
- తుంటి విరగడంతో హిప్ రీప్లేస్మెంట్
- యశోద హాస్పిటల్లో సర్జరీ
హైదరాబాద్/సిద్దిపేట, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జారిపడ్డారు. ఎడమ కాలి తుంటి విరగడంతో సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో శుక్రవారం రాత్రి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు.
ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. బాత్రూమ్కు వెళ్లి వస్తుండగా లుంగీ తట్టుకుని కేసీఆర్ కిందపడ్డారు. వెంటనే అంబులెన్స్‌లో యశోద హాస్పిటల్ తీసుకొచ్చారు. కేసీఆర్ కింద పడ్డారనే సమాచారం అందుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయన్ను హాస్పిటల్‌కు తరలించేందుకు గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేసీఆర్ సతీమణి శోభ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులు హాస్పిటల్ లోనే ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీశారు.
కోలుకోవడానికి ఎనిమిది వారాలు
శుక్రవారం ఉదయం, రాత్రి కేసీఆర్ హెల్త్ కండీషన్‌పై హాస్పిటల్ యాజమాన్యం బులిటెన్లు రిలీజ్ చేసింది. సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, ఇతర వైద్య బృందం కేసీఆర్ ఎడమ తుంటికి ఆపరేషన్‌చేసి హిప్ రీ ప్లేస్మెంట్ చేసినట్లు బులిటెన్‌లో వెల్లడించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఆపరేషన్ తర్వాత ఆయన్ను థియేటర్ నుంచి రూమ్‌కు తరలించి పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నామన్నారు. ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ మందులు ఇస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల టైం పడుతుందని తెలిపారు. అంతకుముందు, సీఎం ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ సెక్రటరీ రిజ్వీ యశోద హాస్పిటల్ వెళ్లారు. కేసీఆర్‌కు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: ప్రముఖులు
మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఏపీ సీఎం జగన్.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయం నుంచి త్వరగా రికవరీ కావాలని గవర్నర్ తమిళిసై దేవున్ని ప్రార్థించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ హెల్త్ కండీషన్‌పై ఆరా తీశారు.
కేసీఆర్ గాయపడటంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ గాయపడ్డారనే విషయం తెలుసుకుని చాలా బాధపడినట్లు నటుడు చిరంజీవి ట్వీట్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి దంపతులు, ఆయన కొడుకు, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి యశోద హాస్పిటల్‌కు వచ్చి కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు దానం నాగేందర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు యశోద హాస్పిటల్‌కు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు: హరీశ్ రావు
కేసీఆర్ కిందపడ్డారని తెలుసుకొని పార్టీ లీడర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్‌కు తరలివచ్చారు. ఈ క్రమంలో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారిపడ్డారు. యశోద హాస్పిటల్‌కు తీసుకొస్తే డాక్టర్లు సిటీ స్కాన్‌తో పాటు అన్ని రకాల పరీక్షలు చేశారు. తుంటి విరిగిందని చెప్పారు. శుక్రవారం రాత్రి స్పెషల్ డాక్టర్ల టీం హిప్ రీ ప్లేస్మెంట్ సర్జరీ చేసింది.
పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ధైర్యం కోల్పోవద్దు. ఇన్ఫెక్షన్ సోకుతుందనే కారణంతో డాక్టర్లు లోపలికి అనుమతించడం లేదు. ఎవరూ హాస్పిటల్‌కు రావొద్దు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ యాజమాన్యం ఎప్పటికప్పుడు హెల్త్ బులిటిన్ రిలీజ్ చేస్తుంది’’అని హరీశ్ తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్ బయటకు వస్తారని చెప్పారు.
కేసీఆర్‌కు గాయం బాధించింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారని తెలిసి బాధపడ్డానని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను” అని సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేశారు.