ట్రంప్ ఖాతాను రెండేళ్లు బ్యాన్ చేసిన ఫేస్‌బుక్

ట్రంప్ ఖాతాను రెండేళ్లు బ్యాన్ చేసిన ఫేస్‌బుక్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు   ప్రకటించింది. రెండేళ్ల తర్వాత ఈ నిర్ణయంపై మరోసారి రివ్యూ చేస్తామని తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ జనవరి 6న తన  ఫేస్‌బుక్‌‌లో చేసిన పోస్టులు.. తమ సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫేస్‌బుక్ పేర్కొంది. ఆ పోస్టుల వల్ల అమెరికా క్యాపిటల్ సిటీలో అల్లర్లు రేగాయని తెలిపింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టి.. ట్రంప్ ఫేస్‌బుక్ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది. అందుకే రెండేళ్ల పాటు ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. అంటే జనవరి 7, 2023 వరకు ట్రంప్ ఖాతా బ్యాన్‌లో ఉండనుంది. ఈ బ్యాన్ నిర్ణయం జనవరి 7, 2021 నుంచి పరిగణనలోకి తీసుకోబడుతుందని సోషల్ మీడియా సంస్థ తెలిపింది. దాంతో మరో 19 నెలల పాటు ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్ బ్యాన్‌లో ఉంటుంది. ఇదే వ్యవహారంపై ట్విట్టర్, యూట్యూబ్ గతంలోనే ట్రంప్‌ను శాశ్వతంగా బ్యాన్ చేశాయి. ఫేస్‌బుక్ నిర్ణయంతో.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు ట్రంప్ ఫేస్‌బుక్ అకౌంట్ యాక్టివ్ కానుంది.