
- మహారాష్ట్రకు పత్తి ఫీజు పేరుతో దోపిడి
- మహారాష్ట్ర లో పత్తి అమ్ముకునేందుకు వెళ్తున్న రైతుల నుంచి ఫీజు వసూలు
- సిర్పూర్ -టీ లో చెక్ పోస్టు రూ. 1500 నుంచి రూ. 5వేల దాకా వసూళ్లు
ఆసిఫాబాద్/కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని సిర్పూర్ నియోజకవర్గం మార్కెట్ కమిటీ తీరు వివాదాస్పదంగా మారుతోంది. పంటను అమ్ముకునేందుకు మహారాష్ట్రకు వెళ్తున్న పత్తి రైతుల నుంచి మార్కెట్ ఫీజ్ పేరుతో రూ. వేలల్లో వసూల్ చేస్తున్నారు. బార్డర్ ఏరియాల్లో రెండు ప్రత్యేక కౌంటర్లు పెట్టిమరీ ఫీజులు గుంజుతున్నారు. నియోజక వర్గంలోని గ్రామాల్లో ఈ సారి ఎక్కువగా పత్తి పండింది. కానీ రేటు లేదు. మహారాష్ట్ర లోని రాజురా, వీరుర్, హింగన్ ఘాట్ ప్రాంతాల్లో ఇక్కడకన్నా రేటు మూడు నుంచి అయిదు వందల ఎక్కువ వస్తోంది. దీంతో రైతులు వంద అయినా చాలు అంటూ సుమారు వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరం వ్యాన్ లు కిరాయి తీసుకుని వెళ్తున్నారు. ఇదే సమయంలో మన రాష్ట్రం లో జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మితే చాలా మంది నెట్ క్యాష్ ఇవ్వకుండా మూడు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు గడువు పెడుతున్నారు. అదే మహారాష్ట్ర లో అయితే పంట అమ్మిన వెంటనే ఎటువంటి కటింగ్ లేకుండా క్యాష్ ఇస్తుడడం తో రైతులు మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు.
బార్డర్లో మార్కెట్ కమిటీ కౌంటర్లు..
పత్తి పంట చేతికి వచ్చిన నవంబర్ నుంచి బార్డర్ ఏరియాల్లో స్పెషల్ కౌంటర్లు పెట్టారు. సిర్పూర్ టీ తో పాటు మహారాష్ట్రకు వెళ్ళే బ్రిడ్జి ఉన్న వెంకట్రావ్ పేట్ లో నది ఒడ్డున చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. నవంబర్ 26 న ఈ సెంటర్ లు ప్రారంభం అయ్యాయి. మార్కెట్ వ్యాల్యు మీద ఒక శాతం రైతు వ్యాపారి మార్కెట్ కమిటీకి చెల్లించాల్సి ఉంది. దీంతో బొలేరో వాహనానికి రూ.1500–1800, వ్యాన్ కు రూ. 4500–5వేల దాకా వసూలు చేస్తున్నారు. కాగజ్ నగర్ తో పాటు కొన్ని మండలాల్లో పేరున్న వ్యాపారులు తమ లాబీయింగ్ తో మార్కెట్ కమిటీ పెద్దలను మచ్చిక చేసుకొని ముందస్తు ఒప్పందంలో భాగంగా ‘మార్కెట్ ఎంట్రీ’ పేరిట ఈ విధానాన్ని అమలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. రైతులు, చిన్న వ్యాపారుల నుంచి ఫీజు వసూలు చేస్తుండగా.. బడా వ్యాపారుల వ్యాన్‌కు కేవలం రూ. 100 చెల్లించి వెళ్లిపోతున్నారని రైతులు వాపోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కౌంటర్ దగ్గ ఎంట్రీ వాహనాల లిస్ట్ రెఢీ చేసి, వచ్చిన వెంటనే నోట్ చేసుకొని పంపిస్తున్నారు.
ఫారెస్ట్ ఆఫీస్ ముందు, వెంకట్రావ్ పేట్ వద్ద పొడ్సా బ్రిడ్జి సమీపంలో రెండు చెక్ పోస్టు లు ఏర్పాటు చేశారు. ఇందులో అధికారులు సిబ్బంది కన్నా ప్రైవేటు వ్యక్తులే ఎక్కువ ఉంటున్నారు. వేలల్లో మార్కెట్ ఫీజు కట్టలేక రైతులు, వ్యాన్ యజమానులు చేన్ల బాటల్లో వెళ్తున్నారు. ఎంట్రీ ఉన్న బండ్లు ఇచ్చే వంద తో ప్రైవేట్ వర్కర్ల కు జీతాలు ఇస్తున్నట్లు చెబుతుండగా, మార్కెట్ కమిటీ నుంచి ఒక్కొక్కరికి నెలకు 8 నుంచి 12 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
క్వింటాల్‌కు రూ.వంద లాస్
మార్కెట్ కమిటీ వసూలు చేస్తున్న సెస్, ఫీజు వసూలు తో రైతుకు క్వింటాల్ కి వంద నష్టం జరుగుతోంది. రూ. 56 లక్షల వసూలు అయినట్లు చెబుతున్నారు మార్కెట్ కమిటీ సెక్రటరీ భాస్కర్. సిర్పూర్ టీ లో రెండు సెంటర్ల ద్వారా 30లక్షలు, మార్కెట్ కమిటీ లో చెల్లింపు తో 26 లక్షల వసూలు అయ్యాయంటున్నారు. మహారాష్ట్ర లో పత్తి అమ్మేందుకు వెళ్ళే రైతుల నుంచి ఒకలా, ఎంట్రీ బండ్లకు ఒకలా , చిరు వ్యాపారుల వాహనాలకు వేర్వేరుగా.. సెస్వసూలు చేయడం పై మార్కెట్ కమిటీ సెక్రటరీ భాస్కర్ ను వివరణ కోరగా రైతులు అమ్మే వాటికి అగ్రికల్చర్ ఆఫీసర్లు రాసిస్తే వదిలేస్తున్నామని చెప్పారు. ఎంట్రీ వ్యాన్ లు ఇస్తూ వెళ్తుండడం పై స్పందిస్తూ.. ‘వాళ్ళు మాకు ట్యాక్స్ కడుతున్నారని ’చెప్పారు. ఎంట్రీ వాహనాలు ఒక ట్రిప్ కు వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్న విషయం పై ప్రశ్నించగా.. ‘అవును.. కావచ్చు...’ అంటూ సమాధానం చెప్పారు.