ఢిల్లీ బార్డర్​లో రైతుల ఉపవాసం

ఢిల్లీ బార్డర్​లో రైతుల ఉపవాసం

ఉపవాస దీక్ష చేసిన 32 సంఘాల నేతలు

ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా నిరాహార దీక్ష చేసిన లీడర్లు

వారికి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా కూడా..

జిల్లాల హెడ్​క్వార్టర్స్​లో రైతుల ధర్నాలు.. సింఘు బార్డర్​లో రెండంచెల భద్రత

మరోసారి చర్చల కోసం ఫార్మర్ లీడర్లతో సంప్రదింపులు: తోమర్

న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఉపవాసం చేశారు. సుమారు 32 మంది రైతు సంఘాల నేతలు సింఘు బార్డర్​లో దీక్షకు దిగారు. వీరికి మద్దతుగా రైతులతోపాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉపవాసం పాటించారు.

జిల్లాల్లో ధర్నాలు

దేశవ్యాప్తంగా రైతులు జిల్లాల హెడ్​క్వార్టర్స్​లో ధర్నాలు చేశారు. పంజాబ్, హర్యానాల్లో జిల్లా కమిషనర్ల ఆఫీసుల ముందు ఆందోళనలు చేపట్టారు. శంభు బార్డర్​కు రైతులు భారీగా చేరుకోవడంతో అంబాలా–పాటియాలా హైవేను పోలీసులు క్లోజ్ చేశారు. పంజాబ్​లో లూథియానా, పాటియాలా, సాంగ్రూర్, బర్నాలా, భటిండా, మోగా, ఫారిద్​కోట్, ఫిరోజ్​పూర్, టర్న్ టరన్ తదితర జిల్లాల్లో ధర్నాలు జరిగాయి. ఇక హర్యానాలో ఫతేహాబాద్, జింద్, సిర్సా, కురుక్షేత్ర, గుర్గావ్, ఫరీదాబాద్, భివాణి, ఖైత ల్, అంబాలా జిల్లాల్లో రైతులు నిరసనలు చేపట్టారు.

ఢిల్లీ, జైపూర్ హైవే పై గొడవలు

ఢిల్లీ, జైపూర్ హైవేపై రైతులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. హర్యానా నుంచి ట్రాక్టర్ల మీదుగా ఢిల్లీ వైపు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రైతులను లాక్కెళ్లడం, ట్రాక్టర్ల తాళాలను లాక్కోవడం వీడియోల్లో కనిపించింది.  20 మందిని అదుపులోకి తీసుకుని గంట తర్వాత రిలీజ్ చేశారు.

టైట్ సెక్యూరిటీ

ఢిల్లీ పోలీసులు బార్డర్ పాయింట్లలో సెక్యూరిటీ పెంచారు. సింఘు బార్డర్​లో మల్లీలేయర్డ్ సిమెంట్ బారియర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించారు. రెండో వరుసలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పారామిలటరీ ఫోర్సెస్​ను మోహరించారు. పలు బార్డర్లను మూసేశారు. ప్రయాణికులు ఆల్టర్నేటివ్ రూట్లలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ ద్వారా కోరారు. ‘‘సింఘు, అవుచాందీ, పియావు, మణియారి, సభోలి, మాంగేవ్, ఘజియాబాద్ తదితర బార్డర్లు క్లోజ్​లో ఉన్నాయి. లాంపూర్, సాఫియాబాద్, సింఘు స్కూల్ టోల్ ట్యాక్స్ బార్డర్ల ద్వారా వేరే రూట్లలో వాహనదారులు వెళ్లాలి. ఓఆర్ఆర్​ గుండా వెళ్లొద్దు” అని పేర్కొన్నారు.

క్లాజ్ బై క్లాజ్ చర్చకు రెడీ

మరోసారి చర్చలు జరిపేందుకు సంబంధించి ఫార్మర్ లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. త్వరలో మీటింగ్ జరుగుతుందని ఆయన అన్నారు. ‘‘రైతులతో ఎప్పుడైనా సరే చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాతి మీటింగ్​కు రెడీ కాగానే రైతు నేతలే సమాచారం ఇవ్వాలి” అని కోరారు. చట్టాలను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. క్లాజ్ బై క్లాజ్ చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. అంతకుముందు హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తర్వాత వ్యవసాయ చట్టాలను సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన ఆలిండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) రైతుల బృందంతో సమావేశమయ్యారు. మొత్తంగా 10 రైతు సంఘాలు అగ్రి చట్టాలకు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి.

ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి: రైతులు

 

రోడ్లను బ్లాక్ చేసి ఇబ్బందులు పెడుతున్నందుకు ప్రజలు క్షమించాలని రైతులు కోరారు. ఈ మేరకు సంక్యుక్త కిసాన్ మోర్చా.. పాంప్లెట్లను పంచింది. ‘‘మేం

రైతులం. మమ్మల్ని అన్నదాతలని అంటారు. మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు బహుమతి లాంటివి అని ప్రధాని అంటున్నారు. అవి గిఫ్టులు కాదు.. శిక్షలు. మాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. మేం పండించిన పంటకు మద్దతు ధర చెల్లిస్తామని గ్యారంటీ ఇవ్వండి” అని అందులో కోరింది. ‘‘మాకు దానం అవసరం లేదు.. ధర కావాలి” అని స్పష్టం చేసింది. ‘‘రోడ్లను బ్లాక్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు. అవసరం కోసం మేం ఇక్కడ కూర్చున్నాం. మా ఆందోళనలు మిమ్మల్ని బాధిస్తే.. మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. క్షమించండి” అని విజ్ఞప్తి చేసింది.

రైతు సోదరుల కోసం ఉపవాసం ఉండండి: కేజ్రీవాల్

రైతులకు మద్దతుగా అర్వింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్ష చేశారు. రైతుల ఆందోళనల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు, సపోర్టర్లు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘‘ఉపవాసం పవిత్రమైనది. మీరు ఎక్కడ ఉన్నా మన రైతు సోదరుల కోసం ఉపవాసం ఉండండి. వారి పోరాటం సక్సెస్ కావాలని ప్రార్థించండి. చివరికి రైతులు కచ్చితంగా గెలుస్తారు” అని ట్వీట్ చేశారు.