పితృదేవోభవ ..ఫాదర్స్ డే స్పెషల్

పితృదేవోభవ ..ఫాదర్స్ డే  స్పెషల్

నాన్న శ్రమజీవి.. కుటుంబం కోసం అలుపెరుగని ప్రయాణం చేస్తాడు. బాధ్యతల బరువులు మోస్తూ ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఇష్టాలు కూడా మర్చిపోతాడు. తన వారి కోసం ఆలోచిస్తూ బతికేస్తాడు. అయినా ఎందుకో నాన్నకి ఈ సమాజంలో అంత గుర్తింపు లేదనిపిస్తుంది. వెలకట్టలేని నాన్న ప్రేమకు, త్యాగానికి ఈరోజు మనసారా అభినందనలు తెలుపుదాం. నాన్నకు ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుదాం...

అమ్మ(mother) జన్మనిస్తే.. నాన్న(father) జీవితాన్ని ఇస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే .. నాన్న కష్టాలు రాకుండా కావలి కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే.. నాన్న కష్టాన్ని గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై జీవన పోరాటం చేస్తాడు. తన అలసటని కూడా కనపడనీయకుండా బతుకుబండిని నడిపిస్తాడు. జూన్ 18 తండ్రుల దినోత్సవం’ (fathers day). నాన్న కష్టాన్ని గుర్తించండి.. నాన్న ఇష్టాలు నెరవేర్చండి..

జూన్ 18న  ఫాదర్స్ డే

మనకు జీవితాన్ని ఇచ్చిన అమ్మా,నాన్నల్ని ప్రతిరోజు ప్రేమిస్తాం... గౌరవిస్తాం. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకప్పుడు మనకు తెలియని ఫాదర్స్ డే, మదర్స్ డే లు మన సంస్కృతిలో భాగమైపోయాయి. ఇండియాలో కూడా ఈ సెలబ్రేషన్స్‌కి ఇంపార్టెన్స్ బాగా పెరిగిందనే చెప్పాలి. ఫాదర్స్ డే ఏటా జూన్ నెలలో వచ్చే మూడవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూన్ 18 న ఫాదర్స్ డే.  మన ఎదుగుదలకు కారణమైన తండ్రికి శుభాకాంక్షలు చెప్పడం.. బహుమతులు ఇవ్వడం.. వారి ఆశీస్సులు అందుకోవడం చేస్తారు.

ఫాదర్స్ డే చరిత్ర... 

ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక చరిత్ర ఉంది. మొదటగా యునైటెడ్ స్టేట్స్‌లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. 1909లో సొనోరా అనే మహిళ సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన మదర్స్ డే సెలబ్రేషన్స్‌కి వెళ్తున్నప్పుడు పాదర్స్ డే జరపాలని ఆలోచన వచ్చిందట. సొనోరా తల్లి 16 సంవత్సరాల వయసులో చనిపోయిందట. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్  ప్రసిద్ధ కవి, రచయిత మరియు శిల్పి. తనతో కలిపి ఐదుగురు తోబుట్టువులను పెంచడంలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని సొనోరా గ్రహించారట. తండ్రులు కూడా గుర్తింపు ఇవ్వాలని వారు కూడా ప్రశంసలకు పాత్రులని భావించి స్పోకేన్ మినిస్టీరియల్ అసోసియేషన్‌కు ఫాదర్స్ డే ఆలోచనను ప్రతిపాదించారట సొనోరా. అలా మొదటి ఫాదర్స్ డే 1910 జూన్ 19న  వాషింగ్టన్‌లోని స్పోకెన్‌లో జరిపారు. 1972 నుంచి రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఫాదర్స్ డే అధికారికంగా యునైటెడ్ స్టేట్స్‌లో జాతీయ సెలవుదినంగా గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఫాదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవుదినంగా నిర్వహించుకోవడం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది.

తండ్రికి కూతురితో అనుబంధం..

తండ్రికి కొడుకుతో కన్నా కూతురుతో ఉండే అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఏ విషయాన్నైనా తండ్రికి షేర్ చేయడానికి కొడుకు భయపడితే.. కూతురు ధైర్యంగా చెప్పగలుగుతుంది. ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మెట్టినింటికి వెళ్లిపోతుంటే తల్లి పైకి వెక్కి వెక్కి ఏడుస్తుంటే తండ్రి లోలోపల కుమిలిపోతాడు. కొడుకు పట్ల అమితమైన ప్రేమ ఉన్నా.. బాధ్యతలు నేర్పడంలో కాస్త కఠినంగా ప్రవర్తిస్తాడు తండ్రి . అయినా బిడ్డలంటే తండ్రికి పంచ ప్రాణాలు.

తండ్రి కష్టం గురించి

నిజంగానే నాన్న కష్టం గురించి మాట్లాడుకుంటే సమాజంలో పెద్దగా చర్చ జరగదు. కుటుంబాన్ని పోషించడం కోసం తండ్రి పడే కష్టం కంటికి కనిపించదు. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు అంటూ ఒక్కొక్క బాధ్యతల్ని పూర్తి చేసి వారికి మంచి భవిష్యత్ అందించేదాకా తండ్రి పడే కష్టం మాటల్లో చెప్పలేనిది. ఆడవారితో కంపేర్ చేస్తే మగవారి జీవితం ఎక్కువగా బయట ప్రపంచంలోనే గడిచిపోతుంది. పిల్లలతో గడపడం వారితో సంతోషాలు, సరదాలు తక్కువ అనే చెప్పాలి. కుటుంబాన్ని పోషించడానికి రోజంతా శ్రమ పడి వచ్చి కాసేపు తన బిడ్డలతో గడిపే సమయం అరుదుగా దొరుకుతుంది. తండ్రి అంటే పిల్లలకు ఎక్కడో చిన్న భయం ఉంటుంది. తండ్రి పెట్టే ఆ భయం వెనుక అతను ఇచ్చే భద్రత, క్రమశిక్షణ దాగి ఉంటాయి.

తండ్రిని గుర్తు పెట్టుకోవాలి..

జీవితానికి ఓ దారి చూపించిన తండ్రిని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిన్నప్పుడు మనం అడక్కుండానే మన ఇష్టాలు తెలుసుకుని నెరవేర్చిన తండ్రికి ఏది ఇష్టమో మీరెప్పుడైనా గమనించారా? వారి చిన్న చిన్న ఆనందాలు గుర్తించారా? కనీసం ఈరోజైనా మీ తల్లిదండ్రుల దగ్గర కాస్త సమయం గడపండి. వారితో మీరు పంచుకున్న ఎన్నో అనుభవాలను గుర్తు చేసుకోండి. అందమైన బహుమతులు ఇవ్వండి. అన్నింటి కన్నా మీకు మేమున్నామనే భరోసా ఇవ్వండి.


కాలం మారిపోయింది.. రెక్కలొచ్చిన బిడ్డలు తల్లితండ్రుల్ని మర్చిపోతున్నారు. తమ దారి చూసుకుని వెళ్లిపోతున్నారు. ఇదివరకులా పేరెంట్స్ కూడా బిడ్డలను కనడమే కానీ వారేదో తమని చూస్తారనే  భ్రమలు వదిలి వాస్తవంలో జీవిస్తున్నారు. వారికి భవిష్యత్తు ఇచ్చి తమ అడ్రస్ వృద్ధాశ్రమాలే అని ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ఎదురుగా ఉన్నా తల్లిదండ్రుల్ని పట్టించుకోని బిడ్డలు కొందరైతే.. విదేశాల్లో స్థిరపడిపోయి పేరెంట్స్‌కి డబ్బులు పంపించి వారి బాధ్యతలు చూసేస్తున్నాం అనుకునే బిడ్డలు ఉన్నారు.

చాలామంది ఒంటరైన భార్యాభర్తలు ఉంటారు. లేదా పిల్లలు పంచుకోవడం వల్ల తలో చోట ఉన్నవారు ఉంటారు. వారున్న పరిస్థితి మనకెదురైతే అనే ఆలోచన చేయండి. ఒంటరిగా ఉన్న మీ తండ్రిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితం మొత్తం పిల్లల కోసమే కష్టపడి కనీసం చరమాంకంలో కలిసి బతుకుదామనుకున్న తల్లితండ్రుల్ని విడదీయకండి. వారి కంట కన్నీరు రాకుండా చూసుకోండి. తాము పస్తులున్నా మనకు తిండిపెట్టి.. బతుకునిచ్చిన తల్లితండ్రుల్ని బాధ్యతల పేరుతో పంచుకోకండి. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఇదే వారికి అందరూ ఇవ్వగలిగిన విలువైన బహుమతి.

ఇక ఫాదర్స్ డే రోజు నాన్నకి ఇష్టమైన పనిచేయడం.. ఇష్టమైన బహుమతి ఇవ్వడం.. ఇష్టమైన ఫుడ్ తినిపించడం.. చేస్తే సంతోషపడతారు. కొడుకులు, కూతుర్లు ఇలాంటి సందర్భాల్లో అయినా తల్లితండ్రుల దగ్గరకు వస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేం. సెల్ ఫోన్ మెసేజ్ లలో, వీడియో కాల్స్ లో పంచే ప్రేమలకు.. ప్రత్యక్షంగా వారిని కలిసి కాసేపు గడిపిన సమయానికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఈరోజున ( జూన్ 18) పోస్ట్ పోన్ చేసుకుని మీ పేరెంట్స్ దగ్గర కాసేపు గడపండి. ఈ ఒక్కరోజే కాదు ప్రతిరోజు మీ జీవితానికి కారకులైన తల్లితండ్రుల్ని ప్రేమిచండి. కంటికి రెప్పలా కాపాడుకోండి. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.