సర్కారు నుంచి బిల్లులు రాక గప్​చుప్​లు అమ్ముకుంటున్న మాజీ ఎంపీపీ

సర్కారు నుంచి బిల్లులు రాక గప్​చుప్​లు అమ్ముకుంటున్న మాజీ ఎంపీపీ

కల్వకుర్తి, వెలుగు: ప్రజా ప్రతినిధిగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సర్కారు నుంచి బిల్లులు రాకపోవడంతో నాగర్ కర్నూల్ ​జిల్లా కల్వకుర్తి మాజీ ఎంపీపీ గప్​చుప్​ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నది. ఎంపీపీ తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సునీత కురుమయ్య కల్వకుర్తి మండలంలో రఘుపతిపేట ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. అక్కడ ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్  కావడంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మహిళల మధ్య పోటీ నెలకొంది. అధికార నేతల ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరు రెండున్నరేండ్ల పాటు ఎంపీపీ పదవిలో కొనసాగాలని ఎమ్మెల్యే సమక్షంలో ఒప్పందం జరిగింది. ఫస్ట్ టర్మ్ లో సునీత కురుమయ్య ఎంపీపీ పదవిని చేపట్టింది.

ఆ సమయంలో ఆమె మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు పట్టణంలోని ఎంపీడీవో బిల్డింగ్​కు రూ.6 లక్షలు ఖర్చుపెట్టి పెయింటింగ్ తదితర పనులు చేయించింది. రెండున్నరేండ్ల తర్వాత ఒప్పందం ప్రకారం తన పదవికి రాజీనామా చేసింది. పదవి నుంచి దిగిపోయేంత వరకు చేసిన అప్పులు ఎవరిస్తారని ప్రశ్నించగా, తాము వచ్చేలా చేస్తామని ఎమ్మెల్యేతో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్నారు. అయినా బిల్లులు రాకపోవడంతో ఎంపీడీవో ఆఫీస్​కు ఆమె తాళం వేశారు. అధికారులు కల్పించుకొని బిల్లు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. రూ.30 లక్షలు ఖర్చుపెట్టి  ఎంపీపీ అయ్యానని, అభివృద్ధి పనులకు మరో రూ.6 లక్షలు అప్పు చేశానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమై, తప్పనిసరి పరిస్థితిలో కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​ సమీపంలో పానీపూరి బండి పెట్టుకుంది. ఇప్పటికైనా నాయకులు, అధికారులు కల్పించుకొని బిల్లులు వచ్చేలా చూడాలని సునీత కోరుతోంది.