3 నెలల్లో రూ. లక్ష కోట్లు రావాలి..గత సర్కార్​ బడ్జెట్ లో అంతా గందరగోళం : కాగ్ రిపోర్ట్ వెల్లడి

3 నెలల్లో రూ. లక్ష కోట్లు రావాలి..గత సర్కార్​ బడ్జెట్ లో అంతా గందరగోళం : కాగ్ రిపోర్ట్ వెల్లడి

హైదరాబాద్​, వెలుగు : గత సర్కార్​ అవాస్తవ లెక్కలో  పెట్టిన బడ్జెట్​తో  మొదటికే మోసం వచ్చింది. 2023–24 ఎన్నికల ఏడాది కావడంతో ఇష్టారీతిన నిధుల కేటాయింపులు, బడ్జెట్​ పద్దులు చూపించి గందరగోళానికి తెరలేపింది. కంప్రోల్టర్ అండ్​ ఆడిట్​జనరల్​(కాగ్​)  తాజాగా  రిలీజ్​ చేసిన రిపోర్ట్ తో ఈ విషయం స్పష్టమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. కాగ్​ ఇచ్చిన రిపోర్ట్​ ప్రకారం.. మూడు నెలల్లో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి కలిపి దాదాపు రూ.లక్ష కోట్లు రావాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలుగా కలిపి మొత్తం రూ.2.59 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేయగా.. డిసెంబర్​ పూర్తయ్యే నాటికి రూ.1.61 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి.

ఇదంతా 9 నెలల్లో రాగా .. ఇప్పుడు టార్గెట్​ చేరాలంటే కేవలం మూడు నెలల్లోనే రూ.లక్ష కోట్లు  రావాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చిన ఆదాయాన్ని చూస్తే..  టాక్స్​ ఆదాయం రూ.99,693 కోట్లు, నాన్​ టాక్స్​ రాబడి రూ.20,331 కోట్లు, గ్రాంట్​ఇన్​ఎయిడ్​ అండ్​ కాంట్రిబ్యూషన్​లో రూ.4978 కోట్లు, అప్పుల రూపంలో రూ.36,562 కోట్లు వచ్చాయి. తొమ్మిది నెలల్లో లక్షన్నర కోట్ల రూపాయాలు దాటితే..

కేవలం మూడు నెలల్లో మరో లక్ష కోట్ల రూపాయాలు ఎలా వస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. మూడు నెలల్లో రూ.45 వేల కోట్ల మేర ఆదాయం వచ్చినా ఇంకా కనీసం రూ.50 వేల కోట్ల గ్యాప్​ వచ్చే ప్రమాదం ఉంది. ఆదాయం రాకపోతే ఖర్చుకు కూడా అదే స్థాయిలో గండిపడుతున్నది. దీంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్​ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై తలలు పట్టుకున్నది. 

కేంద్రం గ్రాంట్లు 12 శాతమే

కేంద్రం నుంచి ఈ ఏడాది గ్రాంట్ల రూపంలో రూ.41,259 కోట్లు వస్తుందని బడ్జెట్లో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే ఈ 9 నెలల్లో  12 శాతం(రూ.4,978.04 కోట్లు) మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఇక  పన్నులపై ఆదాయంలో జీఎస్టీ ద్వారా రూ.50,942 కోట్ల లక్ష్యానికి రూ. 34,147 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై రూ.18,500 కోట్ల లక్ష్యానికి రూ. 10,654.35 కోట్లు, అమ్మకపు పన్నుద్వారా రూ.39,500 కోట్లకు రూ.22,251 కోట్లు, మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ సుంకం రూపంలో రూ.19,884 కోట్ల లక్ష్యానికి రూ.16,500 కోట్లు, కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.14,528 కోట్ల లక్ష్యానికి రూ. 10,253 కోట్ల ఆదాయం వచ్చింది.  

రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులను సైతం రెవెన్యూ రాబడి పద్దు కింద ఆదాయంలోనే చూపుతోంది. ఈ పద్దు కింద ఈ ఏడాది రూ.38,234.94 కోట్లు అప్పులు తీసుకోవడం బడ్జెట్ లక్ష్యం కాగా.. 9 నెలల్లో రూ.36,562.89 కోట్లు తీసుకుంది. గతేడాది ఇదే 9 నెలల్లో రూ.29,008 కోట్లు మాత్రమే తీసుకోగా ఈ ఏడాది అంతకుమించి సేకరించింది. అప్పులు ఎక్కువగా తీసుకోవడం వల్ల రాష్ట్ర రెవెన్యూ రాబడి అధికంగా కనిపిస్తున్నట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి.