లాక్ డౌన్ భయంతో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలు

లాక్ డౌన్ భయంతో సొంత ఊళ్లకు వెళ్తున్న వలస కూలీలు

కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదు అవుతుండటంతో.. దేశంలోని అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో కూలి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. వ్యాప్తి కేసులు ఎక్కువ నమోదు అవుతుండటంతో మళ్లీ పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తారన్న భయాలతో సొంతూళ్లకు వెళ్లిపోవడమే మంచిదని..దానికి ఇదే సరైన సమయంగా పలువురు తిరిగి సొంత రాష్ట్రాలకు బయల్దేరుతున్నారు.

గతేడాది కరోనాను అరికట్టేందుకు తీసుకున్న కఠిన నిర్ణయాల్లో లాక్‌డౌన్‌ ఒకటి. అయితే..ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనుల్లేక..ఉండేందుకు చోటు లేక ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి సొంతూళ్లకు చేరుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ చాలా మంది నగరాలు, పట్టణాలకు వచ్చి పని చేసుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఉండటంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఆయా రాష్ట్రాలు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటిస్తే  ఇక్కట్లు తప్పవంటున్నారు. మరికొందరైతే ఇప్పుడే సొంతూళ్లకు వెళ్లితేనే మంచిదంటూ పయనమవుతున్నారు.