పీఎస్‌‌‌‌లో పిల్లి లొల్లి! ..లాలాగూడ పోలీస్స్టేషన్లో హైడ్రామా

పీఎస్‌‌‌‌లో పిల్లి లొల్లి! ..లాలాగూడ పోలీస్స్టేషన్లో హైడ్రామా
  • ఫారిన్‌‌‌‌ క్యాట్‌‌‌‌ను పెంచుకుంటున్న యువతి 
  •     ముద్దుగా ఉందని పట్టుకోబోయిన వ్యక్తి..చెయ్యి కొరికి పరార్​ 
  •     పిల్లి ఇంటికి రాకపోవడంతో అతడే ఎత్తుకెళ్లాడని కంప్లయింట్​

ఉప్పల్​/లాలాగూడ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పెంపుడు పిల్లి చుట్టూ హైడ్రామా నడిచింది. ఈ వ్యవహరం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. పిల్లి దొంగతనం ఆరోపణలు, బైక్ నంబర్ ఆధారంగా గాలింపు, చివరకు పోలీస్ స్టేషన్‌‌‌‌లో జరిగిన విచారణ ఒక సినిమా సీన్‌‌‌‌ను తలపించింది.  లాలాగూడ పరిధిలో నివసించే ఓ మహిళ విదేశీ పిల్లిని పెంచుకుంటున్నది. చాలా ఖరీదైన ఆ పిల్లి.. కనిపించకపోవడంతో పరిసరాల్లో గాలించింది. అయినా దొరక్కపోవడంతో సీసీటీవీ ఫుటేజీ చెక్​చేసింది. 

అందులో ఇంటి ఎదుట మొక్కలు అమ్ముకునే వ్యక్తి పిల్లిని పట్టుకునేందుకు యత్నించినట్టు  కనిపించింది. దీంతో తన పిల్లిని అతడే తీసికెళ్లాడని డిసైడ్ అయిన ఆ మహిళ.. అతడి బైక్ నంబర్ ఆధారంగా పోలీసులను ఆశ్రయించి కంప్లయింట్​ఇచ్చింది. పిల్లి మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. టెక్నికల్ అనాలసిస్ ద్వారా సదరు నిందితుడు చింతల్‌‌‌‌లో ఉన్నట్టు గుర్తించి పట్టుకొని పీఎస్​కు తీసుకువచ్చారు. 

క్షమాపణలు చెప్పడంతో సద్దుమణిగిన వివాదం

పీఎస్‌‌‌‌లో లాలాగూడ సీఐ సమక్షంలో ఇరు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడారు. అయితే,  తాను పిల్లిని ఎత్తుకెళ్లలేదని, అది ముద్దుగా ఉండడంతో పట్టుకోవాలని చూశానని, అది తన చేతిని కరిచి పారిపోయిందని మొక్కలు అమ్ముకునే వ్యక్తి చెప్పాడు. అది ఎక్కడికి పోయిందో తనకు  తెలియదని పేర్కొన్నాడు. కానీ, సీసీ టీవీ ఫుటేజీ సాక్ష్యం ఉందని, తన పిల్లిని అతడే మాయం చేశాడని, అతడే తిరిగి తెచ్చివ్వాలని బాధితురాలు  పట్టుబట్టింది. 

దీంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొన్నది. చివరకు సదరు వ్యక్తి పిల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించినందుకు మహిళకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన పోలీసులు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని యువకుడికి స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చి పంపించారు.