పదిహేనేండ్లు పనిచేయించుకొని.. పక్కన పెట్టిన్రు

పదిహేనేండ్లు పనిచేయించుకొని.. పక్కన పెట్టిన్రు
  • ఉద్యాన శాఖలో రోడ్డున పడ్డ 175 మంది ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్లు
  •  రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌‌ గ్రాంట్‌‌లు ఇవ్వక ఊడిన ఉద్యోగాలు
  • పైసలు లేవని రెన్యూవల్​చేయని హార్టీకల్చర్‌‌ డిపార్ట్​మెంట్​
  • కోట్లు ఖర్చు చేస్తూ అధికారుల విదేశీ టూర్లు
  • స్టేట్​లో ముందుకు సాగని మైక్రో ఇరిగేషన్‌

హైదరాబాద్‌‌, వెలుగు : హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో వందలాది మంది ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్లు రోడ్డునపడ్డారు. సుమారు 175 మంది ఉద్యోగులతో పదిహేనేండ్లకుపైగా పనిచేయించుకొని.. జీతాలు ఇవ్వడానికి  పైసలు లేవని వారిని పక్కన పెట్టేశారు. దీంతో వారి కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయి. ఈ ఉద్యోగుల్లో ఎక్కువశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే  ఉన్నారు. వారంతా 45 ఏండ్లకు పైబడిన వారే కావడంతో ఉన్న ఉద్యోగం పోయి.. వేరే ఉద్యోగం రాక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ముందుకు సాగని మైక్రో ఇరిగేషన్‌‌ 

హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మైక్రో ఇరిగేషన్‌‌ పథకం అమలు జరుగుతున్నది. ఈ స్కీమ్​అమలు కోసం హార్టీకల్చర్​డిపార్ట్​మెంట్​పదిహేనేడ్ల క్రితం 175 మంది హార్టీకల్చర్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్లను తీసుకుంది. అయితే, ఈ పథకం నిర్వహణకు కేంద్రం నిధులు ఇస్తున్నా.. దానికి మ్యాచింగ్‌‌ గ్రాంట్లు ఇవ్వాల్సిన రాష్ట్ర సర్కారు ఇవ్వడం లేదు. దీంతో మైక్రో ఇరిగేషన్‌‌ కుంటుపడింది. ఫలితంగా హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నిధులు లేవన్న సాకుతో మైక్రో ఇరిగేషన్‌‌లో పనిచేస్తున్న 175 మంది ఎక్స్‌‌టెన్షన్‌‌ అధికారులను తొలగించింది. కరోనా సమయంలో కొందరిని, ఆ తర్వాత మరికొందరిని తొలగించింది. మొత్తమ్మీద హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఎక్స్‌‌టెన్షన్‌‌ అధికారులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేసిన సుమారు 400 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కోట్లు ఖర్చు చేసి విదేశీ యాత్రలు..

ఉద్యానశాఖలో తక్కువ వేతనాలతో పనిచేసే వారిని తొలగించిన సర్కారు.. లక్షలకు లక్షలు, కార్లు ఇచ్చి హార్టీకల్చర్‌‌ అడ్వైజర్లను పెట్టుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, కోట్ల రూపాయలు ఖర్చు చేసి విదేశీ టూర్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులను తీసేయడంతో ఉన్న కూరగాయల పంటలు తగ్గిపోయాయి. హార్టీకల్చర్‌‌ విస్తరణ  కార్యక్రమాలన్నీ కుంటుపడ్డాయి. దీనికి తోడు గతంలో ఏర్పాటు చేసిన సెంటర్‌‌ ఆఫ్‌‌ ఎక్సలెన్సీలు ఆధ్వానంగా మారుతున్నాయి.  ఉద్యోగుల లేమితో హార్టీకల్చర్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వానంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.‌ 

హెచ్‌‌ఈవోలను విధుల్లోకి తీసుకోవాలి

హార్టీకల్చర్‌‌  ఎక్స్‌‌టెన్షన్‌‌ ఆఫీసర్లను వెంటనే రెన్యూవల్‌‌ చేసి విధుల్లోకి తీసుకోవాలి.  కరోనా కాలం నుంచి  హార్టీకల్చర్‌‌ హెచ్‌‌ఈవోలను రెన్యూవల్‌‌ చేయకుండా నిలిపివేశారు. కేవలం నిధులు లేవనే కారణంతో దశాబ్దాల తరబడి సంస్థలో పనిచేసిన మమ్మల్ని విధుల్లోంచి తొలగించారు. వయసు పైబడి వేరే ఉద్యోగాలు చేయలేక,  కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులకు గురవుతున్నం.  ఇప్పటికే రోడ్డున పడ్డాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యానశాఖ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.
- బొల్లు సైదులు, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ హెచ్‌‌ఈవో అసోసియేషన్‌‌