గిరిజన మహిళపై ఎక్సైజ్‍ సీఐ దాడి.. గీసుకొండలో ఘటన

గిరిజన మహిళపై ఎక్సైజ్‍ సీఐ దాడి.. గీసుకొండలో ఘటన

వరంగల్‍, వెలుగు : వరంగల్‍ జిల్లాలో ఓ గిరిజన మహిళను ఎక్సైజ్‍ సీఐ కర్రతో కొట్టాడు. దీనిపై బాధితురాలు ఐదురోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో ఆలస్యం చేయడంతో గిరిజన సంఘాలు ఆందోళన కు దిగాయి. దీంతో సదరు అధికారిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఐదు రోజుల కింద గీసుగొండ మండలం జాన్‍పాక ప్రాంతానికి చెందిన తేజావత్‍ బుజ్జి వరంగల్‍–నర్సంపేట మెయిన్‍ రోడ్‍ వైపు వచ్చి వెళ్తోంది.

ఈ క్రమంలో ఎక్సైజ్​ సీఐ రమేశ్‍చంద్ర, సిబ్బంది  ఆమెను అడ్డగించారు. ఖాళీ వాటర్‍ బాటిల్‍ పట్టుకోవాలని చెప్పడంతో ఆమె వినలేదు. దీంతో సీఐ రమేశ్‍చంద్ర కర్రతో కొట్టాడు. అంతేగాక రూ.30 వేలు తెచ్చివ్వాలని వార్నింగ్​ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై బుజ్జి ఈ నెల 21న గీసుగొండ పోలీస్‍ స్టేషన్​లో కంప్లయింట్​చేసింది.   పోలీసులు పట్టించుకోకపోవడంతో గురువారం ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో పలుచోట్ల గిరిజన సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదులో సరైన ఆధారాలు లేకపోవడంతోనే కేసు నమోదుకు టైం పట్టిందని..అంతేతప్ప వేరే ఉద్దేశం లేదని సీఐ రామకృష్ణ తెలిపారు.