సమాధిలో సపరివార సమేతంగా..

సమాధిలో సపరివార సమేతంగా..

అలెగ్జాండర్.. తాను చనిపోయాక తన చేతుల్ని ఆకాశం వైపు చూస్తున్నట్టు పైకి ఉంచి సమాధి చెయ్యాలని చెప్పాడట. తాను ఎన్ని విజయాలు సాధించినా, ఎంత సంపాదించినా చనిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదని చెప్పడానికి అలా చేశాడు. కానీ.. ఈ చైనా రాజు మాత్రం వెళ్తూ వెళ్తూ వజ్ర వైఢూర్యాలు సమాధిలో పెట్టమన్నాడు. అంతేకాదు.. తనకు సేవలు చేసేందుకు ఎనిమిది వేల మంది సైనికులు, సవారీ చేసేందుకు గుర్రాల బొమ్మలు చేయించి పెట్టించుకున్నాడు. సమాధిలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే.. ఇక్కడ మిస్టరీ ఏంటంటే.. ఆ రాజు శవం ఉన్న మెయిన్ ప్యాలెస్‌‌ని ఇప్పటికీ తెరిచే ధైర్యం ఎవరూ చేయడంలేదు.  

క్విన్ షి హువాంగ్‌‌ని చైనాకి మొదటి రాజుగా చెప్పుకుంటారు. ఎందుకంటే.. ఆరు చిన్న భాగాలుగా ఉన్న చైనాను దాదాపు రెండు వేల ఏండ్ల క్రితం ఏకతాటిపైకి తీసుకొచ్చింది ఇతనే. చైనాలోని రాజులను ఓడించి విశాలమైన చైనా సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. క్రీస్తు పూర్వం 210 సెప్టెంబరులో చనిపోయాడు. తర్వాత మధ్య చైనాలోని ఒక కొండ కింద అతని శవాన్ని పూడ్చిపెట్టారు. కానీ.. ఊరికే గొయ్యి తీసి పూడ్చకుండా ఏకంగా భూమి లోపల ఆయన కోసం ఒక నగరాన్ని నిర్మించి, అందులో ఎనిమిది వేల మంది సైనికుల బొమ్మలను కూడా పెట్టారు. ఆయన శరీరాన్ని ఎవరూ తాకడానికి వీల్లేకుండా సమాధి చుట్టూ విషపూరితమైన మెర్క్యురీని ఉంచారు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ సమాధానం దొరకలేదు. 

పునర్జన్మ.. 

ఇంతటి గొప్ప చక్రవర్తి అయినా.. హువాంగ్‌‌కు చావంటే భయం ఉండేదట. అందుకే తనను అమరుడిని చేసే అమృతాన్ని కనిపెట్టాలని అప్పటి శాస్త్రవేత్తలను ఆదేశించాడు. వాళ్లు కనిపెట్టిన కొన్ని డ్రింక్స్ కూడా తాగాడట. అవి తాగడం వల్లే 39 ఏండ్ల వయసులోనే చనిపోయాడని కొందరు చెప్తుంటారు. హువాంగ్ చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని ఒక సమాధిలో పూడ్చిపెట్టారు. చైనాలో ఇప్పటివరకు కట్టిన అత్యంత సంపన్నమైన సమాధి ఇదే. 

మరికొందరు అతనికి పునర్జన్మ మీద నమ్మకం ఉండేదని, కొన్నేండ్ల తర్వాత తన శరీరానికి మళ్లీ ప్రాణం వస్తుందని నమ్మేవాడని చెప్తున్నారు. అందుకే తనకు ప్రాణం వచ్చిన తర్వాత సేవలు చేసేందుకు పనివాళ్లు, సైన్యం, అతని భార్యలు కావాలనుకున్నాడు. కానీ.. వాళ్లందర్నీ చంపి సమాధి చేయలేక, వాళ్ల బొమ్మలను అతని సమాధిలో పూడ్చిపెట్టాలని ఆదేశించాడు. అవే ఇప్పుడు బయటపడిన బొమ్మలు. తనకు ప్రాణం వచ్చినప్పటికీ వాళ్లంతా చనిపోయి ఉంటారు.. కాబట్టి వాళ్లకు మళ్లీ ప్రాణం వస్తుందని నమ్మాడు. 

బావులు తవ్వుతుండగా.. 

1974లో జియాన్ ప్రాంతంలో రైతులు బావులు తవ్వుతుండగా కొన్ని పురాతన వస్తువులు దొరికాయి. దాంతో అక్కడ ఆర్కియాలజిస్ట్‌‌లు తవ్వకాలు మొదలుపెట్టారు. అందులో దాదాపు రెండు వేల మంది సైనికుల టెర్రకోట విగ్రహాలు దొరికాయి. వీటితోపాటు గుర్రపు బొమ్మలు, కొన్ని వస్తువులు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన సైనికుల విగ్రహాల్లో ఒకదానికి ఒకటి పోలికే లేదు. అన్ని ముఖాల కవళికలు వేరువేరుగా ఉన్నాయి. హెయిర్‌‌‌‌ స్టైల్‌‌ కూడా ఒకేలా లేదు. ఇప్పటివరకు దాదాపు రెండు వేల విగ్రహాలు దొరికాయి. కానీ.. ఈ సమాధిలో దొరికిన ఆధారాలను బట్టి మొత్తం ఎనిమిది వేల మంది విగ్రహాలు ఉన్నట్టు ఆర్కియాలజిస్ట్‌‌లు చెప్తున్నారు. నాలుగు దశాబ్దాల నుంచి ఆర్కియాలజిస్ట్‌‌లు ఇక్కడ రీసెర్చ్‌‌లు చేస్తున్నారు. కానీ.. ఇప్పటివరకు రాజు శరీరం పూడ్చిపెట్టిన గదిని మాత్రం తెరవలేదు. దానికి కారణం.. చక్రవర్తి సమాధి చుట్టూ మెర్క్యురీ ఉండడమే. సమాధి చుట్టూ మెర్క్యురీ ఉందని ఇప్పటికే సైంటిస్ట్‌‌లు కన్ఫర్మ్‌‌ చేశారు. కొందరైతే అక్కడ మెర్క్యురీ నదిలా పారుతుందని చెప్తున్నారు. ఒకవేళ సమాధి తవ్వితే ఆ విషపూరితమైన మెర్క్యురీ బయటికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే  చైనా గవర్నమెంట్‌‌ రాజు సమాధి ఉన్న ప్యాలెస్‌‌ని తవ్వడానికి పర్మిషన్ ఇవ్వడంలేదు. దాన్ని తవ్వేంత టెక్నాలజీ ఇప్పటికీ అందుబాటులో లేదని చెప్తోంది. అయితే.. కొందరు మాత్రం ఆ సమాధి తెరిస్తే.. రాజు, సైనికులకు ప్రాణం వస్తుందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. 

నిధులు ఉన్నాయా? 

చక్రవర్తికి ప్రాణం వచ్చిన తర్వాత బతకడానికి కావాల్సిన నిధులు ఉన్నాయని చాలామంది చెప్తుంటారు. రాజు సమాధి ఉన్న ప్యాలెస్‌‌లో వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని, వాటిని కాపాడేందుకే అప్పటి సైంటిస్ట్‌‌లు విషపూరితమైన మెర్క్యురీని ఆ ప్యాలెస్‌‌ చుట్టూ ఉంచారని చెప్తున్నారు. కానీ.. వాస్తవం ఏంటనేది ఆ రహస్య ప్యాలెస్‌‌ని తెరిచినప్పుడే తెలుస్తుంది.

ఎవరితను? 

క్విన్ షి హువాంగ్ (చిన్ షు హ్వాంగ్ అని కూడా పిలుస్తారు) క్రీస్తు పూర్వం 259 లో పుట్టాడు. ఆధునిక చైనాలోని ఆరు స్వతంత్ర రాజ్యాల్లో ఒకటైన క్విన్ రాజు పెద్ద కొడుకే హువాంగ్‌‌. అప్పటికే 200 ఏండ్ల నుంచి ఈ ఆరు రాజ్యాలు అధికారం కోసం పోరాడుతున్నాయి. హువాంగ్ రాజైన తర్వాత సైనిక బలం విపరీతంగా పెంచుకున్నాడు. కొత్త వ్యూహాలు తయారుచేసుకున్నాడు. తన తెలివితేటలతో మిగిలిన ఐదు రాజ్యాలను జయించాడు. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.