తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయింది

 తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయింది
  • రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారు
  • సమస్యలను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడమంటే చేతకానితనానికి నిదర్శనం
  • కేసీఆర్ ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు దోషిగా నిలబడతారు
  • నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

హైదరాబాద్:  తెలంగాణలో రైతుల పరిస్థితి ఆగం అయిపోయిందని, రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను తీర్చాల్చిన కేసీఆర్ ధర్నా చేయడమంటే చేతకానితనానికి నిదర్శనం తప్ప మరొకటి కాదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ధర్నా చేస్తే దేశ ప్రజల ముందు తనను తాను దోషిగా నిలబెట్టుకున్నవారవుతారని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 
అన్నిపంటలు  కాకుండా కేవలం వరి పంట వేయాలని రైతులను కేసీఆర్ కోరారని, మార్క్ ఫెడ్ సంస్థను కేసీఆర్ నిర్వీర్యం చేసేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ లో 7లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతుందని,  మొక్కజొన్న పంట కొనుగోలును మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారని ఆయన ఆరోపించారు. రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని, వ్యాపారుల సిండికేట్ ల వల్ల రైతులు తక్కువ ధరకు మొక్కజొన్న పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారని ఆయన విమర్శించారు.  
ఎఫ్.సి.ఐ కొనుగోలు చేయడం వల్ల తెలంగాణలో కేవలం వరి పంట సాగు చేయాలని కేసీఆర్ కోరారని, ఎటువంటి కష్టం లేకుండా రైస్ మిల్లర్లు క్వింటాలు వడ్లకు 370 రూపాయాలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఎఫ్.సి.ఐ ఇచ్చే డబ్బులతో కేసీఆర్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థను నడుపుతున్నారని విమర్శించారు. రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యానికి కేంద్రం ఎఫ్.సి.ఐ నుండి సకాలంలో డబ్బులు చెల్లిస్తుందని, అయితే తెలంగాణ ప్రభుత్వం  రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ చేసిన దానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదన్నారు. రైతుల అయోమయ పరిస్థతికి కేసీఆర్ కారణమని ఆయన ఆరోపించారు.
తెలంగాణ రైతులను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టి వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి వరిధాన్యం సేకరణ సకాలంలో జరగడం లేదని, డబ్బులు చెల్లింపులు ఆలస్యం అవుతున్న దానిని ప్రశ్నించినందుకు బండి సంజయ్ పై రాళ్ల దాడి చేశారని విమర్శించారు. దేశానికి మోడీ వరం అయితే, కేసీఆర్ తెలంగాణకు శాపంగా మారారని, తెలంగాణ ప్రజలు, రైతులు తిరగబడే రోజు  దగ్గరలోనే ఉందన్నారు. 
అన్నిరకాల ఖర్చులు ఎఫ్.సి.ఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి సేకరణ భాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే దాన్ని కూడా సరిగా నిర్వహించడం లేదు. పారాబాయిల్ రైస్ తప్ప, మిగిలిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తోందన్నారు. వరిధాన్యం సేకరణను ఇప్పుడు కంప్యూటరీకరణ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, గతంలో తక్కువ ధాన్యం సేకరణ చేసి రిజిష్టర్లలో ఎక్కువ సేకరించినట్లు నమోదు చేసేవారని ఆయన ఆరోపించారు. 
ఈ కుంభకోణానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సేకరణ ప్రక్రియను కంప్యూటరీకరణ చేసిందని, కేసీఆర్ కుటుంబ ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై దర్యాప్తు విషయంలో ఎఫ్.సి.ఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బిజెపి, టీఆర్ఎస్ రాజకీయంగా కొట్టుకుంటుంటే  కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ లో, ఢిల్లీ వార్ రూంలో తమలో తాము కొట్టుకుంటున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు.