
- దేశంలో ఏటా 2 కోట్ల మందిని కరుస్తున్నయ్
- ఐసీఎంఆర్ రిపోర్టులో వెల్లడి
- రేబీస్ సోకి 18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నరు
- దేశంలో కోటిన్నర పైనే స్ట్రీట్ డాగ్స్
- స్టెరిలైజేషన్, దత్తతను ప్రోత్సహించాలని ఐసీఎంఆర్ సూచన
హైదరాబాద్, వెలుగు : దేశంలో ఏటా 2 కోట్ల మంది కుక్క కాట్లకు గురవుతున్నారు. ఇందులో 18 వేల నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ బారిన పడి చనిపోతున్నారు. అంటే సగటున రెండు సెకన్లకు ఒకరిని కుక్కలు కరుస్తుండగా.. అరగంటకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. ఈ విషయాన్ని ఇం డియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న రేబిస్ మరణాల్లో 36 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయని తెలిపింది. మన దేశంలో ఉన్న కుక్కల్లో 70 శాతం ఎవరూ పట్టించుకోనివేనని పేర్కొంది.
ఇలా దేశంలో ఒక కోటి 53 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, వీటి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని చెప్పింది.దేశంలో ముఖ్యంగా హాస్పిటళ్ల ఆవరణలో కుక్కల బెడద ఎక్కువవడం.. పేషెంట్లు, డాక్టర్లపై కుక్కలు దాడి చేయడం వంటి ఘటనలు పెరిగాయని వెల్లడించింది. వాటిని ఎలా నియంత్రించాలో తెలుపుతూ ఓ రిపోర్ట్‌ను ఐసీఎంఆర్ తాజాగా విడుదల చేసింది.
తీరు మారాలె
కుక్కల సంతతిని నియంత్రించేందుకు సరైన చట్టాలు లేకపోవడం వల్ల వాటి సంతతి వేగంగా పెరుగుతోందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో కుక్కల సంతతిని నియంత్రించేందుకు సీవీఎన్ (క్యాప్చర్ – న్యూటర్ – వ్యాక్సినేట్ – రిలీజ్) అనే పద్ధతి మాత్రమే అందుబాటులో ఉందని, ఇదంత ఎఫెక్టివ్ కాదని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు కుక్కలను పట్టుకొచ్చి, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వ్యాక్సిన్లు ఇచ్చి, మళ్లీ అదే ఏరియాలో వదిలేయడం వల్ల సమస్య పరిష్కారం అవదని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ పూర్తయిన కుక్కలను దత్తత తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది. విదేశీ, హైబ్రీడ్ డాగ్స్‌ను దత్తత తీసుకునే కల్చర్ నుంచి ఇండియన్ స్ట్రీట్ డాగ్స్‌ను దత్తత తీసుకునే దిశగా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని పేర్కొంది. కుక్కల ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్‌ను కూడా మార్చాలని ఐసీఎంఆర్ సూచించింది. ఆపరేషన్లకు బదులు వ్యాక్సిన్, ఇతర అడ్వాన్స్‌డ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్‌ను అడాప్ట్ చేసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయంది.
దవాఖానాల్లో మరింత ప్రమాదం
వీధి కుక్కలు అనేక వైరస్‌లకు రిజర్వాయర్లుగా ఉంటూ ఇతర జంతువులు, మానవులకు వాటిని స్ప్రెడ్ చేస్తున్నాయని ఐసీఎంఆర్ రిపోర్ట్‌లో వెల్లడించింది. రేబిస్, కెనైన్ అడినోవైరస్, డిస్టెంపర్ వైరస్, పర్వోవైరస్, టాక్సోప్లాస్మా ఎస్‌పీ, నియోస్పోరా వంటి అనేక వైరస్‌లు కుక్కల్లో ఉంటాయని పేర్కొంది. కుక్కలు ఎవరినైనా కరిచినప్పుడు ఈ వైరస్‌లు స్ప్రెడ్ అవుతాయని తెలిపింది. హాస్పిటల్ ఆవరణలో కుక్కలకు ఆహారం ఈజీగా దొరుకుతోందని, దీంతో కుక్కలకు దవాఖాన్లు ఆవాసాలుగా మారుతున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది. పదేండ్లలో జరిగిన అనేక ఘటనలను రిపోర్ట్‌లో ప్రస్తావించింది. గతేడాది హర్యానాలోని ఓ హాస్పిటల్‌లో రెండ్రోజుల పసికందును కుక్క కరిచి చంపడం, మూడేండ్ల క్రితం గుజరాత్‌లోని ఓ సివిల్ హాస్పిటల్‌లో, అదే ఏడాది యూపీలోని ఫరూఖాబాద్‌లో ఇలాంటి ఘటనలే జరగడాన్ని ప్రస్తావించింది. కుక్కలను నిరోధించేందుకు హాస్పిటల్స్‌లో వేస్ట్ మేనేజ్‌మెంట్ సరిగా ఉండాలని, కుక్కలు ఎంటర్ అవకుండా కాంపౌండ్ వాల్, గేట్లు నిర్మించాలని సూచించింది. హాస్పిటళ్లలో ఉన్న కుక్కలను పట్టి తీసుకెళ్లి, డాగ్ షెల్టర్లలో ఉంచాలని చెప్పింది.