భూమి పోతుందేమోనని  పురుగుల మందు తాగిన రైతు

భూమి పోతుందేమోనని  పురుగుల మందు తాగిన రైతు
  • భూమి పోతుందేమోనని  పురుగుల మందు తాగిన రైతు
  • కోర్టు ఆర్డర్స్​తో భూమి  స్వాధీనానికి రావడంతో ఆందోళన 
  •  జోగులాంబ గద్వాల జిల్లా  వెంకంపేట శివారులో ఘటన 
  • కర్నూలు దవాఖానకు తరలింపు 

గద్వాల, వెలుగు: తన భూమి పోతుందనే ఆందోళనతో జోగులాంబ గద్వాల జిల్లా వెంకంపేట శివారులో ఆదివారం మధ్యాహ్నం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..వెంకంపేట శివారులోని సర్వే నెంబర్ 98లో తొమ్మిది న్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో పట్నం  నర్సయ్యకు ఆరు ఎకరాలకు పైగా ఉండగా, మూడు ఎకరాల ముప్పై గుంటలు దాసరి హనుమంతుకు వచ్చింది. ఇందులో హనుమంతు సాగు చేసుకుంటున్నాడు. అయితే, మూడెకరాల ముప్పై గుంటలకు సంబంధించి భూవివాదం ఏర్పడగా వ్యవహారం కోర్టుకు వెళ్లింది. తీర్పు నర్సయ్యకు అనుకూలంగా రావడంతో ఆదివారం ఆర్డర్స్ తీసుకుని నర్సయ్య, అతడి కొడుకులు, మరో 50 మంది  పోలీస్ ప్రొటెక్షన్ తో భూమి స్వాధీనం చేసుకోవడానికి  వచ్చారు.

దీంతో తన భూమి పోతుందన్న ఆందోళనలో శీను (బాధిత రైతు అల్లుడు..భూమిలో వాటాదారుడు) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయనను పోలీసులు వెంటనే కర్నూలు దవాఖానకు తరలించారు. బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ ఫేక్ డాక్యుమెంట్లతో కోర్టు ఆర్డర్స్ తెచ్చుకున్నారని, తామే 3.30 ఎకరాలలో కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నామన్నారు. దీనిపై ఎస్పీకి కంప్లయింట్​చేశారు. దీనిపై గద్వాల డీఎస్పీ రంగస్వామి మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకే తాము ప్రొటెక్షన్ ఇచ్చామన్నారు. ఇదివరకే గద్వాల రూరల్ పోలీసులు రైతును పిలిచి మాట్లాడారని, పురుగుల మందు తాగిన రైతు పరిస్థితి బాగానే ఉందన్నారు. ఎక్కడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదన్నారు.  .