జూబ్లీహిల్స్, వెలుగు: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌లో లెటర్‌హెడ్ ఫోర్జరీ చేసి బ్యాంక్ ఖాతా కార్యకలాపాలను నిలిపివేయాలని బ్యాంకుకు లేఖ సమర్పించారని యూనియన్ అధ్యక్షుడు అమ్మిరాజు కనుమిల్లి ఆరోపించారు.
ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్‌కు చెందినవిగా పేర్కొంటూ సెప్టెంబర్ 12, సెప్టెంబర్ 28 తేదీలతో కొన్ని లెటర్‌హెడ్‌లను రూపొందించి, వాటిని అనధికారికంగా ఉపయోగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా యూనియన్ పేరుతో సమావేశం నిర్వహించి, అడహక్ కమిటీని ఏర్పాటు చేశారన్నారు.
సెప్టెంబర్ 28న యూనియన్ పేరుతో మరో లేఖను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌కు సమర్పించి, ఖాతా కార్యకలాపాలను నిలిపివేయాలని కొందరు కోరారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో డి.యోగానంద్, రషీద్ అహ్మద్ ఖాన్, శివ ప్రసాద్, కేవీవీ. బాలసుబ్రహ్మణ్యం, రమేశ్‌బాబు, కోన సుబ్బారావు, ఎన్యూ నాగేశ్వరరావు, కేఎస్ రవి బాబు, ఐ.లక్ష్మణ్, ఎ.వేణు, బి.ఈశ్వర ప్రసాద్, చిన్నారావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
