సంగారెడ్డి జిల్లాలో స్లోగా వడ్ల కొనుగోలు​ .. ఆందోళన చెందుతున్న రైతులు

సంగారెడ్డి జిల్లాలో స్లోగా వడ్ల కొనుగోలు​ .. ఆందోళన చెందుతున్న రైతులు
  • ఇప్పటికే 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు క్లోజ్​
  • ఇంకా కొనసాగుతోన్న వరి కోతలు
  • కొన్నది రూ. 223.35 కోట్ల వడ్లు
  • చెల్లించింది రూ.83.87 కోట్లు మాత్రమే

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా ఇప్పటికీ ధాన్యం సేకరణ సగం కూడా పూర్తి కాలేదు. చాలాచోట్ల వడ్లు కల్లాల్లోనే ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు ఎన్నికల హడావిడితో కూలీలు దొరక్క కోతల సమస్య తలెత్తగా ఇప్పుడు కోసిన ధాన్యాన్ని అమ్మాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో ధాన్యం నిల్వలు దర్శనమిస్తున్నాయి.

లక్ష్యం 2,93,950 టన్నులు, కొన్నది 1,39,457 టన్నులే

జిల్లా వ్యాప్తంగా మొత్తం198 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఐకేపీ 85 కేంద్రాలు, పీఏసీఎస్​80, డీసీఎంఎస్​ద్వారా 33 కేంద్రాలను అందుబాటులో ఉంచారు.  వానకాలం సీజన్ లో 1,51,359 ఎకరాల్లో వరి సాగు చేయగా, 3,67,440 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ 2,93,950 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సిన లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటివరకు కేవలం 1,39,457 ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణ పూర్తికాకుండానే 13 కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేసి కేంద్రాలను మూసేశారు. మరోవైపు వరి కోతలు సగం కూడా పూర్తి కాకముందే కేంద్రాలు మూసేయడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు.  నాలుగైదు రోజుల నుంచి వాతావరణం చల్లబడడంతో ధాన్యం ఆరడం లేదు. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కేంద్రాల నిర్వాహకులు తీసుకుని ఆపైన తడిసిన ధాన్యాన్ని వెనక్కి పంపిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పైసలు ఇస్తలేరు

రైతుల నుంచి సేకరించిన ధాన్యం చెల్లింపులు కూడా సరిగా చేయడం లేదు.  ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లో రైతుల బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కావాల్సి ఉంది. కానీ జిల్లాలో అలా జరగడం లేదు.  ఇప్పటివరకు 17,942 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించగా వీటికి సంబంధించి రూ.223.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ 7,510 మంది రైతులకు రు.83.87 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 10,432 మంది రైతులకు సంబంధించిన రూ.139.48 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉన్నాయి. బకాయిపడిన కొనుగోలు సొమ్మును వెంటనే చెల్లించాలని కొందరు.. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరికొందరు రైతులు డిమాండ్​ చేస్తున్నారు.