రాష్ట్రం వచ్చాక ప్రైవేటు కాలేజీల్లో మూడు సార్లు ఫీజుల పెంపు

రాష్ట్రం వచ్చాక ప్రైవేటు కాలేజీల్లో మూడు సార్లు ఫీజుల పెంపు
  • బీసీ,ఈబీసీలకు ఇచ్చే రీయింబర్స్ మెంట్ పెంచని సర్కార్​
  • ఎంబీఏ,ఎంసీఏ, బీఫార్మసీ కోర్సులది ఇదే పరిస్థితి
  • గతేడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలే
  • మొత్తం బకాయిలు రూ.2,843 కోట్లు

 

రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు మూడేండ్లకోసారి ప్రభుత్వమే అధికారికంగా పెంచుతోంది. కానీ ఆ కాలేజీల్లో చదివే బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు అందించే ఫీజు రీయింబర్స్ మెంట్ మాత్రం పెంచుతలేదు. ఇదేదో మూడు, నాలుగేండ్ల నుంచి కాదు.. ఏకంగా 12ఏండ్లుగా ఇట్లనే కొనసాగిస్తోంది. దీంతో ఎంసెట్ లో పదివేలకుపైగా ర్యాంకు వచ్చిన పేద విద్యార్థులు ఏటా వేల రూపాయలు జేబుల్లోంచి కట్టాల్సిన పరిస్థితి. బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల్లోనూ ఇదే దుస్థితి కొనసాగుతోంది. మరోపక్క మూడేండ్ల నుంచి ఫీజురీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను ప్రభుత్వం టైమ్​కు ఇవ్వడం లేదు. దీంతో ఇటు స్టూడెంట్లు, అటు మేనేజ్మెంట్లకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.

బీసీ, ఈబీసీ స్టూడెంట్లను పట్టించుకుంటలే
రాష్ట్రంలో ఉన్న 165 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 77వేల మంది చేరారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టూడెంట్లకు, సర్కారు కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఎంత ఫీజుంటే అంత ప్రభుత్వం చెల్లిస్తోంది. బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు మాత్రం ఎంసెట్​లో 10వేల లోపు ర్యాంకు వారికే పూర్తి ఫీజు చెల్లిస్తోంది. ఆపై ర్యాంకులు పొందిన విద్యార్థులకు రూ.35వేలు మాత్రమే ఇస్తుండగా, మిగిలిన మొత్తం విద్యార్థులే చేతి నుంచి కట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ కాలేజీలోనూ రూ.35వేల ఫీజు లేదు. 80 శాతం కాలేజీల్లో ఫీజు రూ.60వేలకు పైగా ఉంది. సర్కారు కాలేజీల్లోనూ ఈ ఏడాది నుంచి రూ.50వేలకు పెంచారు. కానీ ప్రభుత్వం మాత్రం బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు మినిమమ్ ఫీజు అంటూ కేవలం రూ.35వేలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది.

12 ఏండ్లుగా ఫీజు రీయింబర్స్​మెంట్ పెంచలే
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో మూడేండ్ల కోసారి టీఏఎఫ్​ఆర్సీ ద్వారా ప్రభుత్వం అధికారికంగా ఫీజు లు పెంచుతున్నది. తెలంగాణ వచ్చిన తర్వాత 3సార్లు పెరిగాయి. చాలా కాలేజీల్లో ఫీజు రూ.90వేల నుంచి రూ.లక్ష దాటింది. కానీ ఎంసెట్​లో 10వేల పైన ర్యాంకు వచ్చిన బీసీ, ఈబీసీ స్టూడెంట్లకు ఇచ్చే ఫీజు రీయింబర్స్​మెంట్ రూ.35వేల మొత్తాన్ని మాత్రం పెంచడం లేదు. 2009–10 నుంచి ఇదే ఫీజు ఇస్తున్నారని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్​లో 55వేల మంది వరకు రీయింబర్స్​మెంటు పొందుతున్నారు. వీరిలో 30వేల మందికిపైగా స్టూడెంట్ల పై ఈ ఫీజుల భారం పడుతోంది. మరోపక్క ఎంబీఏ, ఎంసీఏ, బీ ఫార్మసీలోనూ ఇదే విధానంతో బీసీ, ఈబీసీ విద్యార్థులు నష్టపోతున్నారు. 

ఫీజు బకాయిలు వేల కోట్లు
రాష్ట్రంలో స్కాలర్ షిప్​లు, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఏటా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 2022 –23 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ తదితర శాఖల నుంచి స్కాలర్ షిప్​ల కోసం 12.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో రెన్యువల్ స్టూడెంట్లు 8లక్షల మంది వరకూ ఉంటారు. అక్టోబర్ 15 వరకూ దరఖాస్తునకు అవకాశముంది. అయితే 2021–22కు సంబంధించి అప్లై చేసిన స్టూడెంట్లకు ఇప్పటికీ పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. గతేడాదికి సంబంధించి రూ.2,566 కోట్ల బకాయిలున్నాయి. 2020–21 బకాయిలూ భారీగానే ఉండగా, ఇటీవలే కొన్ని రిలీజ్ చేసినట్టు అధికారులుచెప్తున్నారు. ఈ లెక్కన ఇప్పటికీ రూ.2843 కోట్ల బకాయిలున్నట్టు అధికారులు చెప్తున్నారు. సకాలంలో ఫీజురీయింబర్స్ మెంట్ ఇవ్వకపోవడంతో మేనేజ్మెంట్లు స్టూడెంట్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఫీజులు ఇస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధిస్తున్నాయి. మరోపక్క రీయింబర్స్ మెంట్ రాకపోవడంతో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లపైనా నిర్వహణ భారంపడుతోంది.

ఫీజు అంతా సర్కారే కట్టాలి
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో బీసీ, ఓబీసీ స్టూడెంట్లపై సర్కారు కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. ఎంసెట్ లో 10వేలకు పైగా ర్యాంకు పొందిన వారికి కేవలం రూ.35వేలు ఇవ్వడం వివక్ష చూపించడమే. ఎంబీఏ, బీ ఫార్మసీలోనూ మినిమమ్ ఫీజు మాత్రమే ఇవ్వడం సరికాదు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్ల మాదిరిగా బీసీ స్టూడెంట్లకు మొత్తం ఫీజును ప్రభుత్వమే భరించాలి. స్కాలర్ షిప్​ బకాయిలు రిలీజ్ చేయకపోవడడంతో కాలేజీ మేనేజ్మెంట్లు స్టూడెంట్లను వేధిస్తున్నాయి. కాబట్టి వెంటనే ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలి.
- నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి 

అప్పులతో కాలేజీలు నడుపుతున్నం
రెండేండ్ల నుంచి టైమ్​కు స్కాలర్ షిప్​లు విడుదల కావడం లేదు. అద్దెలు, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాలకు డబ్బుల్లేక ఇబ్బందులుపడుతున్నాం. అప్పులు చేసి కాలేజీలు నడుపుతున్నం. 
- గౌరీ సతీశ్, కేజీ టూ పీజీa ప్రైవేటు విద్యాసంస్థల కన్వీనర్