పరిహారం పదేండ్లలో రెండుసార్లే

పరిహారం పదేండ్లలో రెండుసార్లే
  • పంటనష్టంపై రిపోర్టులకే పరిమితమైన బీఆర్ఎస్​ సర్కార్​
  • ఇంకో రెండుసార్లు కేంద్రం నిధులతోనే ఇన్​పుట్​ సబ్సిడీ
  • ఐదేండ్ల అధికారిక లెక్కల ప్రకారమే 30 లక్షల ఎకరాల్లో పంట నష్టం 
  • రాష్ట్ర వాటా కట్టొద్దని పంటల బీమా ఎత్తివేత  
  • నిరుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 5 లక్షల ఎకరాల్లో నష్టం అంచనా
  • రూ.500 కోట్లు అవసరమైతే పావు వంతు కూడా ఇయ్యలే
  • మొన్నటి వరకు కేఆర్​ఎంబీ.. ఇప్పుడు ఫార్మర్​ ఫార్ములా 
  • పాలిటిక్స్​ చేస్తున్నారని బీఆర్ఎస్​పై కాంగ్రెస్​ ఫైర్​

హైదరాబాద్​, వెలుగు : వర్షాభావ పరిస్థితులు, భారీ వర్షాలు, వరదలకు పంటలు నష్టపోయిన రైతులకు గత పదేండ్లలో రెండు సార్లు మాత్రమే గత బీఆర్ఎస్ సర్కారు​ నుంచి నష్ట పరిహారం లభించింది. అన్నదాతలు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా గత సర్కారు ప్రిలిమినరీ రిపోర్టులకే పరిమితమైందే తప్ప.. రైతులకు పైసా ఇవ్వలేదు. ఇన్​పుట్​ సబ్సీడీ కింద మరో రెండుసార్లు సాయం అందినప్పటికీ అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చినవే కావడం గమనార్హం.  

అటు పంటల బీమా అమలు గాక.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోక రైతులు రూ.వేల కోట్ల విలువైన పంటను కోల్పోయి అప్పుల పాలయ్యారు. గడిచిన ఐదేండ్లలో  రాష్ట్రంలో భారీ వర్షాలకు పంట నీట మునిగి, వరదలకు కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నప్పటికీ కనీసం సమగ్ర పంట నష్టం అంచనా వేయకపోవడంతో రైతులకు పరిహారం అందకుండా పోయింది.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుడు వర్షాలకు నీటమునిగిన పంటలకు రూ.500 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇందులో రూ.150 కోట్లకు బడ్జెట్​ఉత్తర్వులిచ్చారు. వీటికి సంబంధించి ప్రణాళికలు చేసినా పూర్తిస్థాయిలో రైతులకు పరిహారం అందలేదు. పంటల బీమా అమలు చేయకపోవడం,  విత్తన సబ్సిడీ ఎత్తివేయడం, పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నారు.  

గత ఐదేండ్లలో 30 లక్షల ఎకరాలు నష్టం..

గడిచిన ఐదేండ్లలోనే రైతులు దాదాపు 30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2020లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 14.93 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. అయితే, ఇది కాగితాలకే పరిమితమైంది. 2021, 2022లో పంట నష్టం వాటిల్లినా ప్రిలిమనరీ రిపోర్ట్​ కూడా తయారు చేయలేదు.

నిరుడు ఎన్నికల సంవత్సరం కావడంతో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనాలు వేశారు. ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని నాటి ప్రభుత్వం ప్రకటించింది. రూ.500 కోట్లకు గాను రూ.150 కోట్లకు మాత్రమే బడ్జెట్​ ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకున్నారు.  2016, 2017, 2019, 2020లలో పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు రూపొందించినా పక్కన పెట్టేశారు. పంట బీమా పేరుతో ఇన్​పుట్ సబ్సిడీని పట్టించుకోవడమే మానేశారు. దాదాపు నాలుగేండ్ల నుంచి రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్​బీమా యోజన కూడా అమలు చేయడం లేదు. 

గతంలో ఇన్​పుట్ సబ్సిడీ ఇలా..

2009 నుంచి 2014 దాకా ప్రకృతి విపత్తుల వల్ల 14 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.518 కోట్లు ఇచ్చాయి. 2014లో 70,156 ఎకరాల్లో పంటలు నష్టపోతే రూ.80.61 కోట్లు చెల్లించారు. 2015లో తుఫాన్, కరువుతో 13.53 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోగా, రూ.703 కోట్లు ఇచ్చారు. ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే మంజూరైంది. 2016, 2017లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని సర్కారు.. 2018లో 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే రూ.22 కోట్లు మాత్రమే చెల్లించింది.

2019, 2020, 2021లో పైసా ఇవ్వలేదు. ఏదైనా పంట 33 శాతానికి పైగా దెబ్బతింటే ఎకరాకు ఇంత అని లెక్కగట్టి ఇవ్వాలి. ఆ ప్రకారం ఎకరా వరికి ఇన్​పుట్ సబ్సిడీ రూ.5,463, పత్తి, కంది, సోయాబీన్, పెసర, జొన్నలు, వేరుశనగకు ఎకరాకు రూ.2,751 చొప్పున, మక్కజొన్నకు రూ.3,372 చెల్లించాలి. 2020లో 14.93 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా.. రూ.7 వేల కోట్ల విలువైన పంట నష్టం అయినట్టు అధికారులు రిపోర్ట్​ రూపొందించారు. ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వాలంటూ సర్కార్​కు నాటి వ్యవసాయ కమిషనర్ లెటర్ రాసినా.. ప్రభుత్వం అందుకు అనుమతించలేదు.

మొన్నటి దాకా కేఆర్​ఎంబీ.. ఇప్పుడు ఫార్మర్​ ఫార్ములా

మొన్నటి వరకు కృష్ణా నదీ జలాలపై బీఆర్ఎస్​ పార్టీ రచ్చ చేసిందని.. ఇప్పుడు పంట నష్టం, రైతు ఆత్మహత్యలపై పాలిటిక్స్​ మొదలుపెట్టిందని కాంగ్రెస్​ విమర్శలు చేస్తున్నది. ఫార్మర్​ ఫార్ములాతో కేసీఆర్​ లోక్​సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మొన్నటిదాకా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడంతో దీనిని రాజకీయం చేసి లబ్ధి పొందాలని కేసీఆర్‌ భావించారనీ, కానీ, కాళేశ్వరం కుంగిపోవడం, దక్షిణ తెలంగాణను పట్టించుకోకపోవడం అనే అంశాలపై ప్రజలు సీరియస్​గా ఉండటంతో ఆశించిన ఫలితం రాలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  

అది కాంగ్రెస్‌కే ప్లస్‌ అయిందని చెబుతున్నారు.  దీంతో కేసీఆర్‌ ఒకే సభ పెట్టి సైలెంట్‌ అయ్యారని అంటున్నారు. ఈ క్రమంలో లోక్​సభ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు చావో రేవో అన్నట్టుగా తయారయ్యాయని,  ఈ నేపథ్యంలో కేసీఆర్‌ మళ్లీ ఫాంహౌస్‌ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అందుకే ఫార్మర్స్​ ఫార్ములాను ఎంచుకున్నారని అంటున్నారు.

పంటల బీమా ఎత్తేసిన్రు

రాష్ట్రంలో 2019-20 వరకు    ప్రధాన మంత్రి ఫసల్‌‌ బీమా యోజన కొనసాగింది. ఆ తర్వాత నుంచి రాష్ట్ర వాటా కట్టాల్సి వస్తుందని ఈ పథకం నుంచి అప్పటి ప్రభుత్వం తప్పుకొన్నది. అప్పటి నుంచి పంటల బీమా పథకం లేకపోవడంతో విపత్తులు, కరువుతో  పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం అందలేదు.  ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం పంటల బీమాలో చేరాలని నిర్ణయం తీసుకున్నది. రానున్న ఖరీఫ్​ నుంచి రైతుల తరపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని భావిస్తున్నది.