
- ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సెంటర్ల నిర్వాహకులు
- ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
- అధికారులు స్పందించాలని వేడుకోలు
నిజామాబాద్, వెలుగు : అన్నదాతలకు మద్దతు ధర ఇచ్చి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే తరుగు పేరుతో నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. కడ్తా తీయొద్దని నిజామాబాద్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేస్తుండడం విశేషం. 40 కిలోల వడ్ల బస్తాకు రెండు కిలోలు, గన్నీ బ్యాగ్ బరువు 650 గ్రాములు కోత విధిస్తూ క్వింటాల్‌కు సుమారు 3 కిలోల తరుగు తీస్తున్నారు. సెంటర్ల నిర్వాహకులు తమ రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు.
సర్కార్ సెంటర్లకు రైతుల క్యూ
యాసంగి సీజన్‌కు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 4.19 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 11.85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని జిల్లాయంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నది. సన్నరకం 6.80 లక్షల మెట్రిక్‌టన్నులు, దొడ్డు రకం 2.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు 664 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఆ సంఖ్యను 698 సెంటర్లకు పెంచింది. కోతలు ప్రారంభమైన ప్రాంతాల్లో 458 కొనుగోలు సెంటర్లను ప్రారంభించగా రైతులు క్యూ కడుతున్నారు.
ప్రభుత్వ మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తుండడంతో ప్రభుత్వ సెంటర్లకు అధిక శాతం రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. దీంతో మిల్లర్లు ప్రైవేటు కాంటాలు పెట్టే ధైర్యం కూడా చేయలేదు. ప్రభుత్వం సింగిల్ విండో, ఐకేపీ, ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో సెంటర్లను ఏర్పాటు చేయగా, నిర్వాహకులు తరుగు పేరుతో దోచుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దోచుకుంటుంటే చూసి తట్టుకోలేక భీంగల్ మండలం గొనుగొప్పుల గ్రామ రైతులు రాస్తారోకో చేయగా, కోటగిరి మండలంలోని అన్నదాతలు దోపిడీని అరికట్టాలని కోరుతూ తహసీల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వ నిబంధనలు బేఖాతర్..
17 శాతం తేమ ఉన్నా, వడ్లు రంగుమారినా, తాలు, మట్టి పెల్లలు ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 'ఏ' గ్రేడ్ క్వింటాల్ వడ్లకు రూ.2,320, సన్నాలకు రూ.2,300తో పాటు బోనస్ రూ.500 ఇస్తున్నది. వడ్ల క్వాలిటీ బాగోలేదని కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు బెదరగొట్టి 40 కిలోల బస్తాకు 2 కిలోలు అదనంగా తీసుకుంటున్నారు. క్వింటాల్ వడ్లకు 3 కిలోలు తరుగు తీస్తూ అన్నదాతలను దోచుకుంటున్నారు.
ఆఫీసర్ల పర్యవేక్షణ లేదు..
40 ఎకరాల్లో సన్న రకం వరి పంట వేసి కోతలు ముగించిన. తరుగు పేరుతో క్వింటాల్‌కు 3 కిలోలు తీసుకుంటుండ్రు. ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా దండుకుంటుండ్రు. కడ్తా వల్ల లారీ లోడ్‌కు రూ.20 వేల ఆదాయం తగ్గింది. - పత్తి సాయిలు, రైతు కోటగిరి
గతంలో కిలో తీసుకునేటోళ్లు
20 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేసిన. ఈసారి పెట్టుబడి ఖర్చు పెరిగింది. గతేడాది క్వింటాల్‌కు కిలో తరుగు తీసుకునేటోళ్లు. ఇప్పుడు 3 కిలోలు చేసిన్రు. ఇట్లయితే మాకు ఎలా గిట్టుతది.. ఎట్లా బతుకాలె. కడ్తా లేని కాంటాలు పెట్టేలా ఆఫీసర్లు చొరవ చూపాలి.- మామిడి శ్రీనివాస్, రైతు కోటగిరి
అదనంగా తరుగు తీస్తే కఠిన చర్యలు
గన్నీ బ్యాగ్ బరువు కింద 650 గ్రాములు మినహాయించి అదనంగా వడ్ల తరుగు తీయొద్దు. రూల్స్‌పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో సెంటర్ నిర్వాహకులకు ట్రైనింగ్ ఇచ్చాం. అదనంగా కడ్తా తీసుకుంటున్నట్లు ఫిర్యాదు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వరికోత మిషన్ బ్లోర్ ఆన్‌లో పెట్టించి పంట కోయిస్తే తాలురాదు. ఎఫ్ఏక్యూ స్టాండర్డ్ ప్రకారం రైతులు
వడ్లు తోలాలి. - శ్రీకాంత్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం