రూలింగ్​ పార్టీకి రైతుల టెన్షన్​..

రూలింగ్​ పార్టీకి  రైతుల టెన్షన్​..
  • జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తితో పోరాడుతున్న రైతులు    
  • హామీలు నెరవేర్చకపోవడంతో  భారీగా నామినేషన్లు   


జగిత్యాల, వెలుగు :  ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాలో  ప్రధాన పార్టీలకు  ఫార్మర్స్​ భయం పట్టుకుంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపధ్యంలో అన్ని పార్టీలు రైతులకు సంబంధించిన అంశాలపైనే దృష్టి పెడుతున్నాయి.  గతంతో  ఎన్నికల  హామీలను విస్మరించిన నేతలకు ఇక్కడి రైతులు చుక్కలు చూపించారు. తమ సమస్యలపై రెండు జిల్లాల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు అభ్యర్థుల తలరాతలు మార్చేశాయి.  తెలంగాణ విప్లవోద్యమంలో కీలకమైన  జగిత్యాల జైత్ర యాత్ర స్ఫూర్తితో 2019 లోకసభ ఎన్నికల సందర్భంగా రైతులు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ నుంచి చేపట్టిన రైతు పాదయాత్ర రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించింది.    

పార్లమెంట్​ ఎన్నికల్లో  పార్టీలకు   షాక్​

పసుపు పంటకు మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటు,  ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ తదితర అంశాలపై రైతులు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఈ అంశాలపై  ఎన్నికలు వచ్చినప్పుడల్లా  అన్ని పార్టీలు హామీలు గుప్పించాయి.  ఆ హామీలు నెరవేర్చకపోవడంతో 2018 ఆగస్టు 15న  జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ నుంచి   రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, పసుపు బోర్డు ఉద్యమ నాయకుడు ముత్యాల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.  తమ డిమాండ్లపై పార్టీల మీద ఒత్తిడి పెంచేందుకు  2019 పార్లమెంట్ ఎలక్షన్​లో 8 వందలకు పైగా రైతులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ తర్వాత  175 మంది బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో నిజామాబాద్​ లోకసభ స్థానం నుంచి పోటీ చూసిన అధికార పార్టీ అభ్యర్థి, అప్పుడు సిట్టింగ్​ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత  ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ   మధు యాష్కి కి డిపాజిట్ కూడా దక్కలేదు.  

క్రియాశీల పోరాటాల్లో రైతులు 

గత అసెంబ్లీ, లోకసభ ఎన్నికల తర్వాత కూడా రెండు జిల్లాల పరిధిలో రైతులు తమ సమస్యలపై క్రియాశీలంగా పోరాడుతున్నారు.  2020 అక్టోబర్​లో మక్కలకు మద్దతు ధర ఇవ్వాలంటూ  రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.   కరీంనగర్​, నిజామాబాద్​ జిల్లాల్లో  రైతులు రోడ్డెక్కడంతో ఆలస్యంగా తేరుకున్న రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది.   ఈ ఏడాది జగిత్యాల  వెల్గటూరు మండలం పాశిగామలో  ఇథనాల్​ ప్రాజెక్టు వద్దంటూ అక్కడి రైతులు  రెండున్నర నెలలపాటు విరామం లేకుండా   ఉద్యమించారు.  మెట్​పల్లి మండలం మెట్లచిట్టాపూర్​ గ్రామంలో ఇథనాల్​ ప్రాజెక్టు వద్దంటూ రైతులు ఉద్యమించినా ప్రభుత్వం పనుల ప్రారంభానికి 
పూనుకోవడంతో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. స్పందించిన హైకోర్టు పనులు నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద వ్యవసాయ భూములు కోల్పోయిన వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామ రైతులు  పరిహారం కోసం పదేళ్లుగా ఆందోళన  కొనసాగిస్తున్నారు.

ఎర్రజొన్నకు మద్దతు  ధర  కోసం ఉద్యమం

ఎర్రజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలని, మధ్య దళారులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ 2005 నుంచి 2007 వరకు ఆర్మూర్​ రైతులు కదంతొక్కారు. దీంతో  సర్కార్​ దిగి వచ్చి  దళారుల సమస్య పరిష్కరించి మద్దతు ధర ప్రకటించింది.  నిజామాబాద్​ జిల్లా బోధన్​, మెదక్​ జిల్లా ముంబాజిపల్లె, జగిత్యాల జిల్లా ముత్యంపేట్ షుగర్​ ఫ్యాక్టరీలను రీ ఓపెన్ చేయాలంటూ స్థానిక రైతులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.  ఎస్సారెస్పీ  నుంచి నేరుగా వరద కాలువల ద్వారా మిడ్​మానేరుకు నీళ్లు తరలించడంతో కరీంనగర్, నిజామాబాద్ ​జిల్లాల రైతులకు నష్టం కలుగుతోందని , తమకు సాగు నీరు ఇవ్వాలని కోరుతూ  ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. దీంతో  సర్కార్​ ఆయకట్టుకు నీరందించింది.

బీఆర్ఎస్ శ్రేణుల్లో భయం

గత ఎన్నికల్లో రైతుల నిరసన ఫలితం ఎలా ఉంటుందో అనుభవమైన  రూలింగ్​ పార్టీకి ఈసారీ ఎన్నికల భయం పట్టుకుంది.    ముత్యం పేట్ షుగర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయిస్తామని, సూరమ్మ రిజర్వాయర్- కుడి, ఎడమ కాలువలను పూర్తి చేస్తామని,  బీర్ పూర్ రోళ్ల వాగు రిజర్వాయర్ నిర్మాణంతోపాటు ధర్మపురిలో డ్రైనేజీ వాటర్​ గోదావరిలోకి కలవకుండా ట్రీట్​మెంట్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తామని  సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారు. ఇందులో ఏదీ ఇంతవరకు  అమలు కాలేదు. దీంతో రైతుల నుంచి ఈసారి కూడా వ్యతిరేకత తప్పదని నిజామాబాద్​ లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దళితబంధు, బీసీ బంధు,  గృహలక్ష్మీ, డబుల్​ బెడ్రూం ఇళ్ల స్కీమ్​లపై జనాలనుంచి వ్యక్తమవుతున్న నిరసనలతో అవస్థలు పడుతున్న బీఆర్‌‌ఎస్​ నేతలు రైతుల  స్పందన ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.