ఈడీ బెదిరింపులతోనే రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా : అతిషి

ఈడీ బెదిరింపులతోనే రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా : అతిషి

ఢిల్లీ మంత్రి, AAP నాయకురాలు అతిషి మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఫైరయ్యారు. ఈడీతో బెదిరించి మా నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆమె విమర్శించారు. ఈ మేరకు అతిషి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో అరెస్టు చేశారని ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఏం నేరం చేశాడని కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని ఢిల్లీ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. ఉచిత విద్యుత్, నీరు, మంచి విద్య, మొహల్లా క్లినిక్‌లు ఇస్తున్నాడని అరెస్టు చేశారా? అని ప్రశ్నిస్తున్నారని చెప్పారు.  

మాజీ మంత్రి, ఆప్ నాయకుడు రాజ్‌కుమార్‌ ఆనంద్‌ ఎందుకు రాజీనామా చేశారో అందరికీ తెలుసన్నారు అతిషి. గత నవంబర్‌లో ఆయన నివాసంలో 23 గంటలపాటు ఈడీ దాడులు చేసిందని.... ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. అందుకే ఆప్ కు రాజీనామా చేశారని చెప్పారు. రాజ్‌కుమార్‌ ఆనంద్‌ తోపాటు మరికొంత మంది ఆప్ నేతలపై బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందని మంత్రి అతిషి ఆరోపించారు. 

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆప్ బలమైన సందేశంతోనే తాను ఆ పార్టీలో చేరానని.. కానీ, నేడు ఆ పార్టీ అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు రాజ్‌కుమార్‌ ఆనంద్‌. అందుకే తాను ఆప్ పార్టీ నుంచి  వైదొలగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.