త డిమాండ్​ : ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి

బిహార్ సర్కారు కుల గణన డేటాను విడుదల చేయడం ద్వారా జాతీయ ఎజెండాను రూపొందించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కులగణన చర్చనీయాంశమైంది. ఎన్నో ఏండ్లుగా దీని గురించి మాట్లాడుతున్నప్పటికీ.. వాస్తవాలు, స్పష్టమైన గణాంకాల కారణంగా కులాల చుట్టూ ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికినట్లయింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కులాలకు సంబంధించి మనకు తరచుగా వార్తలు వస్తుంటాయి. నిజానికి ప్రతి రాజకీయ పార్టీ కుల గణాంకాలను పరిశీలిస్తుంది. ఓటర్లను ప్రభావితం చేసే వనరులు, సామర్థ్యంగల ఆయా కులాలకు చెందిన అభ్యర్థులను రాజకీయ పార్టీలు రంగంలోకి దింపుతాయి.

1872లో బ్రిటీష్ ఇండియా కుల గణనను ప్రారంభించినప్పుడు ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా 1891 నుంచి 1931 వరకు కుల గణనపై వ్యతిరేకత పెరిగింది. అనంతరం భారతదేశంలో మొట్టమొదటి  కుల గణన1951లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగింది.  జనాభా గణనలో కులానికి సంబంధించి డేటా సేకరణను కాంగ్రెస్ తొలగించింది. అయితే ఎస్సీలు, ఎస్టీలకు మతపరమైన జనాభా గణనను కొనసాగించింది. భారతదేశంలోని అగ్రవర్ణ నాయకత్వ విధానాల్లో ఈ రోజు వరకు అదే స్టాండ్ కొనసాగుతోంది.

1997లో జనతాదళ్ నేతృత్వంలోని ప్రభుత్వం  ప్రతి దశాబ్దానికి కుల గణన చేపట్టాలని నిర్ణయించింది. ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని సోషలిస్టులు 2001లో కుల గణన కోసం పట్టుబట్టారు. వాజ్​పేయి, -అద్వానీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ డిమాండ్​ను  తిరస్కరించింది. విచిత్రంగా బీజేపీనే 2011లో కుల గణన కోసం డిమాండ్ చేయడంలో సోషలిస్టులను చేర్చుకుంది. 

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సెన్సస్​లో కుల గణన చేర్చడానికి అంగీకరించింది. అయితే, అది ప్రణబ్ ముఖర్జీ, చిదంబరంల కారణంగా ఫలించలేదు. వారు జనాభా లెక్కల నుంచి కులాన్ని దూరంగా ఉంచారు.  కుల గణాంకాలు కేంద్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని బహిరంగపరచడానికి బీజేపీ అంగీకరించలేదు. మరోవైపు  ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నుంచి కుల గణనకు డిమాండ్ పెరిగింది. దీంతో 2018లో మరోసారి బీజేపీ ప్రభుత్వం 2021లో కుల గణన చేపడతామని ప్రకటన చేసింది. మహారాష్ట్రలో సేన నేతృత్వంలోని ప్రభుత్వం సుప్రీం కోర్టులో  కుల గణనపై పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 

కుల గణనను తాము వ్యతిరేకిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది. కుల గణనను నిర్వహించకూడదని 1951లో తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని వాదించింది. కుల గణాంకాలను సేకరించడం, వాటిని కంప్యూటర్ల ద్వారా ప్రాసెస్ చేయడం చాలా  కష్టమని పరిపాలనాపరంగా ఇది సాధ్యపడదని పేర్కొంది. అయితే, బిహార్ సీఎం నితీశ్ కుమార్ , తేజస్వి యాదవ్​ బహిరంగంగా  కుల గణన చేపట్టడం బీజేపీ సృష్టించిన అపోహను బట్టబయలు చేసింది.

నితీశ్​కుమార్​ సర్కార్​పై ప్రశంసలు

కులగణనతో వాస్తవాలను దేశం ముందు ఉంచినందుకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నితీశ్​కుమార్​ సర్కారును ప్రశంసించాయి. కానీ, బీజేపీ  సందేహాస్పద వాదనలతో నేటికీ వ్యతిరేకిస్తోంది.  హిందూత్వం పేరుతో కులతత్వ దేశాన్ని ప్రోత్సహించడానికి, నిర్మించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుందనేది నిజం. భారతీయ కుల వాస్తవికతను బహిరంగం చేయడం ద్వారా సమాజం వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాడేందుకు బిహార్ మార్గం సుగమం చేసింది. 

ఈ నేపథ్యంలో దేశం మొత్తం కుల గణన, ప్రజాస్వామ్య సామర్థ్యాన్ని చర్చించడంలో నిమగ్నమై ఉంది. బిహార్ స్టేట్ డెవలప్​మెంట్ కమిషన్ ప్రచురించిన కులాల సర్వే ఫలితాలను పరిశీలిస్తే.., మొత్తం 13.07 కోట్ల రాష్ర్ట జనాభాలో హిందువులు 82 శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ముస్లింలు 17.7 శాతం ఉన్నారు.  కుల గణాంకాలను మరింత  నిశితంగా పరిశీలిస్తే 63 శాతం ఓబీసీలు ఉన్నారు. 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలు ఉన్నారు.  

‘ఇండియా’ కూటమి సైతం..

మహిళా రిజర్వేషన్లు కూడా రాజకీయంగా అగ్రవర్ణాలకు ప్రయోజనం చేకూర్చేవిధంగానే ఉంది. ఓబీసీల చట్టబద్ధమైన వాటాను తొలగించడం శోచనీయం. ఓబీసీల విషయం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమై మండల్-2గా మారింది. బిహార్ కులాన్ని సర్వే చేస్తోంది. డీఎంకే సామాజిక న్యాయం కోసం జాతీయ ఉద్యమానికి పిలుపునిచ్చింది. అఖిలేశ్​యాదవ్ పీడీఏ (ఓబీసీ, దళిత్, అల్పసంఖ్యాక్​- ముస్లిం) వ్యూహరచన చేస్తున్నారు. 

కాంగ్రెస్ ​నేత రాహుల్ గాంధీ ఓబీసీల వెనుకబాటుతనానికి దేశం ప్రతిస్పందించేలా  ఓబీసీలకు దామాషా ప్రాతినిధ్యాన్ని కల్పించాలని ప్రతిపాదిస్తున్నారు. శివసేన, నేషనలిస్ట్​ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కమ్యూనిస్టులు తదితర అనేక ఇతర రాజకీయ పార్టీలు కూడా కుల గణన కోసం ఉద్యమంలో చేరాయి.  కుల గణన కోసం డిమాండ్ , మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలను చేర్చడం వంటివి 2024 కోసం ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా తమ ఎజెండాగా ప్రకటించనున్నాయి. బీజేపీ విభజన, ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమించనున్నాయి.

జాతీయ డిమాండ్​గా..

కాంగ్రెస్ నాయకత్వం కులాల సమస్యపై దృష్టి సారించినప్పటికీ, వివిధ రాష్ట్రాల్లోని ఆ పార్టీ పీసీసీలు ఇప్పటికీ జాతీయ విధానాన్ని స్పష్టం చేయలేదు. కర్నాటక ఇప్పటికే కుల గణనను సర్వే చేసింది. అయితే కుల గణనకు సంబంధించిన డేటాను ఇంకా బహిరంగంగా ప్రకటించలేదు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా  బిహార్ తరహాను అనుసరించే అవకాశం ఉంది.  భారత రాష్ర్ట సమితి అసెంబ్లీలో కుల గణన కోసం తీర్మానాన్ని ఆమోదించింది. అయితే బీఆర్​ఎస్​ సామాజిక ఆర్థిక కుల సర్వే (సమగ్ర కుటుంబ సర్వే) 2015పై మౌనంగా ఉంది. 

జాతీయ స్థాయిలో రెండు వెనుకబడిన తరగతుల కమిషన్లు కుల గణనను ఆమోదించాయి. 1953-–55లో కాకా కలేల్కర్, 1979-–80లో బిపి మండల్ కుల గణనకు సిఫార్సు చేశాయి. రోహిణి నేతృత్వంలోని ఓబీసీ వర్గీకరణపై నియమించిన కమిషన్ కూడా ఇటీవలి కాలంలో కుల గణన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై బీజేపీ స్పందించలేదు. దురదృష్టవశాత్తూ అనేక మంది వ్యక్తులు, సంస్థలు బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వేను నిలిపివేయాలని కోర్టులకు కూడా వెళ్లారు. కానీ కోర్టులు వారి అభ్యర్థన నిరాకరించాయి. నిజానికి  బిహార్ ప్రభుత్వం చేసిన కుల గణన  భారతదేశంలో జాతీయ డిమాండ్​గా మారింది.

-ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి, సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు