అదిలాబాద్లో మిర్చి పంట ఎండుతోంది

అదిలాబాద్లో మిర్చి పంట ఎండుతోంది
  • వాతావరణ మార్పులతో వేగంగా వ్యాపిస్తున్న తెగుళ్లు
  • ఒకటి, రెండు రోజుల్లోనే ఎండిపోతున్న ఎకరాల పంట
  • జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సాగు.. ఇప్పటికే సుమారు 100 ఎకరాలకు ఎఫెక్ట్
  • తీరని నష్టంతో రైతుల దిగాలు

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: రైతన్నలు గంపెడు ఆశలు పెట్టుకొని సాగుచేస్తున్న ఎర్ర బంగారం పంట తెగుళ్ల బారిన పడుతోంది. ఎకరాల కొద్దీ పంట ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 2 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతోంది. ముఖ్యంగా కాగజ్ నగర్ డివిజన్ లో ఈ ఏడాది సాగు గణనీయంగా పెరగ్గా.. కౌటాల మండలం తాటిపల్లి గ్రామం మూడేండ్లుగా ఈ పంట సాగులో ఆదర్శంగా నిలుస్తోంది. ఈ ఏడాది ఈ గ్రామంలో 800 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు.

వారం రోజుల కిందటివరకు పంట బాగుందని, ఈ సారి తమకు లాభాలు వస్తాయని భావించిన రైతులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారం రోజుల నుంచి వడ తెగులు వ్యాప్తితో ఎకరాల కొద్దీ మిర్చి పంట పూర్తిగా వాడిపోయి ఎండిపోతోంది. వాతావరణంలో మార్పులు ,హెచ్చు తగ్గులే ఇందుకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. భూమిలో ఉండే బ్యాక్టీరియా చెట్టుకు ప్రధానమైన తల్లి వేరును ఆశించి క్రమంగా చెట్టును నాశనం చేస్తోందని.. కాత దశ దాటి పండు దశకు వచ్చే సమయంలో ఈ తెగులు తన ప్రభావాన్ని చూపి చెట్టును ఎండిపోయేలా చేస్తోందని చెబుతున్నారు.

మూడు రోజుల్లో చెట్టు ఖతం

చంటిపాపను నిత్యం జాగ్రత్తగా చూసుకున్నట్లే మిర్చిని సైతం అంతే జాగ్రత్తగా చూసుకోవాలని అనుభవమున్న రైతులు చెబుతారు.  పత్తి, సోయా పంటలు దిగుబడి లేకపోవడంతో, ఇటీవల కాలంలో ప్రతికూల వాతావరణంలోనూ రైతన్నలు ముందడుగేసి మిర్చి పంట సాగు చేస్తున్నారు. కానీ మూడేండ్లుగా ఈ పంటకు సంక్రమిస్తున్న తెగుళ్లతో రైతులకు నష్టం జరుగుతోంది. వేరు వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే ఈ తెగులు చేతికొచ్చిన పంటను కండ్ల ముందే నాశనం చేస్తోంది.

ఎన్ని పురుగు మందులు కొట్టినా నో ఎఫెక్ట్..

ఎండు తెగులు నివారణకు రైతులు ఎన్ని పురుగు మందులు వాడినా ప్రయోజనం లేకుండాపోతోంది. పెస్టిసైడ్స్​తో పాటు ఆర్గానిక్ మందులు వాడినా ఈ తెగుళ్లు పంటను వీడడంలేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో ఇటీవల తాటిపల్లి శివారులో తెగుళ్లు సోకిన పంటలను వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ తెగుళ్లు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పంట మార్పిడి చేస్తే మేలు జరుగుతుందని వారు సూచించారు. ఒక చేనులో ఈ తెగుళ్లు సోకితే  చేన్లలోకి సులువుగా వ్యాప్తి చెందుతుందని అందుకే ఈ తరహాలో తెగులు సోకి పంటలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు.

పెట్టుబడి కూడా వచ్చేలా లేదు

నేను గతేడాది ఆరు ఎకరాల్లో మిరప పంట సాగు చేస్తే సుమారు 160 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈసారీ అదే స్థాయిలో దిగుబడి వస్తుందనే ఆశతో ఏడెకరాల్లో పంట వేశాను. ఇప్పటికి రూ.6 లక్షలు ఖర్చు చేశా. వారం కిందటి వరకు పంట కాతతో బాగుంది. ఈసారి ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశపడ్డా. కానీ ఉన్నట్టుండి పంట ఎండిపోతోంది. రెండు రోజుల్లోనే మొక్కలు ఎండిపోయాయి. ఇప్పటికే రూ.3 లక్షల వరకు నష్టం జరిగింది. ఎలాంటి మందులు వాడినా మార్పు కనిపించడంలేదు. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు.  – రోహిణి భాస్కర్, రైతు, తాటిపల్లి గ్రామం

పంట మార్పిడితో తెగుళ్ల నివారణ

పంట మార్పిడితో మాత్రమే ఈ తెగుళ్లను నివారించవచ్చు.పెసర, జిలుగ, మినుముల పంటలు సాగు చేస్తే అవి బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. పంట మార్పిడి చేసుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది.
– శ్రీనివాస్ రావు, ఏడీఏ, ఆసిఫాబాద్

చేనుకు పోవాలంటే బాధగా ఉంది

నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నా. మొదటి నుంచి పంటను కంటికి రెప్పలా చూసుకున్న. మంచి కాత కాయడంతో సంతోష పడ్డాను . కానీ ఉన్నట్టుండి తెగులు సోకి వందల సంఖ్యలో మొక్కలు వాడిపోయాయి. కోతకు వచ్చిన పంట ఇప్పుడు పనికి రాకుండా పోయింది. చేనుకు పోవాలంటే బాధ కలుగుతోంది. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం వృథా అయ్యింది. ఇక దేవుడే దిక్కు.  
– రవి రోహిణి, రైతు, తాటిపల్లి