కౌంటింగ్​కు అంతా రెడీ .. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో ఏర్పాట్లు

కౌంటింగ్​కు అంతా రెడీ  .. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో ఏర్పాట్లు
  • ఓట్ల లెక్కింపు సందర్భంగా పటిష్ట బందోబస్తు
  • మధ్యాహ్నం కల్లా వెల్లడికానున్న ఫలితాలు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు :  ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ జిల్లాలోని మెదక్​, నర్సాపూర్ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు హవేలి ఘనపూర్​ మండల పరిధిలోని వైపీఆర్​ కాలేజీలో జరగనుంది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్​, దుబ్బాక, హుస్నాబాద్​ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుంది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్​చెరు, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్​ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరుగనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

నియోజకవర్గాల్లోని ఈవీఎంల సంఖ్యకు అనుగుణంగా టేబుల్స్​ ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్ల పర్యవేక్షణలో, సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్​ సందర్భంగా మూడు చోట్ల పటిష్ట పోలీస్​బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద ఆదివారం ఉదయం 6 గంటల నుంచి144 సెక్షన్​ అమలులో ఉంటుంది. ఎలక్షన్​ కమిషన్​ జారీ చేసిన పాస్​లు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్​ కేంద్రంలోనికి 
అనుమతిస్తారు.  

సిద్దిపేటలో స్క్రీన్​ల ఏర్పాటు..

సిద్దిపేట లో కౌంటింగ్ కేంద్రాల వద్దకు పొలిటికల్​పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉండడంతో స్క్రీన్​లు ఏర్పాటు చేస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక బైరి అంజయ్య ఫంక్షన్ హాల్లో, బీఆర్ఎస్ నేతలు వయోలా గార్డెన్ లో కౌంటింగ్ ప్రక్రియను తిలకించేందుకు వీలుగా స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వచ్చిన నాయకులు, కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. గజ్వేల్, దుబ్బాక సెగ్మెంట్లకు సంబంధించి ఆయా పార్టీ నేతలు స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాళ్లను బుక్ చేశారు.

జోరుగా బెట్టింగ్ లు..

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్​ నేపథ్యంలో బెట్టింగ్ లు జోరందుకున్నాయి. ఏ అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తారు?  మెజార్టీ ఎంత వస్తుంది? రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అనే దానిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు, ఇతరులు సైతం  బెట్టింగ్ కాస్తున్నారు. కొందరు నగదు, మరి కొందరు దావత్ లు, ఇంకొందరు టూర్​లు బెట్​కడుతున్నారు.