
లక్ష రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని సర్కారు హామీ ఇచ్చి దాదాపు మూడేండ్లయితున్నా అమలుకాక రైతులు ఆగమైతున్నారు. తీసుకున్న రుణంపై బ్యాంకులు మిత్తిల మీద మిత్తిలు వసూలు చేస్తుండటంతో నిండా మునుగుతున్నారు. నెలకు వంద రూపాయలకు 60 పైసల వడ్డీ మాత్రమేనని ముందుగా లోన్లు ఇచ్చే బ్యాంకర్లు.. ఏడాది దాటిన వెంటనే వడ్డీని రూపాయిన్నరకు పెంచి వసూలు చేస్తున్నారు. ఏడాది దాటిన ప్రతీ క్రాప్లోన్పై రూ. లక్షకు నెలకు రూ.1,500 వడ్డీ వేస్తున్నారు. అడిషనల్ చార్జీలు కూడా విధిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 25 వేలలోపు లోన్లను మాత్రమే ప్రభుత్వం మాఫీ చేసింది. మిగతా లోన్లను మాఫీ చేయకపోవడంతో దాదాపు 37.70 లక్షల మంది రైతులు గోసపడుతున్నారు. రూ.లక్షకు పైగా తీసుకున్న అప్పులు రెన్యువల్ చేసుకున్నప్పటికీ చేతికి చిల్లిగవ్వ రాక కన్నీటితో రైతులు బ్యాంకులను వీడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏటా రావాల్సిన క్రాప్‌లోన్ వడ్డీ డబ్బులు, రుణమాఫీ డబ్బులు వస్తే రైతులకు ఈ తిప్పలు తప్పేవి.
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రానికి చెందిన రైతు హరికృష్ణ(పేరు మార్చాం) తనకున్న 4.22 ఎకరాల వ్యవసాయ భూమిని స్థానిక బ్యాంకులో కుదవపెట్టి 2017 జూన్ 28న రూ.99 వేల క్రాప్‌లోన్ తీసుకున్నాడు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న క్రాప్‌లోన్లను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుందని ప్రకటించినా ఇప్పటికీ మాఫీ చేయలేదు. దీంతో బ్యాంకర్లు వడ్డీ తో కలిపి 2019 సెప్టెంబర్ 23న క్రాప్‌లోన్ మొత్తాన్ని రూ.1.17 లక్షలకు రెన్యువల్చేశారు. ఈ ఏడాది జూన్‌లో మరోసారి బ్యాంకర్లు రైతును పిలిచి 22 నెలలకు 1.17 లక్షలపై రూ.33 వేల వడ్డీ, ఇతర చార్జీలు కలిపి మొత్తంగా రూ.1.57 లక్షల లోన్ కింద కన్వర్ట్ చేశారు. అంటే సర్కారు క్రాఫ్‌లోన్ మాఫీ చేయకపోవడం వల్ల ఇప్పుడు రైతుపై అసలుకు కొసరు అన్నట్లుగా రూ.58వేల భారం పడింది. ఈసారి కూడా రుణమాఫీ చేయకపోతే 1.57లక్షలపై మళ్లీ వడ్డీ విధించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రూ.99వేల అసలు మాఫీ చేసినా, రూ.58వేల వడ్డీని తన జేబులోంచి కట్టుకోవాల్సిందేనని చెప్పడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు.
ఇది కేవలం రైతు హరికృష్ణకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు పడుతున్న ఆవేదన. ఇటు ప్రభుత్వం నుంచి క్రాప్‌లోన్ మాఫీ డబ్బులు పడకపోవడంతో బ్యాంకర్లు కొత్తలోన్లు ఇవ్వడం లేదు. దీంతో పెట్టుబడి కోసం రైతులు అడ్తీ వ్యాపారులు, ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం వారికి రావాల్సిన వడ్డీ డబ్బులను రైతుల నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటున్నారు.
37.7 లక్షల మందికి అందని రుణమాఫీ
రాష్ట్రంలో 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న రూ.లక్ష లోపు క్రాప్‌లోన్లను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.17,225 కోట్లను కేటాయించింది. కానీ ఇప్పటివరకు కేవలం బ్యాంకులో రూ. 25 వేలలోపు తీసుకున్న 2.96 లక్షల మంది రైతుల క్రాప్‌లోన్లను మాత్రమే మాఫీ చేసింది. దీనికోసం రూ.409 కోట్లను ఖర్చు చేసింది. ఇంకా రాష్ట్రంలో 37.70 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 1.57 శాతం మంది రైతుల క్రాప్‌లోన్లను మాఫీ చేసి చేతులు దులుపుకొన్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డ్వాక్రా మహిళల కంటే అధ్వానంగా రైతుల పరిస్థితి..
క్రాప్‌లోన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. 10 మంది డ్వాక్రా సంఘాల మహిళలు కలిసి ఎలాంటి ఆస్తులను కుదవపెట్టకుండానే రూ.5 లక్షలకు పైగా లోన్లు తీసుకుంటుంటే రైతులకు చెందిన రూ.10, 20 లక్షలకు పైగా విలువ చేసే భూములను కుదువపెట్టుకొని రూ.లక్ష లోన్ ఇవ్వడానికి బ్యాంకర్లు సతాయిస్తున్నారు. అదీగాక డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పుపై బ్యాంకర్లు రూపాయి వడ్డీ చార్జీ చేస్తుంటే ఏడాది తిరగక ముందే ప్రభుత్వం నుంచి 75 పైసల వడ్డీ తిరిగి వస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున డీఆర్‌డీవో సంస్థ పని చేస్తోంది. అదే రైతుల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోతోంది. క్రాప్లోన్లపై విధించే వడ్డీలను పట్టించుకోవడం లేదు. రైతులు తీసుకునే క్రాప్లోన్లపై 60 పైసల నుంచి రూపాయిన్నర వరకు బ్యాంకులు వడ్డీలు వేసి జమ చేసుకుంటున్నాయి. అయినా ఏ ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం లేదు.
ఏడాది దాటితే రూపాయిన్నర వడ్డీ
లక్షల విలువ చేసే భూములను తాకట్టు పెట్టుకొని రైతులకు బ్యాంకులు క్రాప్లోన్లు ఇస్తున్నాయి. అది కూడా ఎంత భూమి ఉన్నా కేవలం రూ. 1.6 లక్షలలోపు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. నెలకు వంద రూపాయలకు కేవలం 60 పైసల వడ్డీ మాత్రమే వేస్తామని బ్యాంకర్లు ముందుగా చెబుతున్నారు. తీరా రైతులు లోన్లు తీసుకున్నాక ఏడాది దాటిన వెంటనే వడ్డీని రూపాయిన్నరకు పెంచి తీసుకుంటున్నారు. ఏడాది దాటిన ప్రతీ క్రాప్లోన్పై రూ.లక్షకు నెలకు రూ.1,500 వడ్డీ వేస్తున్నారు. అడిషనల్ చార్జీలు కూడా విధిస్తున్నారు. ఈ విషయం తెలియక రైతన్నలు తికమక పడుతున్నారు. రూ.లక్షకు పైగా తీసుకున్న అప్పులు రెన్యువల్ చేసుకున్నప్పటికీ చేతికి చిల్లిగవ్వ రాక కన్నీటితో రైతులు బ్యాంకులను వీడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏటా రావాల్సిన క్రాప్ లోన్ వడ్డీ డబ్బులు, రుణమాఫీ డబ్బులు వస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని బ్యాంకర్లు చెబుతున్నారు.
కనీస గౌరవం లేదు
రాష్ట్రంలో రైతులకు కనీసం మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే గౌరవం కూడా దక్కడం లేదు. డ్వాక్రా మహిళలు బ్యాంకులో అప్పు తీసుకుంటే ఏడాది తిరక్కముందే 75 పైసల వడ్డీ తిరిగి వస్తుంది. అదే రైతులు బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకుంటే రూపాయిన్నర వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఇదెక్కడి న్యాయమో అర్థం కావట్లేదు.
- గండ్ర సత్యనారాయణరావు, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు, భూపాలపల్లి
సీఎంవన్నీ ఉత్త మాటలే
సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ ఉత్త మాటలే. లక్షలోపు క్రాప్‌లోన్లను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించి మూడేళ్లు అవుతోంది. అయినా ఇప్పటివరకు రైతుల క్రాప్‌లోన్ల మాఫీ జరగలేదు. బ్యాంకర్లేమో అధిక వడ్డీలను వసూలు చేస్తూ రైతన్నల నడ్డి విరుస్తున్నారు.
‒ ఎన్‌రెడ్డి హంసరెడ్డి, ఎంసీపీఐ(యు)
రాష్ట్ర నాయకులు, వరంగల్