
= ఏపీ తరహాలో అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించాలని రిక్వెస్ట్
= త్వరలోనే ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహిస్తామన్న మంత్రి
హైదరాబాద్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్అసిస్టెంట్లు, సిబ్బందికి పెండింగ్లో ఉన్న జీతాలకు రూ. 62 కోట్లను ప్రభుత్వం విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఫీల్డ్అసిస్టెంట్లుబుధవారం (మే 7) హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి జీతాలు విడుదల చేయించిన సీతక్కను సన్మానించారు.
ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న వారిని వివిధ కేటగిరీలుగా విభజించడం వల్ల తము నష్టపోతున్నామని.. అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మంత్రిని కోరారు. ఏపీలో అనుసరిస్తున్నట్లుగా తెలంగాణలో కూడా అందరినీ ఒకే కేటగిరిగా పరిగణించాలన్నారు.
అలాగే జీతాల్లో కోత విధించేందుకు తెచ్చిన 4779 సర్క్యూలర్‌ను రద్ద చేయాలని కోరారు.
►ALSO READ | హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ ముఖ్యం : కలెక్టర్ సంతోష్
ఈ మేరకు తక్షణం స్పందించిన మంత్రి సీతక్క.. సంబంధిత అధికారులకు ఏపీ విధానాన్ని అధ్యయనం చేసి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జీతాల్లో ఎలాంటి కోతలు లేకుండా.. వారితో చేయించుకున్న పనికి వేతనం దక్కేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ తో సంబంధం లేని పాలనపరమైన సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది సంఘాలు ప్రతినిధులతో త్వరలో సమావేశ నిర్వహిస్తామని సీతక్క హామీ ఇచ్చారు.