2018 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ స్కీం ఆగిపోయింది

2018 నుంచి  వ్యవసాయ యాంత్రీకరణ  స్కీం ఆగిపోయింది

పెద్దపల్లి, వెలుగు: వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  ఫాం మెకనైజేషన్(వ్యవసాయ యాంత్రీకరణ) పథకం అటకెక్కింది.  2017–18 ఆర్థిక సంవత్సరం వరకు మాత్రమే ఈ పథకం నడిపి ఆపేశారు. దీంతో నాలుగేండ్లుగా రైతులు ఎదురుచూస్తున్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ప్రారంభించిన సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పంపిణీ పథకాన్ని మొదట్లో తెలంగాణ ప్రభుత్వం కూడా కొనసాగించింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం2018 వరకు సబ్సిడీపై లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఇచ్చింది. ఇందుకోసం రూ. 950 కోట్లు ఖర్చు చేసింది. 2018లో రైతుబంధు స్కీంను తెరమీదకు తెచ్చిన టీఆర్ఎస్ ఫాం మెకనైజేషన్​స్కీం పూర్తిగా నిలిపివేసింది. ప్రభుత్వంపై రైతుల వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో 2021–‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌22 బడ్జెట్​లో ఏకంగా రూ. 1,500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ కోసం కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  కానీ వాటిని ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఇక 2022–-23, 2023–-24 బడ్జెట్లలో ఫాం మెకనైజేషన్ ఊసే లేదు. జిల్లాల వర్గీకరణ జరిగిన తర్వాత దాదాపు 3,900 ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు  రైతులకు సబ్సిడీపై అందజేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 90 శాతం, ఇతర వర్గాలకు 50 శాతం సబ్సిడీపై ఇచ్చారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఎక్కువగా ఉండేది. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు చేసిన వారికే ట్రాక్టర్లు మంజూరు చేశారని ఆరోపణలున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీంను పూర్తిగా పక్కకు పెట్టేశారు.  

అప్లికేషన్లు తీసుకోలే..

రెండేళ్ల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 1,500 కోట్లు కేటాయించడంతో లబ్ధిదారుల్లో ఆశలు అలాగే ఉన్నాయి.  భారీ మొత్తం కేటాయించడంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీపై ట్రాక్టర్లు వస్తాయని ఆశపడ్డారు.  ఎప్పుడు దరఖాస్తుల కోసం నోటిఫికేషన్ ఇస్తారా అని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.  జిల్లాల్లో అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తుండటంతో దుక్కులు దున్నడానికి, పంట ఉత్పత్తులను మార్కెట్లకు, కొనుగోలు కేంద్రాలకు చేర్చేందుకు ట్రాక్టర్ల అవసరం తప్పనిసరైంది. వ్యవసాయ రంగంలో గతంలో కంటే వాటి వినియోగం పెరిగింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం గత బడ్జెట్​లో కేటాయించిన నిధులను ఖర్చు చేసేందుకు యాంత్రీకరణ స్కీం స్టార్ట్ చేయాలని రైతులు కోరుతున్నారు.


స్కీం రీస్టార్ట్ చేయాలె

వ్యవసాయంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అవసరం చాలా పెరిగింది. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దుక్కులు దున్నడానికి గతంలో ఎద్దులు, నాగళ్లు వాడేటోళ్లు. ఇప్పుడు ట్రాక్టర్లు తప్పనిసరయ్యాయి. ప్రభుత్వం నాలుగేళ్లుగా సబ్సిడీ మాటే మరిచిపోయింది. వెంటనే గతంలో మాదిరిగా సబ్సిడీ స్కీం రీస్టార్ట్ చేయాలె.
– రాజునాయక్, బామ్లానాయక్ తండా, పెద్దపల్లి జిల్లా

సబ్సిడీపై ఇవ్వాలి

గతంలో మాదిరిగానే సర్కార్ వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించాలి. గత నాలుగేళ్లుగా సబ్సిడీపై ట్రాక్టర్లు, రోటోవేటర్లు, ఇతర పనిముట్లు ఇవ్వడం నిలిపివేశారు. సొంతంగా కొనుగోలు చేసే పరిస్థితి చిన్న రైతులకు లేదు. అందుకే వెంటనే రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించాలి.
– గాజనవేన సదయ్య, తారుపల్లి, పెద్దపల్లి జిల్లా