18 లక్షల మందికి ఫాస్టాగ్ డబ్బులు తిరిగిచ్చేశాం : కేంద్ర మంత్రి గడ్కరీ

18 లక్షల మందికి ఫాస్టాగ్  డబ్బులు తిరిగిచ్చేశాం : కేంద్ర మంత్రి గడ్కరీ
  • వారి అకౌంట్లోంచి పొరపాటున కట్‌ అయినయ్‌: కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: గతేడాది దాదాపు 18 లక్షల వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల నుంచి పొరపాటున డబ్బులు కట్ అయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్ సభలో వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఆయా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాల్లో తిరిగి జమ చేశామని గడ్కరీ తెలిపారు. ఈమేరకు గురువారం లోక్ సభ ప్రశ్నోత్తరాలలో ఆయన రాతపూర్వక జవాబిచ్చారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం 17.7 లక్షల మంది వాహనదారుల ఫాస్టాగ్ ఖాతాలో పొరపాటున అమౌంట్ కట్ అయిందని మంత్రి చెప్పారు. 

వాస్తవానికి వారి వాహనాలు టోల్ గేట్ నుంచి ప్రయాణించకపోయినా కూడా ప్రయాణించినట్లు నమోదై ఆ మేరకు చార్జీలు ఫాస్టాగ్ నుంచి డిడక్ట్ అయ్యాయని వివరించారు. టోల్ గేట్ల వద్ద వాహనాల నెంబర్లను మాన్యువల్ గా నమోదు చేసే సమయంలో సిబ్బంది చేసిన పొరపాట్ల వల్ల ఈ పరిణామం చోటుచేసుకుందని వివరించారు. ఇలాంటి కేసులను గుర్తించి వారి ఖాతాల్లో నుంచి కట్ అయిన సొమ్మును నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) తిరిగి చెల్లించిందని మంత్రి తెలిపారు.