తెలంగాణలో 553 మంది పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్

తెలంగాణలో 553 మంది పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్

 

  •     ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తొలగింపు, మరో 15 మంది సస్పెండ్
  •     రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎంక్వైరీ
  •     నిర్లక్ష్యం వహించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు 
  •     ఫేక్ అటెండెన్స్​పై మంత్రి సీత‌‌క్క సీరియ‌‌స్


హైద‌‌రాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ కార్యద‌‌ర్శుల‌‌ ఫేక్ అటెండెన్స్ కలకలం సృష్టిస్తోంది. ఇటీవల జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయాపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న..  సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోను డీఆర్​ఎస్​ యాప్​లో అప్​లోడ్​ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది. వెంటనే ఆ సెక్రటరీని సస్పెండ్​ చేస్తూ ఆ జిల్లా కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సెక్రటరీల అటెండెన్స్​పై పంచాయతీరాజ్​శాఖ ఫోకస్​పెట్టింది. ఎక్కడెక్కడ ఫేక్​ అటెండెన్స్ వేశారనేదానిపై ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12,760 పంచాయతీలు ఉండగా..  వందల సంఖ్యలో కార్యద‌‌ర్శులు విధులకు హాజరు కాకుండా ఫేక్ అటెండెన్స్ నమోదు చేస్తున్నట్టు  ప్రభుత్వం దృష్టికి వచ్చింది. 

సెక్రటరీల ఫేక్​ అటెండెన్స్​పై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వ‌‌హిస్తే  ఉపేక్షించేదిలేదని అధికారులను హెచ్చరించారు. ఫేక్​ అటెండెన్స్​ వేసిన సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని పీఆర్​ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఫేక్​ అటెండెన్స్​పై విచారణ  ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 553 మంది పంచాయతీ సెక్రటరీలు ఫేక్​ అటెండెన్స్ వేసినట్లు గుర్తించారు. భారీ సంఖ్యలో ఫేక్ హాజరు నమోదవుతుండటంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. త‌‌ప్పుడు హాజ‌‌రు న‌‌మోదు చేస్తున్నవారిపై మంత్రి ఆదేశాల‌‌తో చ‌‌ర్యలు చేప‌‌డుతున్నారు. శనివారం ఒక ఔట్​సోర్సింగ్​ పంచాయ‌‌తీ కార్యద‌‌ర్శిని సర్వీస్ నుంచి తొలగించారు. మరో 15 మందిని సస్పెండ్ చేశారు. మిగిలిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. 

ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు

ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి డెయిలీ శానిటేషన్ రిపోర్టు యాప్​లో ఫేస్ రికగ్నైజ్డ్ మాడ్యూల్​లో హాజరు వేసుకోవాలి. పనిచేసే దగ్గర నేరుగా ఫొటో దిగి అప్ లోడ్ చేయాలి. యాప్​లో అప్ లోడ్ చేస్తున్న ఫొటో (సెక్రటరీ) వ్యక్తిదేనా? కాదా? నేరుగా దిగి అప్ లోడ్ చేశారా? ఫొటోను తీసి అప్ లోడ్ చేశారా? అనేది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీఓలు, డీపీఓలపై ఉంది. అయితే, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఫేక్​ అటెండెన్స్​కు దారితీసిందని పీఆర్​ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెక్రటరీలతోపాటు వారి అటెండెన్స్‌‌ను పర్యవేక్షించాల్సిన ఎంపీఓలు నిర్లక్ష్యంగా వ్యవరించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు విధుల్లో అలసత్వం ప్రదర్శించిన 47 మంది ఎంపీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.