బీర్పూర్, ధర్మపురి మండలాల్లో భారీగా పంట నష్టం 

బీర్పూర్, ధర్మపురి మండలాల్లో భారీగా పంట నష్టం 

జగిత్యాల, వెలుగు: నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ లో నిర్మిస్తున్న రోళ్ల వాగు రిజర్వాయర్ కట్ట తెగిపోయింది. దీంతో సుమారు బీర్పూర్ మండలంతో పాటు ధర్మపురి మండలాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పంట నష్టం జరిగింది. ఆయకట్ట కింద పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాటిని తొలగించేందుకు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రైతులు నాట్లు వేసి కలుపు తీస్తున్నారు. అయితే సాగు నీరందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. కట్ట మరమ్మతులు పూర్తి కాకపోవడం, సర్కార్ ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కాల్వ పనులు కూడా నీరందించేందుకు ఉపయోగపడటంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అరగుండాల, బుగ్గ చెరువు కనుమరుగు..
జగిత్యాల జిల్లా బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచడానికి బీర్పూర్ మండల శివారులో ఉన్న రొల్లవాగును 2017 లో రీ డిజైనింగ్ పేరుతో 1 టీఎంసీ నిల్వ ఉండేలా ప్రాజెక్టు పనులు చేపట్టారు. సుమారు రూ.60 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు రూ.130 కోట్ల వ్యయానికి పెరిగింది. ఈక్రమంలో నెల రోజుల క్రితం జులైలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు కట్ట తెగి సుమారు రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. అలాగే ప్రాజెక్టు కిందగల అర గుండాల, బుగ్గ చెరువులు నామ రూపాల్లేకుండా పోయాయి. బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్, కొల్వాయి, కోమన్ పల్లి, చిత్రవేణి గూడెం, చిన్న కోల్వాయి, తాళ్ల ధర్మారం, రేకుల పల్లి, కమ్మునూర్, మంగేళ, కండ్లపల్లి, చెర్లపల్లి, రంగసాగర్, కందెన కుంట, ధర్మపురి మండలం దోనూర్, నక్కలపేట, తుమ్మెనాల, గాదెపల్లి, తీగల ధర్మారం, కుసురుపల్లి, దుబ్బలగూడెం, జైనా, రాజారాం, దమ్మన్నపేట, ధర్మపురి గ్రామాల్లో ప్రత్యేక్షంగా పరోక్షంగా సుమారు 4,800 వేల ఎకరాలకుపైగా పంటలను రైతులు నష్టపోయారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనూ నీరందట్లే..
బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు అనకట్ట తెగిపోవడంతో దాని కింద ఉన్న బీర్పూర్, ధర్మపురి మండలాల్లో ఆధికారికంగా 15 వేల ఎకరాల్లో సాగు నీరందకుండా పోయింది. దీంతో ఆఫీసర్లు ప్రాజెక్టు లోకి వచ్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ-53, 12ఎల్ కాలువను నేరుగా రోళ్ల వాగు కింద ఉన్న బుగ్గ చెరువు, అరగుండాలకు వెళ్లే కాల్వలకు కలిపి రైతుల పొలాలకు సాగు నీరందించాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 1.50  కిలో మీటర్ల పొడువుతో కొత్త కాల్వలు తవ్వి పాత కాల్వలకు కలిపే పనులు చేపట్టారు. అయితే ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈసారి కూడా పంట మునిగామని రైతులు భోరుమంటున్నారు. 

రెండు పంటల్లో నష్టమే
పంట నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోలేపోయింది. ఎంతో ఖర్చు పెట్టుకుని ఇసుక మేటలు తొలగించాం. భూముల హద్దులు కూడా గుర్తు పట్టలేకపోయాం. కష్టపడి ఈ సారి పంట వేసినా నీరులేక ఎండిపోతున్నాయి. సర్కార్ నీరందించేలా ఏర్పాటు చేయాలి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలి. - శ్రీనివాస్​, రైతు బీర్పూర్ 

నీరందే అవకాశం లేదు
రోళ్లవాగులో చూక్క నీరు లేకుండాపోయింది. మరో రెండు పంటలకు కూడా నీరు అందే అవకాశం లేదని ఆఫీసర్లకు తెలిసినా ప్రత్యామ్నాయ చర్యలు చేయలేకపోయారు. భారీ వర్షాలకు బావులు పూడుకపోయాయి. కాల్వ నీరు కూడా అందక పంట నష్టపోయే ప్రమాదం ఉంది. - రమేశ్, రైతు, బీర్పూర్